కాళేశ్వరం/ఏటూరునాగారం/చర్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగుతున్నాయి. వారం రోజులుగా తెలంగాణ, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాణహిత నదికి వరద తాకిడి పెరిగింది. ఆదివారం రాత్రి వరకు 10.7 మీటర్ల ఎత్తులో గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తూ మేడిగడ్డ వైపునకు తరలిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో 81 గేట్లు మూసివేశారు. బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఉన్నాయి. అవుట్ ఫ్లో 8.26 లక్షల క్యూసెక్కులుగా, ఇన్‌ఫ్లో 8.10 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీలో నీటి నిల్వ 5.98 టీఎంసీలు ఉంది. ఇక అన్నారం బ్యారేజీలో మొత్తం 66 గేట్లు ఉండగా 4 గేట్లు ఎత్తారు.
అందులో నుంచి కిందకు 18,000 క్యూసెక్కుల వరద తరలిపోతోంది. బ్యారేజీలో నిల్వ 9 టీఎంసీలు ఉంది. ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రాంతంలో గోదావరి నీటి మట్టం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న పీవీ నర్సింహారావు సుజల స్రవంతి బ్యారేజీ పనులు వారం రోజులుగా నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది. బుధవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో గోదావరికి ఎగువన ఉన్న తాలిపేరు, గుండ్లవాగు, పాలెంవాగు, చీకుపల్లివాగు, గుబ్బలమంగి తదితర వాగుల నుంచి భారీగా వరదనీరు రావడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శనివారం రాత్రి వరకు 46.30 అడుగులకు చేరగా.. అయితే ఆదివారం సాయంత్రానికి 43 అడుగులకు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment