తొమ్మిది రోజుల వరుస లాభాల అనంతరం బుధవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, ట్రేడింగ్ చివర్లో బ్యాంక్ షేర్ల నష్టాలు, ఇటీవల బాగా లాభపడిన షేర్లలో లాభాల స్వీకరణ తదితర అంశాల కారణంగా స్టాక్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. ఇండెక్స్ హెవీ వెయిట్ ఐటీసీ 3 శాతం లాభపడటంతో నష్టాలు తగ్గాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 63 పాయింట్ల నష్టంతో 34,332 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 10,526 పాయింట్ల వద్ద ముగిశాయి.
బ్యాంక్ షేర్లు బేర్...
మొండి బకాయిల నిబంధనలను కఠినతరం చేస్తూ ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలను మార్చే ప్రసక్తే లేదని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్.ఎస్. విశ్వనాథన్ తేల్చి చెప్పడంతో బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు 1 శాతం వరకూ నష్టపోయాయి. కంపెనీల క్యూ4 ఫలితాలు, వర్షాలపై ఆశావహ అంచనాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో సెంటిమెంట్ ఆశావహంగా ఉన్నప్పటికీ, తొమ్మిది రోజుల వరుస లాభాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పాయని నిపుణులంటున్నారు. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 197 పాయింట్ల లాభంతో 34,592 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయింది. 125 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో 34,270 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. రోజు మొత్తంలో 322 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. తొమ్మిది రోజుల వరుస లాభాల అనంతరం మార్కెట్ నష్టపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. రూపాయి బలహీనపడటం, ఈల్డ్‌లు పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని వివరించారు. వాణిజ్య యుద్ధ భయాలు తగ్గడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
మిధాని మేజిక్
మిశ్రధాతు నిగమ్ (మిధాని) వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభపడింది. ఈ ప్రభుత్వ రంగ మినీ రత్న కంపెనీ ఇటీవలనే స్టాక్ మార్కెట్‌లో లిస్టైన సంగతి తెలిసిందే. ఇష్యూ ధర, రూ.90తో పోల్చితే 3 శాతం నష్టంతో రూ.87 వద్ద ఈ షేర్ లిస్ట్ అయింది. ఈ ధరతో పోల్చితే ఈ షేర్ 76 శాతం లాభపడి బుధవారం రూ.153 వద్ద ముగిసింది. 2025 కల్లా రక్షణ రంగ వస్తువులు, సేవల విషయంలో 1.7 లక్షల కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమంటూ రక్షణ మంత్రిత్వ శాఖ గత నెలలో ఒక ముసాయిదా విధానాన్ని రూపొందించింది. దీంతో ఈ రక్షణ రంగ కంపెనీ షేర్ జోరుగా పెరుగుతోందని నిపుణులంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment