కన్నెపల్లి వద్ద పెరిగిన వరద | Increased flood at Kannepalli | Sakshi
Sakshi News home page

కన్నెపల్లి వద్ద పెరిగిన వరద

Published Sun, Jul 7 2019 2:33 AM | Last Updated on Sun, Jul 7 2019 2:33 AM

Increased flood at Kannepalli - Sakshi

గ్రావిటీ కాల్వలో నీటి ప్రవాహం

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మూడు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. గోదావరి, ప్రాణహిత నదులు కలవడంతో కాళేశ్వరం పుష్కరఘాట్ల వద్ద 5.40 మీటర్ల ఎత్తులో ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. కాళేశ్వరం, కన్నెపల్లిలో గోదావరి వద్ద 30 వేల క్యూసెక్కుల వరద మేడిగడ్డ వైపు తరలిపోతుండటంతో ఇప్పటికే 30కి పైగా గేట్లను మూశారు. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఒకటవ మోటార్‌ నిరంతరం నీటిని ఎత్తిపోస్తుండటంతో గ్రావిటీ కాల్వ సగం వరకు నిండి 13.345 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తోంది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. మూడో మోటార్‌కు శనివారం రాత్రి వెట్‌రన్‌ నిర్వహించనున్నారు.
 
నిమిషానికి 2,110 క్యూసెక్కులు 
కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి డెలివరీ సిస్టంలో వదిలిన నీళ్లు గ్రావిటీ కాల్వ నుంచి తరలిపోయి అండర్‌ టన్నెల్‌ వద్ద అన్నారం బ్యారేజీలోని గోదావరిలో కలుసుతున్నాయి. నిమిషానికి 2,110 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అధికారులు అక్కడ ఉన్న 66 గేట్లు మూసి ఉంచారు. కన్నెపల్లి, మేడిగడ్డకు అర్ధరాత్రి వరకు 1.20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ వరదను కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి అన్నారం వైపు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో కన్నెపల్లి పంపుహౌస్‌లో ఒకటి, మూడు, ఆరో మోటార్లు నిరంతరం నడుపనున్నారు. కాగా, వరద ప్రవాహం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అన్నారం, మేడిగడ్డ వంతెనలపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీఐ రంజిత్‌కుమార్‌ తెలిపారు.  
 కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద డెలివరీ సిస్టంలో ఎత్తిపోస్తున్న నీరు  

ప్రాజెక్టు వద్ద భద్రత పెంపు: ఎస్పీ  
కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరుగుతుండటంతో భద్రతను పెంచారు. శనివారం ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు, కన్నెపల్లి పంపుహౌస్, గ్రావిటీ కాల్వలను పరిశీలించారు. అన్నారం బ్యారేజీ, అండర్‌ టన్నెల్, కన్నెపల్లి, గ్రావిటీ కాల్వ వెంట భద్రతను కట్టుదిట్టం చేశారు. మత్స్యకారులను చేపలు పట్టకుండా నిలువరించాలని, ఓడరేవుల వద్ద నాటు పడవలు నడపొద్దని ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌ల్లో సందర్శకులను అనుమతించవద్దని ఎస్పీ చెప్పినట్లు సీఐ వివరించారు.

పెరుగుతున్నగోదావరి నీటి మట్టం
ఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరుగులు పెడుతోంది. ప్రాణహిత, పెనుగంగా, ఇంద్రావతిలోని వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల వద్ద శుక్రవారం సాయంత్రం గోదావరి నీటి మట్టం 72 మీటర్లకు చేరింది. శనివారం 75 మీటర్లకు చేరడంతో ఇన్‌టేక్‌ వెల్‌ వద్ద నీరు చేరింది. దేవాదుల పంప్‌హౌస్‌ వద్ద సముద్ర మట్టానికి 72 మీటర్లు ఉంటేనే మోటార్ల పంపింగ్‌కు నీరు అందుతుంది. అయితే 75 మీటర్లకు చేరడంతో ఇంజనీరింగ్‌ అధికారులు రెండో దశలోని ఒక మోటార్‌ను ప్రారంభించి ఎగువ ప్రాంతాల్లోని రిజర్వాయర్లకు నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. అలాగే తుపాకులగూడెం బ్యారేజ్‌ వద్ద శనివారం 73 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉప నదులు ఉప్పొంగి గోదారమ్మ ఒడిలో కలుస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement