ప్రాణహిత–చేవెళ్ల పునరుద్ధరణ | Telangana Ministers Team To Visit Medigadda Barrage | Sakshi
Sakshi News home page

ప్రాణహిత–చేవెళ్ల పునరుద్ధరణ

Dec 30 2023 2:02 AM | Updated on Dec 30 2023 5:36 PM

Telangana Ministers Team To Visit Medigadda Barrage - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో రూ.38 వేల కోట్లతో 16.40 లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పారు. రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి కాల్వలు కూడా తవ్వించామని, అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు మార్చిందని విమర్శించారు.

ఎన్ని కల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్‌ విచారణ చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించడంలో విఫల మైందని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని శుక్రవారం ఐదుగురు మంత్రుల బృందం పరిశీలించింది.

ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్‌ బాబు, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ వీరిలో ఉన్నారు. కాగా ఇరిగేషన్‌ ఈఎన్సీ మురళీధర్‌ ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన తర్వాత మంత్రులు మాట్లాడారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచే ఎన్నో అనుమానాలు ఉన్నాయని, తాము చెబుతూ వచ్చిన విషయాలే ఇప్పుడు నిజమయ్యాయని పేర్కొన్నారు.  

కాంగ్రెస్‌కు పేరొస్తుందనే: కోమటిరెడ్డి
‘ప్రాణహిత పూర్తయితే కాంగ్రెస్‌ పార్టీకి పేరొస్తుందనే సగం వరకు పనులు జరిగిన ప్రాజెక్టును వదిలేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరాన్ని చేపట్టింది. తుమ్మిడిహెట్టి వద్ద 3 వేల ఎకరాలు సేకరించి ఉంటే గ్రావిటీతో నీళ్లు వచ్చేవి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ చర్యలన్నీ తుగ్లక్‌ చర్యల్లా ఉన్నాయి. కొండపోచమ్మ ఎప్పుడూ నిండుగా ఉంటుంది. కానీ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు తప్ప ఇతర పొలాలకు నీరు పోదు. ఇక ఈ ప్రాజెక్టు పంపు హౌస్‌లలో నాణ్యత లేని మోటార్లు బిగించారు. ఇవన్నీ అసెంబుల్డ్‌ మోటార్లు. మోటార్లకు రూ.1,000 కోట్లకు బదులు రూ.4 వేల కోట్లు చెల్లించారు. నల్లగొండ జిల్లాకు సాగు నీరందించే ప్రాజెక్టులను చిన్నచూపు చూశారు..’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. 

రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలారు.. పొంగులేటి: ‘కేసీఆర్‌ ప్రతిచోటా తన మార్కు ఉండాలనే తాపత్రయంతో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. కాళేశ్వరం విషయంలో మొదటి నుంచి హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడం వల్లే ఇంత పెద్ద నష్టం జరిగింది. డయా ఫ్రం వాల్‌ ఆర్సీసీతో కట్టి ఉంటే ప్రమాదం జరిగేదా? సీకెండ్‌ ఫైల్‌ ఫెయిల్‌ అయినందుకే మేడిగడ్డ పియర్స్‌ రోజురోజుకూ కుంగిపోయాయి. ప్రొటెక్షన్‌ పనులు ఒక్క వరదకే పోయాయంటే ఎంత నాసిరకంగా చేశారో అర్థమవుతోంది. ప్రమాదం ఉందని 2022లోనే ఈఈ పై అధికారులకు లేఖ రాసినా చర్యలు తీసుకోలేదు. కుంగుబాటు కొన్ని పిల్లర్లతో ఆగుతుందని నేను అనుకోవడం లేదు...’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 

ప్రజలకు వివరించేందుకే..: శ్రీధర్‌బాబు
‘కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం, జరిగిన నష్టం ప్రజలకు వివరించేందుకు  ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర సంపద సక్రమంగా వినియోగించాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. గోదావరి జలాలతో భూపాలపల్లి, పెద్దపల్లికి సాగునీరు, తాగునీరు అందించాలని, ప్రత్యేక ప్రణాళిక ద్వారా మంథని ముంపు ప్రాంతాలను ఆదుకోవాలని సహచర మంత్రులను కోరుతున్నా..’ అని శ్రీధర్‌బాబు అన్నారు. 

గత ప్రభుత్వ మానస పుత్రిక: పొన్నం
‘కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం మానస పుత్రిక. దీని కోసం ఎంత విద్యుత్‌ వాడారో చెప్పాలి. రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉంది..’ అని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అనంతరం మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రదేశాన్ని పరిశీలించింది. అన్నారం బ్యారేజీని సందర్శన తర్వాత హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లింది. ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, ఎస్పీ కిరణ్‌ ఖరే, ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు. 

రూ. లక్ష కోట్లకు లక్ష ఎకరాల ఆయకట్టా?: ఉత్తమ్‌
‘కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.95,000 కోట్లు ఖర్చు చేసినట్లు గత పాలకులు చెబుతున్నారు. కానీ దానివల్ల ఏర్పడిన కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలే. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు. అద్భుతం అన్నారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్‌ కావడం దురదృష్టకరం. బ్యారేజీ కుంగిపోయినా ఆనాటి ముఖ్యమంత్రి కానీ, ఇరిగేషన్‌ మంత్రి కానీ నోరు మెదపలేదు. మేడిగడ్డ ఒక్కటే కాదు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా నష్టం జరిగింది. వాటిని పరిశీలించి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్‌ విచారణ చేపడతాం..’అని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement