న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఓ కంపెనీకి చైర్మన్, ఎండీగా ఒక్కరే బాధ్యతలు నిర్వహించేందుకు వీలుంది. కానీ, సెబీ ప్యానెల్ సిఫారసులు అమలు చేస్తే ఇక ముందు ఈ అవకాశం ఉండకపోవచ్చు. చైర్మన్‌గా ఉన్న వ్యక్తి ఎండీ బాధ్యతలు చేపట్టలేరు. కార్పొరేట్ గవర్నెన్స్ (నిర్వహణ) నిబంధనల్లో భారీ సంస్కరణలకు వీలు కల్పించేలా ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన సెబీ ఈ ప్యానెల్ సిఫారసులు చేయడం విశేషం.
చైర్మన్ పదవిని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకే పరిమితం చేయాలని ప్యానెల్ సూచించింది. అలాగే, కనీసం ఒక మహిళను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించాలని కూడా సిఫారసు చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌నే చైర్మన్‌గా నియమించాలనే ప్రతిపాదన చైర్మన్, ఎండీ పోస్టుల విభజనకు దారితీయనుంది. ఇక ఓ కంపెనీ బోర్డు సభ్యుల సంఖ్య ఆరుకు పెంచాలని, ఓ ఏడాదిలో బోర్డు కనీసం ఐదు సార్లు సమావేశాలు నిర్వహించాలన్న సిఫారసులు కూడా ఉన్నాయి. ఓ మహిళ బోర్డులో ఉండాలన్న నిబంధన ఇప్పటికే ఉంది.
అయితే, ఇండిపెండెండ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీటిలో ఏ రూపంలో అయినా నియమించుకునే వెసులుబాటు ఉంది. తాజా సిఫారసు ప్రకారం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఒక మహిళ ఉంచటం తప్పనిసరి కానుంది. టాటా గ్రూపు, ఇన్ఫోసిస్ సంస్థల్లో ఇటీవలి కాలంలో కార్పొరేట్ గవర్నెన్స్ ఉల్లంఘనలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో సెబీ ప్యానెల్ తాజా సిఫారసులకు ప్రాధాన్యం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment