ప్రాణహితకు.. ప్రాణం!
సాక్షి, మంచిర్యాల : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు జీవం పోసుకోనుంది. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న ప్రభుత్వ డిమాండ్ త్వరలో నెరవేరేలా ఉంది. దీంతో ప్రాజెక్టుపై రైతులు పెట్టుకున్న ఆశలు ఫలించనున్నాయి. జిల్లా పరిధిలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తున్న ‘బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రం సిద్ధమైంది. జాతీయ హోదా కల్పించేందుకు అవసరమైన కీలక నివేదికలు వీలైనంత త్వరగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నివేదిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని చేజారనీయకుండా అవసరమైన నివేదిక రూపకల్పన కోసం కేంద్రంతో చర్చిస్తున్నారు. మొత్తం 18 విభాగాల నుంచి అనుమతులు తీసుకొస్తే.. కేంద్ర జల వనరుల శాఖ ప్రాణహితకు జాతీయ హోదా అనుమతి ఇస్తుంది. ఇప్పటి వరకు 13 విభాగాల నుంచి అనుమతులు రావడంతో మిగిలిన ఐదు విభాగాల నుంచి క్లియరెన్స్ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాధికారులు తలమునకలయ్యారు. ప్రాజెక్టు జాతీయ హోదా పొందితే నిధుల కొరతతో పడ కేసిన ప్రాణహిత నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతాయి. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యయంలో 90 శాతం నిధులు కేంద్ర ఆర్థిక సహాయ మండలి భరిస్తుంది. దీంతో పనులకు ఆటంకం లేకుండా పూర్తవుతాయి.
నిధుల సమస్యకు తెర..!
జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 డిసెంబర్ 16న రూ.38,500 కోట్ల అంచనాతో జిల్లా పరిధిలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేపట్టారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు వ్యయం రూ.43,500 కోట్లకు చేరింది. ఆ మహానేత హయాంలోనే ఇన్వెస్టిగేషన్, మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ప్రాజెక్టు కోసం రూ.1,025 కోట్లు ఖర్చు చేశారు. 2010-11 బడ్జెట్‌లో రూ.700 కోట్లు కేటాయించి రూ.33.57 కోట్లు విడుదల చేశారు. 2011-12 బడ్జెట్‌లో రూ.608.28 కోట్లు ప్రకటించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.
2012-13లో రూ.1,050 కోట్లు, 2013-14లో రూ.780 కోట్లు కేటాయించారు. వాటిలో నామమాత్రంగా ఖర్చు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేస్తున్న అరకొర నిధులతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. తెలంగాణలోని ఏడు జిల్లాలకు సాగు నీరందించి.. ప్రజల దాహార్తి తీర్చే బృహత్తర ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురవుతున్న నిధుల సమస్యకు పరిష్కారం లభించాలంటే జాతీయ హోదా కల్పించాలని ఎనిమిదేళ్లుగా పాలకులు, రైతులు కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. తాజాగా ఆ దిశగా కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో అందరిలోనూ సంతోషం వ్యక్తమవుతోంది.
మరో 50 వేల ఎకరాలు పెరిగిన లక్ష్యం..
ప్రాజెక్టు ఆరంభంలో జిల్లాలో ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరందించేందుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఇటీవల జిల్లాలో నిర్వహించిన కొమురం భీమ్ వర్ధంతి వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆ లక్ష్యాన్ని మరో 50 వేలకు పెంచారు. ఇప్పుడు పూర్తిస్థాయి లక్ష్యం 1.50 లక్షలకు చేరింది.
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే..
తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల వరకు 69.5 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతుతో మొత్తం 400 కాలువలు తీసి.. వాటి ద్వారా తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని మళ్లించనునున్నారు. దీంతో ప్రజల దాహార్తికీ తెరపడనుంది. తొలి విడతగా జిల్లాలోని కౌటాల మండలం రణవెల్లి నుంచి బెజ్జూరు మండలం కర్జోలీ వరకు కాలువలు తవ్వారు. రెండో విడతలో.. కర్జోలి నుంచి నెన్నెల మండలం మైలారం వరకు కాలువలు తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా విడతలుగా కాలువలు తీసి సాగు నీరందించనున్నారు.