Schneider Electric
-
ష్నైడర్ ఎలక్ట్రిక్ భారీ పెట్టుబడులు
బెంగళూరు: ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్ దేశీయంగా తయారీపై భారీ పెట్టుబడులకు సిద్ధపడుతోంది. 2026కల్లా తయారీ ప్లాంట్లపై రూ. 3,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. తద్వారా దేశ, విదేశాలలో అమ్మకాలకు భారత్‌ను తయారీ కేంద్రంగా వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. ఈ బాటలో స్థానికంగా డేటా సెంటర్లకు అవసరమయ్యే కూలింగ్ సొల్యూషన్స్‌ను ఉత్పత్తి చేసేందుకు రూ. 100 కోట్లతో ఏర్పాటు చేసిన ప్లాంటును తాజాగా ప్రారంభించింది. ప్రణాళికల్లో భాగంగా గ్రూప్ తయారీ కేంద్రంగా భారత్‌లో పెట్టుబడులు చేపట్టనున్నట్లు ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రెసిడెంట్, గ్రేటర్ ఇండియా జోన్ ఎండీ, సీఈవో దీపక్ శర్మ వెల్లడించారు. వివిధ ప్రొడక్టులు, సొల్యూషన్ల తయారీకి దేశవ్యాప్తంగా తయారీ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు కూలింగ్ సొల్యూషన్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా తెలియజేశారు. వెరసి మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, పశి్చమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఒడిషాలలో యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజా యూనిట్‌తో కలిపి ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 30 ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. -
ష్నైడర్ ఎలక్ట్రిక్ రూ.425 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: డిజిటల్ ఆటోమేషన్, ఇంధన నిర్వహణ రంగ సంస్థ ష్నైడర్ ఎలక్ట్రిక్.. బెంగళూరులో నూతన స్మార్ట్ ఫ్యాక్టరీ అభివృద్ధికి రూ.425 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. ఈ కేంద్రం రాకతో బెంగళూరులోని కంపెనీకి చెందిన 10 ఫ్యాక్టరీలలో ఆరింటిని ఒకే గొడుకు కిందకు తీసుకువస్తుందని సంస్థ తెలిపింది. నూతన కేంద్రాన్ని ప్రస్తు త 5 లక్షల చదరపు అడుగుల నుండి 10 లక్షల చ.అడుగులకు విస్తరిస్తారు. సింగిల్, త్రీ ఫేజ్ యూపీఎస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ యూని ట్స్, రెనివేబుల్ ఎనర్జీ ప్రొడక్ట్స్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ డేటా సెంటర్లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. విస్తరణ ద్వారా కొత్తగా 1,000 మందికి ఉపాధి అ వ కాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఈ కేంద్రంలో 2,000 మంది పనిచేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. -
రాష్ట్రంలో ‘ష్నైడర్’ రెండో ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ పరికరాల తయారీ, ఆటోమేషన్ రంగంలో ఉన్న ష్నైడర్ ఎలక్ట్రిక్ తెలంగాణలో మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. శంషాబాద్ వద్ద 18 ఎకరాల్లో ఇది రానుంది. రూ. 300 కోట్ల వ్యయంతో చేపడుతున్న తొలి దశ 2023 సెప్టెంబర్‌కు సిద్ధం అవుతుంది. ఉత్పత్తుల తయారీకి స్మార్ట్ యంత్రాలు, ఉపకరణాలను ఉపయోగించనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. కొన్ని ఉత్పత్తులను దేశంలో తొలిసారిగా శంషాబాద్ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. 30కిపైగా దేశాలకు ఇక్కడ తయారైన సరుకు ఎగుమతి చేస్తారు. భారత్‌లో సంస్థకు ఇది 31వ కేంద్రం కాగా తెలంగాణలో రెండవది. స్మార్ట్ ఫ్యాక్టరీలపరంగా కంపెనీకి దేశంలో ఇది ఎనిమిదవది కానుంది. అత్యంత స్మార్ట్ ఫ్యాక్టరీ.. భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయల్ లెనిన్తో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ష్నైడర్ ప్రతిపాదిత నూతన కేంద్రానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కొత్త ప్లాంటు మూడు దశలు పూర్తి అయితే 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. భారత్‌లో కంపెనీకి ఇది అతిపెద్ద, అత్యంత స్మార్ట్ ఫ్యాక్టరీ అవుతుందని చెప్పారు. 75 శాతం ఉత్పత్తులు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయని వివరించారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాల్సిందిగా కంపెనీ ప్రతినిధులను ఆయన కోరారు. టాప్–3లో భారత్.. ష్నైడర్‌కు ప్రపంచంలోని టాప్–3 మార్కెట్లలో భారత్ ఒకటి. సంస్థ కార్యకలాపాల్లో 10 శాతం వాటాను కైవసం చేసుకుంది. 77% ఉత్పత్తులు, సొల్యూషన్స్ భారత్‌లో అభివృద్ధి చేసినవేనని సంస్థ ఇండియా ప్రెసిడెంట్ అనిల్ చౌదరి వెల్లడించారు. ‘భారత్‌లో విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో 90% దేశీయంగా తయారైనవి. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ విద్యుత్ పరికరాలను ఇప్పటికే సరఫరా చేస్తున్నాం. చార్జింగ్ స్టేషన్లను సొంతంగా ఏర్పాటు చేస్తాం. శంషాబాద్ ఫెసిలిటీకి మూడు దశల్లో కలిపి 4–5 ఏళ్లలో రూ.900 కోట్ల దాకా పెట్టుబడి పెడతాం’ అని చౌదరి వివరించారు. భారత్‌లోనే అధికం.. ఇప్పటికే హైదరాబాద్‌లో ష్నైడర్‌కు తయారీ యూనిట్ ఉంది. ఈ ప్లాంటులో రెండు వేల మంది పనిచేస్తున్నా రు. శంషాబాద్ కేంద్రం రాకతో తొలిదశలో ప్రత్యక్షంగా వెయ్యిమందికి, పరోక్షంగా 8 వేలమందికి ఉపాధి అవ కాశాలు ఉంటాయని గ్లోబల్ సప్లై చైన్ ఎస్వీపీ జావెద్ అహ్మద్ తెలిపారు. భారత్‌లో సంస్థ ఉద్యోగుల సంఖ్య 35 వేలు. వారిలో 5,500 మంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ష్నైడర్లో 1.60 లక్షల మంది పనిచేస్తుండగా భారత్‌లోనే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తుండటం విశేషం. హైదరాబాద్‌లో ‘హౌస్ ఆఫ్ ఫ్రాన్స్’ తెలంగాణ, ఫ్రాన్స్ నడుమ వాణిజ్య సంబంధాలు, రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘హౌస్ ఆఫ్ ఫ్రాన్స్’ పేరిట కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించడాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్వాగతించారు. 2023 అర్ధభాగంలో కొత్త ఫ్రెంచ్ బ్యూరో పనిచేయడం ప్రారంభిస్తుందని, ఇది వాణిజ్య కార్యకలాపాల కేంద్రంగా పనిచేయడంతోపాటు కాన్సులార్, వీసా సేవలను కూడా అందిస్తుందన్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు, బిజినెస్ వర్గాలకు ఫ్రాన్స్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతాయన్నారు. ఫ్రెంచ్ బిజినెస్ మిషన్ బృందం గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, పారిశ్రామిక విధానాలు, సాధించిన విజయాలు, పెట్టుబడి అవకాశాలపై కేటీఆర్ ఆ బృందానికి వివరించారు. ఈ భేటీలో ఫ్రెంచ్ బృందం ప్రతినిధులు పాల్ హెర్మెలిన్, గెరార్డ్ వోల్ఫ్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇ. విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
గ్లోబస్ స్పిరిట్స్ అప్- ష్నీడర్ ఎలక్ట్రిక్ డౌన్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఆల్కహాల్ బెవరేజెస్ కంపెనీ గ్లోబస్ స్పిరిట్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. అయితే మరోవైపు ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో విద్యుత్ రంగ ఆధునిక ప్రొడక్టుల కంపెనీ ష్నీడర్ ఎలక్ట్రిక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి గ్లోబస్ స్పిరిట్స్ భారీ లాభాలతో కళకళలాడుతుంటే.. ష్నీడర్ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం.. గ్లోబస్ స్పిరిట్స్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో గ్లోబస్ స్పిరిట్స్ నికర లాభం 285 శాతం దూసుకెళ్లి రూ. 19 కోట్లను అధిగమించింది. పన్నుకు ముందు లాభం సైతం 326 శాతం ఎగసి రూ. 22 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర అమ్మకాలు మాత్రం యథాతథంగా రూ. 272 కోట్లుగా నమోదయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్లోబస్ స్పిరిట్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కొనేవాళ్లు అధికంకావడంతో రూ. 11 లాభపడి రూ. 119 వద్ద ఫ్రీజయ్యింది. ష్నీడర్ ఎలక్ట్రిక్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ష్నీడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా రూ. 27 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 1.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. పన్నుకు ముందు నష్టం రూ. 26 కోట్లుగా నమోదైంది. నికర అమ్మకాలు సైతం 20 శాతం నీరసించి రూ. 230 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ష్నీడర్ ఎలక్ట్రిక్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7.5 శాతం పతనమైంది. రూ. 83 దిగువన కదులుతోంది. తొలుత రూ. 80.5 వరకూ క్షీణించింది. -
బెంగళూరులో ష్నైడర్ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ
న్యూఢిల్లీ: గ్లోబల్ ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్ కంపెనీ ష్నైడర్ ఎలక్ట్రిక్.. తాజాగా బెంగళూరులో స్మార్ట్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. పరిశ్రమలకు అవసరమైన యూపీఎస్ సిస్టమ్స్, విద్యుత్ మోటారు భ్రమణ వేగాన్ని నియంత్రించే వేరియబుల్ స్పీడ్ వంటి వాటిని ఇక్కడ ఉత్పత్తి చేయనుంది. నూతన ప్లాంట్ కోసం 700 మందిని నియమించుకున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హైదరాబాద్‌లో ఈ సంస్థ ఫ్యాక్టరీని ప్రారంభించింది. 2020 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 100 స్మార్ట్ ఫ్యాక్టరీలను ప్రారంభించాలని లక్ష్యంగా ప్రకటించింది. -
ష్నిడర్ చేతికి ఎల్–టీ ఆటోమేషన్
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) తన ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ (ఈ అండ్ ఏ) వ్యాపారాన్ని విక్రయిస్తోంది. ఈ వ్యాపారాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ష్నిడర్ ఎలక్ట్రిక్ కంపెనీ, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ టెమసెక్ హోల్డింగ్స్‌లు రూ.14,000 కోట్లకు అంతా నగదులోనే కొనుగోలు చేస్తున్నట్లు ఎల్ అండ్ టీ తెలిపింది. ఈ మేరకు ష్నిడర్ ఎలక్ట్రిక్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలియజేసింది. ‘‘కీలకం కాని కార్యకలాపాల నుంచి వైదొలగాలనే దీర్ఘకాల వ్యూహంలో భాగంగా ఈ వ్యాపారాన్ని విక్రయించాం. ఒప్పందంలో భాగంగా మా ఎలక్ట్రికల్, ఆటోమేషన్ వ్యాపార విభాగాన్ని, దీనికి అనుబంధంగా విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలను కూడా ష్నిడర్ ఎలక్ట్రిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ష్నిడర్ ఎలక్ట్రిక్ జేవీ హోల్డింగ్స్‌కు విక్రయిస్తున్నాం. ఈ విక్రయం నుంచి మెరైన్ స్విచ్‌గేర్, సర్వోవాచ్ సిస్టమ్స్‌ను మినహాయిస్తున్నాం. అయితే దీనికి ప్రభుత్వ పరమైన ఆమోదాలు పొందాల్సి ఉంది’’ అని ఎల్ అండ్ టీ తెలియజేసింది. ఈ మేరకు మంగళవారం ఒప్పందం కుదిరిందని, 18 నెలల్లో వాటా విక్రయం పూర్తవుతుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎమ్డీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ష్నిడర్ ఎలక్ట్రిక్ ఇండియాలో ష్నిడర్ కంపెనీకి 65 శాతం, టెమసెక్కు 35 శాతం చొప్పున వాటాలున్నాయి. రూ.5,038 కోట్ల ఆదాయం... ఈ ఎలక్ట్రికల్, ఆటోమేషన్ వ్యాపారం ఆదాయం 2016–17లో రూ.5,038 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.3,590 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎల్ అండ్ టీ మొత్తం ఆదాయంలో ఇది 4.5 శాతానికి సమానం. కాగా ఈ విక్రయంలో భాగంగా ఎల్అండ్టీ ఎలక్ట్రికల్, ఆటోమేషన్ వ్యాపార విభాగం కింద కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ అనుబంధ సంస్థలు– టామ్‌కో స్విచ్‌గేర్ మలేషియా, టామ్‌కో ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ ఆస్ట్రేలియా, టామ్‌కో ఇండోనేషియా, ఎల్ అండ్ టీ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ సౌదీ అరేబియా, ఎల్ అండ్ టీ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ మలేషియా, కన కంట్రోల్స్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ కువైట్‌లు... ఇక నుంచి ష్నిడర్ పరమవుతాయి. ఈ లావాదేవీకి సలహాదారులుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటిగ్రూప్లు వ్యవహరిస్తున్నాయి. కాగా ఫ్రాన్స్ కేంద్రంగా ష్నిడర్ ఎలక్ట్రిక్ ఎస్ఈ కంపెనీ 180 ఏళ్ల నుంచీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంధన మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ తదితర సేవలతో కూడిన ఆటోమేషన్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
పెరగనున్న లో వోల్టేజీ విద్యుత్ ఉపకరణాల ధరలు
అధిక జీఎస్టీ కారణం: స్నీడర్ ఎలక్ట్రిక్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలు తర్వాత అంటే జూలై 1 నుంచి 1,000 ఓల్టేజ్ కంటే తక్కువ సామర్థ్యమున్న విద్యుత్ ఉపకరణాల ధరలు 10–15% మేర పెరుగుతాయని స్నీడర్ ఎలక్ట్రిక్ రీజినల్ డైరెక్టర్ ప్రేమ్ రాచకొండ తెలిపారు. ప్రస్తుతం వీటికి 14.5–25% పన్ను శ్లాబులుండగా.. జీఎస్టీలో వీటికి 28% పన్ను శ్లాబును కేటాయించడమే కారణమని ఆయన పేర్కొన్నారు. ఎంసీబీ, ఆర్సీసీబీ, డిస్ట్రిబ్యూషన్ బోర్డులు, స్విచులు వంటి ఫైనల్ డిస్ట్రిబ్యూషన్ వైరింగ్ డివైజ్ మార్కెట్ దేశంలో రూ.5 వేల కోట్లుగా ఉందని.. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా రూ.325 కోట్లని తెలియజేశారు. ఏటా ఈ విభాగం 3–4% వృద్ధిని సాధిస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విభాగంలో వ్యాపార విస్తరణలో భాగంగా స్విచ్ ఆన్ ఇండియా పేరిట మొబైల్ క్యాంపెయిన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాన్‌లో ఎలక్ట్రిక్, వైరింగ్ ఉపకరణాలను ప్రదర్శిస్తారు. వచ్చే నెల రోజుల్లో 8 వాహనాలు దేశంలోని 100 నగరాల్లో ప్రచారం చేస్తామన్నారు. -
ఫార్మా ఆటోమేషన్ @రూ.290 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫార్మా రంగంలో ఆటోమేషన్ వ్యాపార అవకాశాల పరిమాణం సుమారు రూ.290 కోట్లు ఉంటుందని ష్నీడర్ ఎలక్ట్రిక్ తెలిపింది. 2020 నాటికి ఇది రెండింతలవుతుందని కంపెనీ లైఫ్‌సెన్సైస్ సొల్యూషన్స్ డెరైక్టర్ రాకేశ్ ముఖీజా గురువారమిక్కడ తెలిపారు. యాంత్రికీకరణ (ఆటోమేషన్) వ్యవస్థ కారణంగా విద్యుత్‌కు అయ్యే వ్యయం 25-30 శాతం దాకా తగ్గుతుందని చెప్పారు.