pranahita - chevella project
-
ప్రాణహిత–చేవెళ్ల పునరుద్ధరణ
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రూ.38 వేల కోట్లతో 16.40 లక్షల ఎకరాల ఆయ కట్టుకు నీరందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పారు. రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి కాల్వలు కూడా తవ్వించామని, అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు మార్చిందని విమర్శించారు. ఎన్ని కల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ చేపడతామని తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించడంలో విఫల మైందని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని శుక్రవారం ఐదుగురు మంత్రుల బృందం పరిశీలించింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్ బాబు, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వీరిలో ఉన్నారు. కాగా ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మంత్రులు మాట్లాడారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచే ఎన్నో అనుమానాలు ఉన్నాయని, తాము చెబుతూ వచ్చిన విషయాలే ఇప్పుడు నిజమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు పేరొస్తుందనే: కోమటిరెడ్డి ‘ప్రాణహిత పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందనే సగం వరకు పనులు జరిగిన ప్రాజెక్టును వదిలేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని చేపట్టింది. తుమ్మిడిహెట్టి వద్ద 3 వేల ఎకరాలు సేకరించి ఉంటే గ్రావిటీతో నీళ్లు వచ్చేవి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ చర్యలన్నీ తుగ్లక్ చర్యల్లా ఉన్నాయి. కొండపోచమ్మ ఎప్పుడూ నిండుగా ఉంటుంది. కానీ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తప్ప ఇతర పొలాలకు నీరు పోదు. ఇక ఈ ప్రాజెక్టు పంపు హౌస్‌లలో నాణ్యత లేని మోటార్లు బిగించారు. ఇవన్నీ అసెంబుల్డ్ మోటార్లు. మోటార్లకు రూ.1,000 కోట్లకు బదులు రూ.4 వేల కోట్లు చెల్లించారు. నల్లగొండ జిల్లాకు సాగు నీరందించే ప్రాజెక్టులను చిన్నచూపు చూశారు..’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలారు.. పొంగులేటి: ‘కేసీఆర్ ప్రతిచోటా తన మార్కు ఉండాలనే తాపత్రయంతో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. కాళేశ్వరం విషయంలో మొదటి నుంచి హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడం వల్లే ఇంత పెద్ద నష్టం జరిగింది. డయా ఫ్రం వాల్ ఆర్సీసీతో కట్టి ఉంటే ప్రమాదం జరిగేదా? సీకెండ్ ఫైల్ ఫెయిల్ అయినందుకే మేడిగడ్డ పియర్స్ రోజురోజుకూ కుంగిపోయాయి. ప్రొటెక్షన్ పనులు ఒక్క వరదకే పోయాయంటే ఎంత నాసిరకంగా చేశారో అర్థమవుతోంది. ప్రమాదం ఉందని 2022లోనే ఈఈ పై అధికారులకు లేఖ రాసినా చర్యలు తీసుకోలేదు. కుంగుబాటు కొన్ని పిల్లర్లతో ఆగుతుందని నేను అనుకోవడం లేదు...’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజలకు వివరించేందుకే..: శ్రీధర్‌బాబు ‘కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం, జరిగిన నష్టం ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర సంపద సక్రమంగా వినియోగించాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. గోదావరి జలాలతో భూపాలపల్లి, పెద్దపల్లికి సాగునీరు, తాగునీరు అందించాలని, ప్రత్యేక ప్రణాళిక ద్వారా మంథని ముంపు ప్రాంతాలను ఆదుకోవాలని సహచర మంత్రులను కోరుతున్నా..’ అని శ్రీధర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వ మానస పుత్రిక: పొన్నం ‘కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం మానస పుత్రిక. దీని కోసం ఎంత విద్యుత్ వాడారో చెప్పాలి. రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది..’ అని పొన్నం ప్రభాకర్ అన్నారు. అనంతరం మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రదేశాన్ని పరిశీలించింది. అన్నారం బ్యారేజీని సందర్శన తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లింది. ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరే, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. రూ. లక్ష కోట్లకు లక్ష ఎకరాల ఆయకట్టా?: ఉత్తమ్ ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.95,000 కోట్లు ఖర్చు చేసినట్లు గత పాలకులు చెబుతున్నారు. కానీ దానివల్ల ఏర్పడిన కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలే. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు. అద్భుతం అన్నారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ కావడం దురదృష్టకరం. బ్యారేజీ కుంగిపోయినా ఆనాటి ముఖ్యమంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ నోరు మెదపలేదు. మేడిగడ్డ ఒక్కటే కాదు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా నష్టం జరిగింది. వాటిని పరిశీలించి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ విచారణ చేపడతాం..’అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. -
నీటి లభ్యత లేనందునే..
సాక్షి, హైదరాబాద్ : ప్రాణహిత–చేవెళ్లలో భాగంగా నిర్మించతలపెట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద నీటి లభ్యత లేనందునే దాన్ని రీ డిజైనింగ్ చేసి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిం దని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. కేంద్ర జల సంఘం సూచనల మేరకే మేడిగడ్డకు మార్చి కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టామని పేర్కొంది. మంగళవారం ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో గోదావరి నదీ జలాల వినియోగంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సెక్రటరీ రామేశ్వర్ రావు, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రమౌళి, సత్తిరెడ్డి, సానా మారుతి, నీటి పారుదల సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, నరసింహారావు, శాఖ ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, తెలంగాణ ఇంజనీర్ల ఫోరం నేత దొంతు లక్ష్మీనారాయణ, తెలంగాణ జేఏసీ చైర్మన్ కె.రఘు, గుజ్జా భిక్షం తదితరులు హాజరయ్యారు. మార్పు మంచికే... మేడిగడ్డ నుంచి నీటిని తీసుకునేలా చేసిన మార్పులు రాష్ట్ర బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినవే అని ప్రభుత్వ తరఫు ఇంజనీర్లు స్పష్టం చేశారు. కాళేశ్వరం సీఈ నల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘తమ్మిడివద్ద 273 టీఎంసీ లభ్యత ఉందని ప్రభుత్వం మొదటగా డీపీఆర్ సమర్పిస్తే, కేంద్ర జల సంఘం దాన్ని పరిశీలించి 165 టీఎంసీలు మాత్రమే ఉందని తెలిపింది. ఇందులోనూ ఎగువ రాష్ట్రాలు వాడుకోవాల్సిన 63 టీఎంసీలు కలసి ఉన్నాయని చెప్పింది. 75శాతం డిపెండబిలిటీ లెక్కన ఇక్కడ వినియోగించుకునే నీళ్లు కేవలం 80 టీఎంసీలకు మించదు. ఈ నీటితో 16.40 లక్షల ఎకరాలకు నీరివ్వలేం. అందుకే నీటి లభ్యత ఉన్న మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది. మేడిగడ్డ వద్ద 284 టీఎంసీ లభ్యత ఉందని, కేంద్ర జల సంఘమే చెప్పింది’అని పేర్కొ న్నారు. కేంద్రం సూచనల మేరకే రిజర్వాయర్ల కెపాసిటీని 147 టీఎంసీలు పెంచామన్నారు. శ్రీధర్ రావు దేశ్ పాండే మాట్లాడుతూ.. కాళేశ్వరంపై జేఏసీ రఘు తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. కేంద్ర జల సంఘం అనుమతులనే తప్పుపట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు. అది వండర్ కాదు.. బ్లండర్.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తప్పుడు పునాదులపై నిర్మిస్తున్నారని కె.రఘు విమర్శించారు. ప్రాణహితలో లభ్యతగా ఉన్న 213 టీఎంసీ, మిడ్ గోదావరిలోని 185 టీఎంసీ, మానేరులో 17 టీఎంసీ కలిపి మొత్తం 415 టీఎంసీల లభ్యత మేడిగడ్డ వద్ద ఉందని డీపీఆర్‌లో పేర్కొనడం తప్పన్నారు. ప్రాణహిత, మిడ్ గోదా వరి, మానేరు నదుల నుంచి వచ్చే నీటిని పరిగణనలోకి తీసుకోవడం భారీ తప్పిదమ న్నారు. మధ్య గోదావరి నుంచి వచ్చే నీరంతా ఎల్లంపల్లిని దాటి వచ్చే నీరేనని, ఆ నీటిని ఎల్లంపల్లి బ్యారేజీ వద్ద నుంచే పంపింగ్ చేసుకోవచ్చని చెప్పారు. మానేరు నుంచి గోదావరిలోకి చేరే నీటిని మధ్య మానేరు రిజర్వాయర్ వద్దనే ఎత్తిపోసుకోవచ్చన్నారు. ప్రాణహిత నది గోదావరిలో కలసే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత కేవలం 182 టీఎంసీలు మాత్రమేనన్నారు. అన్ని విషయాలని కేంద్ర జల సంఘానికి ఆపాదించి ఎక్కువ ఎత్తు నుంచి కిందికి ప్రవహించే నీటిని తిరిగి ఎత్తిపోతల చేయడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు. -
ప్రజలను భ్రమల్లో ముంచుతున్న కేసీఆర్,హరీశ్‌రావు
మేము అధికారంలోకి వస్తే కేసీఆర్, హరీశ్ జైలుకే.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మల్యే తూర్పు జగ్గారెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీ :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులనే తిరిగి ప్రారంభిస్తూ వాటికి కొబ్బరికాయలు కొడుతూ ప్రజలను భ్రమల్లో ముంచుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావును తాము అధికారంలోకి వస్తే జైలుకు పంపిస్తామని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి తూర్పు జగ్గారెడ్డి అరోపించారు. శనివారం అయన విలేకరులతో మట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, తాము ఎప్పుడూ ప్రాజెక్టులను అడ్డుకోలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాలోనే ప్రాణహిత-చేవెళ్లు ప్రాజెక్టును చేపడితే టీఆర్ఎస్ ప్రభుత్వం అదే ప్రాజెక్టుకు పేర్లు మార్చి, వేల కోట్లు కేటాయించి పనులు చేపడుతున్నారని ఆరోపించారు. తాము మల్లన్నసాగర్‌కు వ్యతిరేకం కాదని కాని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో సెప్టెంబర్17ను అధికారికంగా నిర్వహించాలని అందోళనలు చేపట్టి కేసీఆర్, హరీశ్‌రావులు ఈ రోజు ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. -
ప్రాణహిత-చేవెళ్లపై పూర్తిస్థాయి చర్చ
సాక్షి, హైదరాబాద్: శాననసభ సమావేశాలు ముగిశాక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో చర్చించాల్సి ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఎక్కడ ఏర్పాటు చేస్తే ప్రయోజనం అధికంగా ఉంటుందనే దానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వాప్కోస్ను పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ నివేదికపై అందరి సమక్షంలో చర్చిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతం, కృష్ణా పరీవాహక ప్రాంతంలోని వాస్తవ పరిస్థితులపై అందరితో చర్చించి, సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు సాగుతామన్నారు. శనివారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలవనరుల శాఖ (సీడబ్ల్యూసీ) సమ్మతి, తదితర వివరాలు తెలపాలంటూ ఎమ్మెల్సీ బి.వెంకటరావు వేసిన ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. -
ప్రాణహితకు.. ప్రాణం!
సాక్షి, మంచిర్యాల : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు జీవం పోసుకోనుంది. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న ప్రభుత్వ డిమాండ్ త్వరలో నెరవేరేలా ఉంది. దీంతో ప్రాజెక్టుపై రైతులు పెట్టుకున్న ఆశలు ఫలించనున్నాయి. జిల్లా పరిధిలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తున్న ‘బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రం సిద్ధమైంది. జాతీయ హోదా కల్పించేందుకు అవసరమైన కీలక నివేదికలు వీలైనంత త్వరగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివేదిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని చేజారనీయకుండా అవసరమైన నివేదిక రూపకల్పన కోసం కేంద్రంతో చర్చిస్తున్నారు. మొత్తం 18 విభాగాల నుంచి అనుమతులు తీసుకొస్తే.. కేంద్ర జల వనరుల శాఖ ప్రాణహితకు జాతీయ హోదా అనుమతి ఇస్తుంది. ఇప్పటి వరకు 13 విభాగాల నుంచి అనుమతులు రావడంతో మిగిలిన ఐదు విభాగాల నుంచి క్లియరెన్స్ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాధికారులు తలమునకలయ్యారు. ప్రాజెక్టు జాతీయ హోదా పొందితే నిధుల కొరతతో పడ కేసిన ప్రాణహిత నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతాయి. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యయంలో 90 శాతం నిధులు కేంద్ర ఆర్థిక సహాయ మండలి భరిస్తుంది. దీంతో పనులకు ఆటంకం లేకుండా పూర్తవుతాయి. నిధుల సమస్యకు తెర..! జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 డిసెంబర్ 16న రూ.38,500 కోట్ల అంచనాతో జిల్లా పరిధిలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేపట్టారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు వ్యయం రూ.43,500 కోట్లకు చేరింది. ఆ మహానేత హయాంలోనే ఇన్వెస్టిగేషన్, మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ప్రాజెక్టు కోసం రూ.1,025 కోట్లు ఖర్చు చేశారు. 2010-11 బడ్జెట్లో రూ.700 కోట్లు కేటాయించి రూ.33.57 కోట్లు విడుదల చేశారు. 2011-12 బడ్జెట్లో రూ.608.28 కోట్లు ప్రకటించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2012-13లో రూ.1,050 కోట్లు, 2013-14లో రూ.780 కోట్లు కేటాయించారు. వాటిలో నామమాత్రంగా ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేస్తున్న అరకొర నిధులతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. తెలంగాణలోని ఏడు జిల్లాలకు సాగు నీరందించి.. ప్రజల దాహార్తి తీర్చే బృహత్తర ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురవుతున్న నిధుల సమస్యకు పరిష్కారం లభించాలంటే జాతీయ హోదా కల్పించాలని ఎనిమిదేళ్లుగా పాలకులు, రైతులు కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. తాజాగా ఆ దిశగా కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో అందరిలోనూ సంతోషం వ్యక్తమవుతోంది. మరో 50 వేల ఎకరాలు పెరిగిన లక్ష్యం.. ప్రాజెక్టు ఆరంభంలో జిల్లాలో ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరందించేందుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఇటీవల జిల్లాలో నిర్వహించిన కొమురం భీమ్ వర్ధంతి వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆ లక్ష్యాన్ని మరో 50 వేలకు పెంచారు. ఇప్పుడు పూర్తిస్థాయి లక్ష్యం 1.50 లక్షలకు చేరింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే.. తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల వరకు 69.5 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతుతో మొత్తం 400 కాలువలు తీసి.. వాటి ద్వారా తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని మళ్లించనునున్నారు. దీంతో ప్రజల దాహార్తికీ తెరపడనుంది. తొలి విడతగా జిల్లాలోని కౌటాల మండలం రణవెల్లి నుంచి బెజ్జూరు మండలం కర్జోలీ వరకు కాలువలు తవ్వారు. రెండో విడతలో.. కర్జోలి నుంచి నెన్నెల మండలం మైలారం వరకు కాలువలు తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా విడతలుగా కాలువలు తీసి సాగు నీరందించనున్నారు. -
‘ప్రాణహిత’ పై టాస్క్ఫోర్సు
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హరీష్‌రావు హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల పథకానికి జాతీయ హోదా సాధించడానికి టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి టి. హరీష్‌రావు తెలిపారు. వీలైనంత తొందరగా జాతీయహోదా లభించేలా ఈ బృందం కృషి చేస్తుందన్నారు. ఆదివారం వుంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయున వూట్లాడారు. భూగర్భ జల మట్టాన్ని పెంపొందించేందుకు చెక్‌డ్యాంలను నిర్మిస్తామని, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సభాగౌరవాన్ని పెంచే విధంగా శాసనసభ సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. సభ జరిగే రోజుల్లో ఎక్కువ మంది సభ్యులు హాజరయ్యేలా చూస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన హరీష్‌రావును పలువురు మంత్రులు, శాసనసభ్యులు కలసి అభినందించారు. -
బహుజనుల తెలంగాణ కోసం మరో ఉద్యమం
పరిగి, న్యూస్‌లైన్: దొరల నీడపడని బహుజనుల తెలంగాణ సాధనకోసం మరో ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టఫ్) కో చైర్పర్సన్ విమలక్క పేర్కొన్నారు. శుక్రవారం పరిగిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ను దోచుకున్న వారే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని, వారికి సీఎం కిరణ్ నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. ఆంక్షలు లేని తెలంగాణ ను సాధించుకోవటమే తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు, కొందరు నాయకులు తమ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులు, కళాకారులు, బహుజనుల త్యాగఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందన్నారు. కొన్ని పార్టీలు ఇక్కడోమాట ఆంధ్రాలో ఓ మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును డిజైన్ మార్చి నిర్మిస్తే అభ్యంతరంలేదని అన్నారు. ఇదే సమయంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి వెంటనే పూర్తి చేయాలన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలో సీమాంధ్రులు దోచుకున్న భూములు వదులుకునేది లేదని, అవసరమైతే నాగళ్లుకట్టి దున్ని తీరుతామని అన్నారు. ఈ నెల 8న మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించే బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అరుణోదయ, పీడీఎస్‌యూ, విద్యార్థి జేఏసీ, తెలంగాణ విద్యావంతుల వేదిక, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు నారాయణ్‌రావు, సంతోష్, లక్ష్మి, రవీందర్, విజయల క్ష్మి, సర్దార్, రవికుమార్, వెంకటరాములు, విజయ్‌రావు, ముజీ బ్, మునీర్, పీర్‌మహ్మద్, సాయిరాంజీ, పాండు, రవి, బందయ్య, గోవింద్, వెంకట్ పాల్గొన్నారు. -
‘ప్రాణహిత-చేవెళ్ల’కు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న బ్యారేజికి మహారాష్ర్ట ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చాలా కాలం నుంచి ఈ అనుమతి కోసం రాష్ర్ట ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రెండు రాష్ట్రాల అధికారులు నిర్వహించిన జాయింట్ సర్వే నివేదిక కూడా తుది రూపం దాల్చింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. అనంతరం ఈ నివేదిక పై కేంద్రం ఆమోదముద్ర వేసిన వెంటనే బ్యారేజి పనులు మొదలు కానున్నాయి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర, మన రాష్ట్ర సరిహద్దులో బ్యారేజిని నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యారేజి నిర్మాణం వల్ల మహారాష్ర్టలోని భూభాగం ముంపునకు గురవుతుంది. అందుకోసం మహారాష్ర్ట ప్రభుత్వం ఈ బ్యారేజి నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆమోదాన్ని తెలపాల్సి ఉంది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికీ మహారాష్ర్టతో ఒప్పందం జరిగినా... ముంపు సమస్య ఉన్న బ్యారేజి నిర్మాణానికి ప్రత్యేక ఆమోదం అవసరం. ఇందుకోసం బ్యారేజి నిర్మించే ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు జాయింట్ సర్వేను నిర్వహించారు. గత రెండు మాసాల కిందట జరిగిన ఈ సర్వే నివేదిక కూడా సిద్ధమైంది. జాయింట్ సర్వే, ముంపు ప్రాంత గుర్తింపు ప్రక్రియ ముగియడంతో బ్యారేజి నిర్మాణానికి మహారాష్ర్ట ప్రభుత్వం తమ అనుమతిని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే కాల్వల పనులతో పాటు, టన్నెల్ తవ్వకాన్ని కూడా మొదలు పెట్టారు. మహారాష్ర్టకు పరిహార చెల్లింపు పూర్తయిన తర్వాత బ్యారేజీ పనులను కూడా ప్రారంభించనున్నారు. తెలంగాణకు జీవధార సుమారు రూ. 38 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతానికి సాగునీరు, మంచినీరు అందనుంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. అలాగే హైదరాబాద్ నగర మంచినీటి అవసరం కోసం 30 టీఎంసీలను తరలించనున్నారు. మొత్తం 160 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు కోసం గోదావరి నదికి ఉపనది అయిన ప్రాణహిత నుంచి లిప్టుల ద్వారా తరలించనున్నారు. ఇందుకోసం సుమారు 3,466 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. మొదట నిర్ణయించిన గడువు ప్రకారం 2013-14 లోపు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే పనులను ప్రారంభించడం ఆలస్యం కావడంతో ఈ గడువును 2018 వరకు పొడిగించారు.