
ఆగస్టు నుంచి ‘స్కై చాపర్స్’ సర్వీసులు
విశాఖపట్నం, కాకినాడలకు ఆగస్టు నుంచి ‘స్కై చాపర్స్’ సర్వీసులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం, కాకినాడల నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి వెళ్లి వచ్చే వారి కోసం సీ ప్లేన్ సిద్ధమవుతోంది. ఇటు భూమి నుంచి అటు నీటి నుంచి కూడా టేకాఫ్, ల్యాండింగ్ కాగల ఉభయ చర (యాంఫిబియాన్ ఎయిర్‌క్రాఫ్ట్) విమానం ఆగస్టు నెల నుంచి అందుబాటులోకి రానుంది. స్కై చాపర్స్ లాజిస్టిక్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఈ సీప్లేన్‌ను నడపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. దేశంలోని అమర్‌నాథ్, కేదార్‌నాథ్, వైష్ణోదేవి వంటి ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోని దేవాలయాలకు హెలికాప్టర్లలో భక్తులను తీసుకెళ్లడంలో ఈ సంస్థకు అనుభవం ఉంది.
ఇటీవల స్కై చాపర్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇప్పటికే స్కై చాపర్స్ సంస్థ అమెరికా, ఇండోనేసియాల నుంచి రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసింది. వీటిలో ఒకటి రాకపోకలు సాగిస్తే మరొకటి స్టాండ్‌బైగా ఉంచుతారు. వీటికి సెస్సానా అనే పేరు పెట్టారు.ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 12 మంది ప్రయాణించే వీలుంటుం ది. తొలిదశలో విజయవాడ నుంచి కాకినాడ, విశాఖపట్నంలకు ఈ సర్వీసులు నడపనుంది. తొలుత విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి ఉదయం 6.30 గంటలకు బయల్దేరి అర గంటలోపు కాకినాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి బయల్దేరి విజయవాడ వస్తుంది. అనంతరం విజయవాడలో బయలుదేరి 8.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖలో ప్రయాణికులను ఎక్కించుకుని గంటలోపు విజయవాడ చేరుకుంటుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఉదయం వచ్చిన వారిని తిరిగి కాకినాడ, విశాఖపట్నంలకు తీసుకెళ్తుంది. మధ్యాహ్నం ఖాళీగా ఉన్న సమయంలో విజయవాడ నుంచి ఒక ట్రిప్పు తిరుపతికి కూడా నడపాలని స్కై చాపర్స్ యాజమాన్యం ఆలోచిస్తోంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండింగ్, టేకాఫ్‌లకు వీలుగా విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఒకటి, విశాఖ సమీపంలోని భీమిలి, కాకినాడల్లో ఒక్కోటి చొప్పున ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణం జరుగుతోంది. ఆగస్టు నుంచి సీప్లేన్ సర్వీసులు ప్రారంభమ య్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ సీప్లేన్‌కు రానూపోనూ టికెట్ ధర రూ.4,000 నుంచి 4,500 వరకు నిర్ణయించే అవకాశముంది. విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల నుంచి రాజధాని అమరావతి వెళ్లే వారు, వ్యాపారవేత్తలు అక్కడ ఉండిపోవాల్సిన అవసరం లేకుండా అదేరోజు సాయంత్రానికి తమ స్వస్థలాలకు చేరుకునేలా ఈ సీప్లేన్ సర్వీసులను ప్రవేశపెట్టనున్నట్టు స్కై చాపర్స్ బిజినెస్ డెరైక్టర్ చంద్రశేఖర్ ‘సాక్షి’కి చెప్పారు. భవిష్యత్‌లో కోనసీమకు కూడా సీప్లేన్ సర్వీసులను విస్తరిస్తామని తెలిపారు.