న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) తన ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ (ఈ అండ్ ఏ) వ్యాపారాన్ని విక్రయిస్తోంది. ఈ వ్యాపారాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ష్నిడర్ ఎలక్ట్రిక్ కంపెనీ, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ టెమసెక్ హోల్డింగ్స్‌లు రూ.14,000 కోట్లకు అంతా నగదులోనే కొనుగోలు చేస్తున్నట్లు ఎల్ అండ్ టీ తెలిపింది. ఈ మేరకు ష్నిడర్ ఎలక్ట్రిక్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలియజేసింది.
‘‘కీలకం కాని కార్యకలాపాల నుంచి వైదొలగాలనే దీర్ఘకాల వ్యూహంలో భాగంగా ఈ వ్యాపారాన్ని విక్రయించాం. ఒప్పందంలో భాగంగా మా ఎలక్ట్రికల్, ఆటోమేషన్ వ్యాపార విభాగాన్ని, దీనికి అనుబంధంగా విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలను కూడా ష్నిడర్ ఎలక్ట్రిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ష్నిడర్ ఎలక్ట్రిక్ జేవీ హోల్డింగ్స్‌కు విక్రయిస్తున్నాం. ఈ విక్రయం నుంచి మెరైన్ స్విచ్‌గేర్, సర్వోవాచ్ సిస్టమ్స్‌ను మినహాయిస్తున్నాం.
అయితే దీనికి ప్రభుత్వ పరమైన ఆమోదాలు పొందాల్సి ఉంది’’ అని ఎల్ అండ్ టీ తెలియజేసింది. ఈ మేరకు మంగళవారం ఒప్పందం కుదిరిందని, 18 నెలల్లో వాటా విక్రయం పూర్తవుతుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎమ్‌డీ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ష్నిడర్ ఎలక్ట్రిక్ ఇండియాలో ష్నిడర్ కంపెనీకి 65 శాతం, టెమసెక్‌కు 35 శాతం చొప్పున వాటాలున్నాయి.
రూ.5,038 కోట్ల ఆదాయం...
ఈ ఎలక్ట్రికల్, ఆటోమేషన్ వ్యాపారం ఆదాయం 2016–17లో రూ.5,038 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.3,590 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎల్ అండ్ టీ మొత్తం ఆదాయంలో ఇది 4.5 శాతానికి సమానం.
కాగా ఈ విక్రయంలో భాగంగా ఎల్‌అండ్‌టీ ఎలక్ట్రికల్, ఆటోమేషన్ వ్యాపార విభాగం కింద కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ అనుబంధ సంస్థలు– టామ్‌కో స్విచ్‌గేర్ మలేషియా, టామ్‌కో ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ ఆస్ట్రేలియా, టామ్‌కో ఇండోనేషియా, ఎల్ అండ్ టీ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ సౌదీ అరేబియా, ఎల్ అండ్ టీ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ మలేషియా, కన కంట్రోల్స్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ కువైట్‌లు... ఇక నుంచి ష్నిడర్ పరమవుతాయి.
ఈ లావాదేవీకి సలహాదారులుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటిగ్రూప్‌లు వ్యవహరిస్తున్నాయి. కాగా ఫ్రాన్స్ కేంద్రంగా ష్నిడర్ ఎలక్ట్రిక్ ఎస్‌ఈ కంపెనీ 180 ఏళ్ల నుంచీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంధన మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ తదితర సేవలతో కూడిన ఆటోమేషన్ సొల్యూషన్స్ అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment