టాటా గ్రూపు కంపెనీల వివరణ కోరిన సెబీ...
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్పొరేట్ గ్రూపు అయిన టాటాల యాజమాన్యం విషయంలో జరుగుతున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వీటిపై దృష్టిసారించింది. కార్పొరేట్ పరిపాలనా నియమాలు, లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న అంశాలను పరిశీలిస్తోంది. టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి అవమానకరరీతిలో ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ... టాటా గ్రూపు కంపెనీలకు సంబంధించి 1.18 లక్షల కోట్ల రూపాయల నష్టాలను చూపించాల్సి ఉందంటూ పేర్కొనడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో టాటా గ్రూపు లిస్టెడ్ కంపెనీల నుంచి సెబీ వివరణ కోరింది. ఈ మేరకు టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్, టాటా టెలీసర్వీసెస్, టాటా పవర్ సహా గ్రూపులోని ఇతర కంపెనీలకు సెబీ నుంచి ఆదేశాలు అందాయి. అన్ని అంశాలపై పూర్తి వివరాలివ్వాలని ఎక్స్ఛేంజ్‌లు కూడా టాటా గ్రూపు కంపెనీలకు నోటీసులు జారీ చేశాయి. మీడియాలో వచ్చిన వార్తలపై వివరణ ఇవ్వాలని ప్రతీ అంశంపై క్రమ పద్ధతిలో వివరాలు చెప్పాలని ఆదేశించాయి.