మార్కెట్లోకి పీఎస్‌యూల నగదు నిల్వలు! | Sebi seeks increased PSU investment in mutual funds, uniform pension fund tax | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి పీఎస్‌యూల నగదు నిల్వలు!

Published Mon, Jun 9 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

మార్కెట్లోకి పీఎస్‌యూల నగదు నిల్వలు!

మార్కెట్లోకి పీఎస్‌యూల నగదు నిల్వలు!

 బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం...
 
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడి అవసరాలకోసం ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల వద్దనున్న మిగలు నగదు నిల్వలను మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)లలో ఇన్వెస్ట్ చేసేలా అనుమతించాలని ప్రభుత్వానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సూచించింది. దీంతోపాటు పెన్షన్ ఫండ్స్ అన్నింటికీ ఒకేవిధమైన పన్నువిధానాన్ని వర్తింపజేయాలని కూడా కోరింది. ప్రధానంగా భారతీయ మార్కెట్లు విదేశీ పెట్టుబడులపై మరీ అధికంగా ఆధారపడకుండా చేయడం, దీర్ఘకాలిక పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు వీలుగా పీఎస్‌యూల మిగులు నిల్వలను ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతిపాదనను సెబీ తీసుకొచ్చింది.
 
 ప్రస్తుతం ఈ అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందని... వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంబంధిత సీనియర్ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టే ఎంఎఫ్‌లకు పన్ను ప్రయోజనాలు, ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌ఓ) వద్దనున్న రూ.5 లక్షల కోట్లకు పైగా మూల నిధిలో కొంత మొత్తాన్ని స్టాక్ మార్కెట్ షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని కూడా సెబీ కోరుతోంది. మరోపక్క, కార్పొరేట్లు కూడా తమ సొంత పెన్షన్ ఫండ్‌లను ప్రారంభించాలని, వీటిలోని కొన్ని నిధులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా వెచ్చించాలనేది సెబీ సూచన.
 
దేశంలో స్టాక్ మార్కెట్లకు విదేశీ నిధులే ప్రధాన ఇంధనంగా పనిచేస్తున్నాయి. ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ క్యాప్(ప్రమోటర్లవద్దనున్న షేర్లు కాకుండా ఇన్వెస్టర్ల వద్దనున్న స్టాక్స్ విలువ)లో సగానికి సగం విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ)వద్దే ఉండటం దీనికి నిదర్శనం. అంతేకాదు భారత్ స్టాక్ మార్కెట్లో ఎఫ్‌ఐఐలు ఇన్వెస్ట్ చేసే నిధుల్లో దాదాపు సగభాగం వివిధ దేశాల్లోని పెన్షన్ ఫండ్స్ నుంచి తరలివస్తున్నాయి. భారత్‌లో మాత్రం పెన్షన్ నిధులను స్టాక్స్‌లో పెట్టుబడిగా వెచ్చించేందుకు అనుమతులు లేకపోవడం గమనార్హం.
 
ప్రస్తుతం నవరత్న, మినీరత్న కేంద్ర పీఎస్‌యూలకు మాత్రమే ప్రభుత్వ రంగ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. అలాకాకుంగా మొత్తం పీఎస్‌యూలన్నింటినీ తమ మిగులు నగదు నిల్వలను ఫండ్స్‌లో పెట్టుబడులకు అనుమతించాలనేది సెబీ వాదన. దేశంలో మొత్తం 250కిపైగా కేంద్ర పీఎస్‌యూలు ఉన్నాయి. వీటివద్దనున్న నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం సుమారు రూ.3 లక్షల కోట్లుగా అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement