సెబీలో ఎఫ్‌ఎంసీ విలీనం
ఒకటైన రెండు నియంత్రణ సంస్థలు...
- కమోడిటీ మార్కెట్లో విశ్వాసం పెంచుతాం
- విదేశీ ఇన్వెస్టర్లు, బ్యాంకులకు అనుమతిస్తాం
- సెబీ చైర్మన్ యు.కె. సిన్హా
ముంబై: కమోడిటీ మార్కెట్లో విశ్వాసం పెంచడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని సెబీ చైర్మన్ యు.కె. సిన్హా చెప్పారు. ఈ మార్కెట్లో పాల్గొనడానికి విదేశీ ఇన్వెస్టర్లను, బ్యాంక్‌లను అనుమతించడం ద్వారా కమోడిటీ మార్కెట్ అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. సెక్యూరిటీల మార్కెట్ సెబీలో కమోడిటీ మార్కెట్‌ను నియంత్రించే ఫార్వార్డ్ మార్కెట్స్ కమిషన్(ఎఫ్‌ఎంసీ) విలీనమైన సందర్భంగా ఆయన మాట్లాడారు.
కమోడిటీల ట్రేడింగ్‌లో తప్పులు జరగకుండా జాగ్రత్తగా వ్యహరిస్తామని సిన్హా చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లు మాత్రమే మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతారనేది అపోహ అని, దేశీ ఇన్వెస్టర్లు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం గంట కొట్టి ఈ విలీనాన్ని లాంఛనపూర్వకంగా పూర్తి చేశారు. రెండు నియంత్రణ సంస్థలు విలీనం కావడం ఇదే మొదటిసారి. ఈ విలీనం వల్ల కమోడిటీ డెరివేటివ్‌ల మార్కెట్లో అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో మూడు జాతీయ, ఆరు ప్రాంతీయ ఎక్స్ఛేంజ్‌ల్లో కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరుగుతోంది.