సెబీ ఉద్యోగులకు శుభవార్త
ముంబై : మార్కెట్ రెగ్యులేటరీ సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) శాశ్వత ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ పథకాన్ని సెబీ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఉద్యోగుల రక్షణను పెంచే లక్ష్యంతో శాశ్వత ఉద్యోగుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని సెబీ యోచిస్తోంది. వచ్చే వారంలో జరగబోయే బోర్డు మీటింగ్ లో సెబీ ఈ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ప్రస్తుతం ఈ మార్కెట్ రెగ్యులేటరీ ఉద్యోగులకు ఎటువంటి పెన్షన్ పథకం అమలులో లేదు. అయితే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్)ను సెబీ ఆఫర్ చేస్తోంది.
సెబీ తీసుకొస్తున్న ఈ ప్రతిపాదనతో, ప్రస్తుతమున్న ఉద్యోగులు ఇప్పటికే అమల్లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ ను కాని, న్యూ పెన్షన్ స్కీమ్ ను కాని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ లో కొనసాగుతున్న ఉద్యోగులు కొత్త పెన్షన్ పథకాన్ని ఎంపికచేసుకున్నా.. వారు పీఎఫ్ మెంబర్ గా కొనసాగడానికి అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగులు కోరుకుంటే పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని కొత్త పెన్షన్ పథకానికి మళ్లిస్తారు. శాశ్వత సర్వీసుపై వచ్చే కొత్త ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ కిందకు వస్తారని తెలిపింది. పీఎఫ్, సెబీ రెండూ కలిసి కొంత మొత్తాన్ని కొత్త పెన్షన్ స్కీమ్ కు కంట్రిబ్యూట్ చేయనున్నాయి.