న్యూఢిల్లీ: మొన్నటి వరకు ఆసియా ప్రాంతంలో బలహీనంగా కనిపించిన రూపాయి ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది. ఆసియాలోనే వరస్ట్ పనితీరు నుంచి అత్యుత్తమ పనితీరు చూపించే స్థాయికి మారిపోయింది. కేవలం ఐదు వారాల్లోనే రూపాయి తన దిశను మార్చుకోవడం వెనుక మోదీ ఫ్యాక్టరే ప్రధానంగా పనిచేయడం ఆసక్తిదాయకం. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడుల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల అనంతరం తిరిగి మోదీ నాయకత్వంలోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు బలపడ్డాయి. ఇవే అంచనాలు దన్నుగా విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్లలోకి ఐదు వారాలుగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. దీంతో రూపాయి కళను సంతరించుకుంది. డాలర్ మారకంలో 70లోపునకు దిగొచ్చింది. మోదీ రెండోసారి విజయం సాధిస్తే రూపాయి మరింత బలపడుతుందని సింగపూర్‌లోని స్కాటియా బ్యాంకు కరెన్సీ స్ట్రాటజిస్ట్ గావోక్వి తెలిపారు. జూన్ చివరి నాటికి డాలర్‌తో రూపాయి 67 స్థాయికి పుంజుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ వృద్ధి పడిపోతుండడంతో ప్రధాన సెంట్రల్ బ్యాంకులు డోవిష్ విధానాన్ని వ్యక్తీకరించడం కూడా విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన ఆసియా కరెన్సీల్లో రాబడుల కోసం ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు ఆయన చెప్పారు.
విదేశీ పెట్టుబడుల వెల్లువ...
మార్చి నెలలో(18 నాటికి) విదేశీ ఇన్వెస్టర్లు భారత్ ఈక్విటీ మార్కెట్లో 3.3 (రూ.23వేల కోట్లు అంచనా) బిలియన్ డాలర్లను కుమ్మరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన 5.6 బిలియన్ డాలర్లలో 50 శాతానికంటే ఎక్కువ కేవలం గత 3 వారాల్లోనే రావడం గమనార్హం. బాండ్లలో ఈ నెలలో ఇప్పటి వరకు 1.4 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశారు. డాలర్ల వెల్లువతో రూపాయి గతేడాది ఆగస్ట్ తర్వాత తిరిగి గరిష్ట స్థాయికి చేరుకుంది. గత నెల రోజుల్లో డాలర్లలో రుణాలు తీసుకుని రూపాయి ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల వచ్చిన రాబడులు 3.8 శాతంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ క్యారీ ట్రేడింగ్ రాబడులు రూపాయిలోనే ఉండడం గమనార్హం. మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే త్వరలో జరిగే ఎన్నికల్లో 272 లోక్‌సభ స్థానాలను సాధిస్తుందని రెండు ఒపీనియన్ పోల్స్ అంచనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ‘‘మార్కెట్లు మోదీ విజయాన్ని పరిగణనలోకి తీసుకున్నాయి. ఉన్నట్టుండి మార్కెట్ వాతావరణం మారేందుకు మరే ఇతర అంశం లేదు’’ అని కోటక్ సెక్యూరిటీస్ అనలిస్ట్ అనిద్య బెనర్జీ పేర్కొన్నారు. రూపాయి పట్ల ఆశావహ పరిస్థితి డెరివేటివ్ మార్కెట్లపైనా ప్రతిఫలిస్తోంది. నెలవారీ ఆప్షన్లలో రూపాయి కొనుగోలు కంటే విక్రయం 19 బేసిస్ పాయింట్లు అధికం ఉన్నాయి. ‘‘అంతర్జాతీయ పరిస్థితులు ఫెడ్, ఈసీబీ డోవిష్ ధోరణి దేశీయంగా మరింత మద్దతుగా మారాయి. బీజేపీ విజయావకాశాలపై విశ్వాసం పెరగడం, అదే సమయంలో విదేశీ పోర్ట్‌ఫోలియో నిధుల్లో రికవరీ నెలకొనడం రూపాయిని నడిపిస్తున్నాయి’’ అని నోమరా కరెన్సీ స్ట్రాటజిస్ట్ దుష్యంత్ పద్మనాభన్ తెలిపారు. రూపాయి మూడు నెలల అంతర్గత వోలటాలిటీ కూడా 5.87 శాతానికి పడిపోయింది. గతేడాది ఆగస్ట్ తర్వాత మళ్లీ ఇదే తక్కువ స్థాయి. ఇది రూపాయి బుల్లిష్ ధోరణిని తెలియజేస్తోంది. రూపాయి సమీప కాలంలో స్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు బార్క్‌లేస్ స్ట్రాటజిస్ట్ ఆశిష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. బీజేపీ కనుక మరలా విజయం సాధిస్తే ఈ ఏడాది మిగిలిన కాలంలో రూపాయి బలం చూపిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
రూపాయి ‘బెస్ట్’!
Published Wed, Mar 27 2019 12:00 AM | Last Updated on Wed, Mar 27 2019 12:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment