సహారా లెక్కల్లో అవకతవకలు: సెబీ
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు నిధుల రిఫండ్ కేసుకి సంబంధించి సహారా గ్రూప్ ట్రక్కులకొద్దీ సమర్పించిన పత్రాల్లో భారీగా అవకతవకలు ఉన్నట్లు సెబీ వర్గాలు తెలిపాయి. పెద్ద ఎత్తున బోగస్ ఇన్వెస్టర్ల పేర్లను ఈ పత్రాల్లో చేర్చి ఉంటారన్న సందేహాలు ఉన్నట్లు వివరించాయి. దీంతో, అసలైన ఇన్వెస్టర్లను గుర్తించేందుకు ప్రాంతీయ భాషా పత్రికలతో పాటు ఇతర మాధ్యమాల్లో కూడా బహిరంగ ప్రకటనలు ఇవ్వాలని సెబీ యోచిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పేర్లు మొదలుకుని చిరునామాలు, దరఖాస్తు తేదీలు వంటివి చాలా మటుకు ఒకదానితో మరొకటి పొంతన లేకుండా ఉన్నట్లు తెలిపాయి.
దీన్ని బట్టి చూస్తే మనీలాండరింగ్ జరిగి ఉంటుందన్న అనుమానాలు రేకెత్తుతున్నట్లు పేర్కొన్నాయి. వందలకొద్దీ స్కానర్లు, కంప్యూటర్లు, సిబ్బం ది సహాయంతో పలు నెలల పాటు సహారా పత్రాలను సెబీ పరిశీలించింది. చివరికి సహారా నుంచి అప్షనల్లీ ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్లను తీసుకున్నట్లుగా భావిస్తున్న 3 కోట్ల ఇన్వెస్టర్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసింది. సంబంధిత వర్గాల ప్రకారం.. ఒకే పేరుతో వందల కొద్దీ అకౌంట్లు, వివిధ చిరునామాలు ఉన్నాయి. కొన్ని దరఖాస్తుల్లో జాతీయ రహదారులు, ఊళ్లు, పట్టణాలు, రోడ్ల పేర్లను చిరునామాలుగా పేర్కొన్నారు. మరికొన్నింటిలో వోచర్ తేదీ కన్నా ముందే రిఫండ్ తేదీలు ఉన్నాయి.