సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని.. ప్రాజెక్టును నిర్మించిన అధికారులు, ఇంజనీర్లు ఏం చెప్తారో కమిషన్‌కే చెప్పుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం బ్యారేజీకి బుంగలు పడిన ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ ఈఎన్‌సీ (జనరల్) సి.మురళీధర్, కొత్తగూడెం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) బి.నాగేందర్‌రావు తదితరులతో సీఎం ఆదివారం రాత్రి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ నంబర్ బ్లాక్‌లో పిల్లర్ కుంగిపోగా.. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యతతమదేనని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ మరుసటి రోజే ప్రకటించిందని, ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం ఏమిటని ఈ సందర్భంగా రేవంత్ నిలదీసినట్టు తెలిసింది.
గత ప్రభుత్వంలో సొంత ఖర్చుతో మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు నిర్వహించేందుకు స్వచ్ఛందంగా అంగీకరించిన ఎల్‌అండ్‌టీ.. ఇప్పుడు ఎందుకు మాట మార్చిందని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ అంశంలో జ్యుడిషియల్ కమిషన్‌కు వివరణ ఇచ్చుకోవాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో నిబంధనల మేరకు ఎల్‌అండ్‌టీపై చర్యలకు ఉపక్రమించాలని, అందుకు ఉన్న అవకాశాలను నివేదించాలని ఆదేశించినట్టు సమాచారం.
కొత్త ప్రాజెక్టుల ఖర్చు వివరాలివ్వండి
గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులపై పూర్తి వివరాలు అందజేయాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా ఈ సమావేశంలో చర్చించారు.
ఇక యాసంగి పంటలకు నీళ్లిచ్చే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోయాయని, ఈ రెండు ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు యాసంగిలో సాగునీరు ఇవ్వలేమని సీఎంకు ఈఎన్‌సీలు నివేదించారు. దీంతో హైదరాబాద్ జంట నగరాలతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాకు వేసవిలో తాగునీటి సమస్య ఎదురవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
ఎగువన ఉన్న నారాయణపూర్ జలాశయం నుంచి కృష్ణానదిలో ఊట నీళ్లు వస్తాయని, మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీటి ఇబ్బందులు ఉండవని ఈఎన్‌సీలు సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఎండాకాలంలో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌లోని నిల్వలను పరిరక్షించాలని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం.
శాసనసభలో ప్రకటించి..
ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో నీటిపారుదల శాఖపై కీలక ప్రకటన చేస్తానని.. అన్ని వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. నాగార్జునసాగర్ ఆయకట్టుకు యాసంగిలో నీరు ఇవ్వలేని పరిస్థితి, దీనికి కారణాలు, బాధ్యులు ఎవరన్న అంశంపై సీఎం అసెంబ్లీలో ప్రకటన చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లోనే జ్యుడిషియల్ కమిషన్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వివరించాయి.
సాగర్ కింద క్రాప్ హాలిడే!
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు యాసంగిలో సాగునీటి సరఫరాపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సాయంత్రమే అధికారులతో సమీక్షించారు. సాగర్‌లో నిల్వలు అడుగంటిన నేపథ్యంలో యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించాలని ఈఎన్‌సీలు సూచించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment