ఒడిదుడుకులొచ్చినా... బంగారమే!!
ముంబై, న్యూయార్క్ : భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో వారంలో లాభాల స్వీకరణ జరిగింది. స్వల్పకాలికంగా ఈక్విటీ మార్కెట్లు కొంత కోలుకోవడం వంటి అంశాలూ పసిడి వెనకడుక్కు కారణమయ్యాయి. అయినా దీర్ఘకాలికంగా పసిడి ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కుదుటపడుతున్నాయనడానికి ఇంకా స్పష్టమైన సంకేతాలు ఏవీ కనిపించడం లేదన్నది నిపుణుల విశ్లేషణ.
లాభాల స్వీకరణ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(బీఓఈ) ప్రకటించిన భారీ ఉద్దీపన ప్యాకేజీతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల పరుగులు వంటి అంశాలు గత వారం పసిడిని కొంచెం వెనక్కు నెట్టినా... ఇది స్వల్పకాలిక ధోరణేనన్నది వారి అభిప్రాయం. వారం వారీగా పసిడి అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా కొంత బలహీనపడింది. అయితే ఇది పసిడి ఇక వెనకడుగుగా భావించరాదన్నది నిపుణుల వాదన.
వారంలో ధరల కదలిక...
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో శుక్రవారంతో ముగిసిన వారంలో ఔన్స్ (31.1గ్రా)కు 17 డాలర్లు తగ్గి, 1,341 డాలర్ల వద్ద ముగిసింది. ఇక దేశీయంగా ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్ ముంబైలో 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛ త ధరలు రూ.45 చొప్పున తగ్గి, వరుసగా రూ.31,065, రూ.30,915 వద్ద ముగిశాయి. ఇక వెండి వారం వారిగా స్థిరంగా కేజీకి రూ.47,470 వద్ద ముగిసింది.