
ష్నైడర్‌కు కీలకంగా హైదరాబాద్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్ పరికరాల తయారీ దిగ్గజం ష్నైడర్‌కు హైదరాబాద్‌లో ఉన్న ప్లాంటు కీలకంగా మారింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నెలకొల్పిన ఈ ప్లాంటు నుంచి లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్ దేశాలకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారు. గతేడాదే ప్లాంటు సామర్థ్యాన్ని రెండింతలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్లాంట్లలో ష్నైడర్ తయారు చేస్తున్న పరిమాణంలో 10 శాతం హైదరాబాద్ యూనిట్ సమకూరుస్తోంది.
ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్, మౌల్డెడ్ సర్క్యూట్ బ్రేకర్స్, పుష్ బటన్స్ వంటివి ఇక్కడ తయారు చేస్తున్నామని కంపెనీ ఎకో బిల్డింగ్స్ విభాగం ఇండియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చెబ్బి గురువారమిక్కడ తెలిపారు. పర్యావరణ అనుకూల కాంటాక్టర్స్, లో–వోల్టేజ్ సర్క్యూట్ బ్రేకర్స్‌ను ఇక్కడ విడుదల చేసిన సందర్భంగా ఎస్‌వీపీ దీపక్ శర్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. కొత్త ఉత్పత్తులను హైదరాబాద్ ప్లాంటులోనూ రానున్న రోజుల్లో తయారు చేస్తామన్నారు.