ప్రాణహితకు జాతీయ హోదా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు తెలంగాణలోని దాదాపు సగం జనాభాకు తాగునీరును అందించే ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ‘బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి’ పథకంగా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తన సానుకూలతను వ్యక్తపరిచిన కేంద్ర ప్రభుత్వం... తాజాగా దీనికి సంబంధించి పలు కీలకమైన నివేదికలను వీలైనంత త్వరగా తమకు సమర్పించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై ఆయా నివేదికల తయారీపై కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వంతో అవసరమైన సంప్రదింపులు, కార్యాచరణలో మునిగి తేలుతున్నారు. తెలంగాణలోని ఏడు కరువు పీడిత జిల్లాలకు నీటిపారుదల సదుపాయాన్ని కల్పించేందుకు 2008లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు మెజారిటీ ప్రజల దాహార్తిని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకూ నిర్మించే ఈ భారీ ప్రాజెక్టు కోసం.. దాదాపు రూ. 40 వేల కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తులు కూడా చేశారు. జాతీయ హోదా పొందితే నిర్మాణ వ్యయంలో 90 శాతాన్ని కేంద్ర ఆర్థిక సహాయ మండలి భరిస్తుంది. ప్రాజెక్టుకు మొత్తం 18 విభాగాల నుంచి అనుమతులు తెచ్చుకుంటేనే కేంద్ర జల వనరుల శాఖ జాతీయ హోదాకు అనుమతిస్తుంది. ఇందులో ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు ఇప్పటికే నీటి పారుదల ప్రణాళిక, అంతర్‌రాష్ట్ర అంశాలు, సెంట్రల్ ఆసియల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, యంత్ర నిర్మాణ సంప్రదింపు సంస్థ, వ్యవసాయ శాఖ అనుమతులు లభించాయి. ఇక సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ రాష్ట్రంలోనే ఉండటంతో.. బ్యారేజీ కాలువల డిజైన్, గేట్లు, హైడ్రో సివిల్ డిజైన్, కాంక్రీట్ మాసోనరీ డ్యామ్ డిజైన్ వంటి మూడు నాలుగు అంశాల్లో కేంద్రం ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది.
గిరిజన సలహా మండలి ఆమోదం
ప్రాజెక్టులకు సంబంధించి గిరిజన వ్యవహారాల శాఖ అనుమతి అత్యంత ముఖ్యమైనది. అత్యంత సున్నితమైన ఈ అంశానికి ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురయ్యే గిరిజన గ్రామాల ప్రజల ఆమోదం తప్పనిసరి. అక్కడి ప్రజల సమ్మతి తెలుపుతూ రాష్ట్ర గిరిజన సలహా మండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఈ మేరకు ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు సంబంధించి శనివారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గిరిజన సలహా మండలి ఏకగ్రీవంగా సమ్మతి తెలిపింది. మండలి తీర్మాన కాపీని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ద్వారా కేంద్ర గిరిజన శాఖకు సోమ లేదా మంగళవారం పంపనున్నారు. మరో నెల, నెలన్నర రోజుల్లో అన్నీ పూర్తి చేసి కీలక శాఖల అనుమతులను కేంద్ర జల సంఘానికి అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని ప్రభుత్వంలోని కీలక నేత ఒకరు వెల్లడించారు.
ఇంకో ఐదు అంశాల్లో అనుమతులొస్తే..
ఐదు కీలకమైన అంశాలపై ఈ ప్రాజెక్టుకు వివిధ శాఖల నుంచి అనుమతులు పొందాలి. ఇందులో హైడ్రాలజీ(లభ్యమయ్యే నీరు), వ్యయ అంచనా, పర్యావరణ, అటవీ, గిరిజన వ్యవహారాలు, నీటి వనరుల శాఖల అనుమతులు అవసరం.
హైడ్రాలజీకి సంబంధించి 1941 నుంచి 2003 మధ్య గల నీటి సమాచారాన్ని (వాటర్ డాటా) ఈ నెల 14న అందజేశారు. హైడ్రాలజీ విభాగం పరిశీలనలో ఉన్న ఈ అంశానికి సంబంధించి మరిన్ని సమగ్ర వివరాలను తెలియజేసేందుకు ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ మంగళవారం ఢిల్లీకి వె ళుతున్నారు. కేంద్ర జల సంఘం చైర్మన్ ఏబీ పాండ్యాతో వారు చర్చలు జరుపనున్నారు.
ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి.. డీపీఆర్ ప్రకారం రూ.40,300 కోట్లుగా అంచనా వేశారు. ఈ వ్యయంపై కేంద్ర జల సంఘం కొన్ని వివరణలు కోరుతుండగా ఢిల్లీలోనే ఉన్న అధికారులు, సర్వే సంస్థ వ్యాప్‌కోస్ ప్రతినిధులు ఎప్పటికప్పుడు వివరణ అందజేస్తూ, చర్చలు జరుపుతున్నారు.
పర్యావరణ, అటవీ శాఖ పరిధిలో రెండు రకాల అనుమతులు అవసరం ఉండగా... అందులో తొలి దశకు ఇప్పటికే క్లియరెన్స్ దక్కింది. అత్యంత కీలకమైన రెండో దశ అనుమతికి ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి ఉంది. తెలంగాణలో ఈ ప్రక్రియ పూర్తయినా మహారాష్ట్రలో ఇంకా జరగాల్సి ఉంది. ఇంతకుముందే ఒక సారి ఈ విషయమై మహారాష్ట్రతో చర్చలు జరిగాయి. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మరోసారి సంప్రదింపులు జరపాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు నిర్ణయించారు.
అటవీ అనుమతుల కోసం ప్రాజెక్టు కింద ఎంత అటవీ భూమి పోతోందో అంత భూమి పరిహారంగా అటవీ శాఖకివ్వాలి. ఇందుకు సంబంధించి మొత్తం 7,673 ఎకరాల భూమి అవసరమని లెక్కతేల్చారు. ప్రస్తుతం సర్వే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. దీనిని మరో వారం రోజుల్లో పూర్తి చేసి అటవీశాఖ ప్రధాన కార్యదర్శి ద్వారా కేంద్రానికి అందించనున్నారు.
ప్రాజెక్టుకు కీలకమైన గిరిజన వ్యవహారాల శాఖ అనుమతి వచ్చేసింది. అయితే దీనిని ఇంకా కేంద్ర ప్రభుత్వానికి పంపాలి.