సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వ్యవహారం కొలిక్కి రాలేదు. సొంత ఖర్చుతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మరోసారి నిరాకరించింది. నీటిపారు దల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు సి.మురళీ ధర్, బి.నాగేందర్ రావు, నల్లా వెంకటేశ్వర్లుతో కలిసి ఎల్ అండ్ టీ డైరెక్టర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్‌వీ దేశాయ్ బృందంతో సమావేశమై బ్యారేజీ పునరు ద్ధరణపై చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో నాణ్యత లోపాలు ఎలా చోటుచేసుకున్నాయని మంత్రి ఎల్ అంట్ టీ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక లేఖ రాసి బ్యారేజీ పునరుద్ధరణ నుంచి తప్పుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
2020 జూన్ 29 నాటికి బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని, ఒప్పందం ప్రకారం పని పూర్తయి నట్టు ధ్రువీకరిస్తూ 2021 మార్చి 25న ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ లేఖ సైతం ఇచ్చారని ఎల్ అండ్ టీ బృందం వివరించింది. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ సైతం ముగిసిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని పేర్కొంది. గత అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోగా, మరుసటి రోజే బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమదేనని అంగీకరిస్తూ ఎల్ అండ్ టీ జనరల్ మేనేజర్ సురేశ్‌కుమార్ విడుదల చేసిన ప్రకటనను నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు మంత్రికి చూపించారు.
ఈ విషయంలో నిర్ణయం తీసుకునే స్థాయి కానీ, అధికారం కానీ సురేశ్‌కుమార్‌కు లేదని ఎల్ అండ్ టీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దేశాయ్ చెప్పినట్లు తెలిసింది. అప్పట్లో ఆయనపై ఒత్తిడి చేసి ప్రకటన ఇప్పించారని ఆరోపించినట్టు సమాచారం. ఎల్ అండ్ టీ బోర్డు సమావేశంలో చర్చించి ఆమోదించాకే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తయినా ఒప్పందం ప్రకారం చేయాల్సిన కొన్ని పనులు ఇంకా పూర్తి కాలేదని, చివరి బిల్లును సైతం ఇప్పటివరకు చెల్లించలేదని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతికంగా పనులు పూర్తికానట్టేనని వాదించారు.
ఇంకా అంచనాలే రూపొందించలేదా?
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణలో భాగంగా గోదావరిలో ఎగువ నుంచి వస్తున్న జలాలను దారి మళ్లించడానికి కాఫర్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుందని, ఇందుకు రూ.55.5 కోట్ల మేర ప్రతిపాదనలు సమర్పించాలని ఎల్ అండ్ టీ ప్రతినిధు లు ఉత్తమ్‌కు వివరించారు. కాఫర్ డ్యామ్‌కు అంత వ్యయం కాదని ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు బదులిచ్చారు. మీ అంచ నాల ప్రకారం ఎంత వ్యయం అవుతుందని ఉత్తమ్ ఆయన ను ప్రశ్నించారు.
ఇంకా అంచనాలు రూపొందించలేదని వెంకటేశ్వర్లు బదులివ్వగా, మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా పునాది కింద దృఢత్వం కోసం కటాఫ్ పైల్స్ వేయాల్సి ఉంటుందని, వీటిని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడానికే 45 రోజుల సమయం పడుతుందని ఎల్ అండ్ టీ ప్రతినిధులు వివరించారు.
అనుభవం కోసమే సర్టిఫికెట్ ఇచ్చి ఇరుక్కున్నారు..
మేడిగడ్డ పనులు చేసిన అనుభవం వాడుకుని కొత్త కాంట్రాక్టులు దక్కించుకోవడానికి ఎల్ అండ్ టీ సంస్థ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ కోరగా, ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ జారీ చేసేయడంతోనే సమస్య ఉత్పన్నమైందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒప్పందం ప్రకారం పనులన్నీ పూర్తికాకుండానే ఎలా జారీ చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సర్టిఫికెట్‌ను అడ్డంపెట్టుకుని ఎల్ అండ్ టీ సంస్థ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.
కారణమేంటో తేల్చండి!
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదన్న అంశంపై వివాదాన్ని పక్కనపెట్టి అసలు బ్యారేజీ కుంగడానికి కారణాలను వెలికి తీయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. సమస్యకు మూల కారణం తెలిసిన తర్వాత పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిని తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహించాలని, ఇందుకోసం నిర్మాణ సంస్థలను పిలిపించి మాట్లాడాలని ఆదేశించారు.
తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రితో సమావేశం అనంతరం కాఫర్ డ్యామ్ నిర్మాణం పనులను ప్రారంభించే అంశంపై ఎల్ అండ్ టీ బృందంతో ఈఎన్‌సీలు చర్చించారు. తక్షణమే పనులు ప్రారంభించాలని, అదనపు పనులకు ఏదైనా ఆర్థిక సహాయం అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment