న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం గత ఆదేశాలకు అనుగుణంగా రెండు సహారా సంస్థలు... ఎస్‌ఐఆర్‌ఈసీఎల్ (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్), ఎస్‌హెచ్‌ఐసీఎల్ (సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లు రూ.62,602.90 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెప్టెంబర్ 30 నాటికి జరపాల్సిన ఈ మొత్తాలను సెబీ–సహారా రిఫండ్ అకౌంట్‌లో జమచేయడంలో విఫలమైతే, సహారా గ్రూప్ సుబ్రతారాయ్‌ని తిరిగి కస్టడీలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ నెల 18న సెబీ దాఖలు చేసిన పిటిషిన్‌లో ముఖ్యాంశాలు, కేసు పూర్వాపరాలను చూస్తే...
► సహారా గ్రూప్ సంస్థలు రెండు ఎస్‌ఐఆర్‌ఈసీఎల్ , ఎస్‌హెచ్‌ఐసీఎల్ నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుంచి భారీ నిధులు సమీకరించాయన్నది ప్రధాన ఆరోపణ.
► 2012, జూన్ 14న సహారా దాఖలు చేసిన స్టేట్‌మెంట్ల ప్రకారం, 2012 ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఎస్‌ఐఆర్‌ఈసీఎల్ చెల్లించాల్సిన అసలు రూ.16,997 కోట్లు. ఎస్‌హెచ్‌ఐసీఎల్ విషయంలో ఈ మొత్తం రూ. 6,352 కోట్లు. అసలుతోపాటు అప్పటికి చెల్లించాల్సిన వడ్డీసహా ఈ మొత్తాలను రూ.25,781.32 కోట్లుగా లెక్కతేల్చారు.
► సెబీ దాఖలు ఒక పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం 2012 ఆగస్టు 31న ఒక రూలింగ్ ఇస్తూ, వ్యక్తిగత ఇన్వెస్టర్ల నుంచి డబ్బు తీసుకున్న నాటి నుంచీ 15 శాతం చొప్పున వడ్డీతోసహా మూడు నెలల్లోపు చెల్లింపులు జరపాలని ఆదేశించింది. చెల్లింపులు జరిపిన విషయాన్ని డాక్యుమెంట్లుసహా సెబీకి సమర్పించాలని కూడా సహారాకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
► అయితే డబ్బు చెల్లింపు ప్రక్రియలో ఇన్వెస్టర్ల చిరునామాలు, బ్యాంక్ అకౌంట్ల విషయంలో నెలకొన్న వివాదాలు, సందేహాల నేపథ్యంలో జమ మొత్తాలను ప్రత్యేక సెబీ–సహారా రిఫండ్ అకౌంట్‌లో జమచేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.
► అయితే 2012 ఉత్తర్వుల తర్వాత సహారా సంస్థలు ఇప్పటి వరకూ రూ.15,455.70 కోట్ల్ల మొత్తాలనే డిపాజిట్ చేశాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా– సెబీ తా జాగా పేర్కొంది. వివిధ జాతీయ బ్యాంకుల్లో ఈ మొత్తాలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు వెల్లడించింది. 2020, సెప్టెంబర్ 30వ తేదీ నాటికి వడ్డీ తోసహా సెబీ–సహారా రిఫండ్ అకౌంట్ ఆర్జన రూ.22,589.01 కోట్లకు చేరినట్లు పేర్కొంది.
► చెల్లించాల్సింది రూ.రూ.25,781.32 కోట్లయితే, చెల్లించింది రూ.15,455.70 కోట్లు. వెరసి చెల్లించాల్సిన అసలు రూ.10,325.62 కోట్లని సెబీ పేర్కొంది. 2012 ఆగస్టు 31వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 15% వడ్డీని కూడా పరిగణనలోకి తీసుకుంటే, 2020 సెప్టెబర్ 30వ తేదీ నాటికి సహారా చెల్లించాల్సిన మొత్తాలు రూ.62,602.90 కోట్లకు చేరినట్లు సెబీ తాజాగా సుప్రీంకోర్టుకు విన్నవించింది.
► బకాయిల చెల్లింపులకు సుప్రీం ఎన్ని అవకాశాలు కల్పించినా వాటిని వినియోగించుకోకుండా, సహారా గ్రూప్ సంస్థలు, ఆ సంస్థల చీఫ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని విమర్శించింది.
► ఈ కేసులో 2014 మార్చి 4వ తేదీ నుంచీ 2016 మే 6వ తేదీ వరకూ (డైరెక్టర్లు రవి శంకర్ దుబే, అశోక్‌రాయ్ చౌదరిసహా) తీహార్ జైలులో ఉన్న సుబ్రతా రాయ్ తల్లి మరణం నేపథ్యంలో అంతిమ సంస్కారాల కోసం విడుదలయ్యారు. సహారా ఆస్తులు అమ్మి అయినా, చెల్లింపులు జరుపుతామని హామీ ఇచ్చిన రాయ్, ఈ దిశలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కోర్టు ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేస్తున్నట్లు తాజాగా సెబీ ఆరోపించింది.
రూ. 62,603 కోట్లు కట్టాల్సిందే..
Published Sat, Nov 21 2020 5:48 AM | Last Updated on Sat, Nov 21 2020 5:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment