![Sensex ends 120 pts down; Metal sheds, Realty shines - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/11/MARKET12.jpg.webp?itok=LQL-1xmh)
ముంబై: మెటల్, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. క్రూడాయిల్ రికవరీ, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. అదానీ గ్రూప్‌లోని నాలుగు కంపెనీలపై మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్‌నేషనల్(ఎంఎస్‌సీఐ) వెయిటేజీ తగ్గింపు, ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంలో ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా పూర్తిగా వాటా విక్రయం అంశాలూ ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి.
ట్రేడింగ్‌లో 272 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 124 పాయింట్లు పతనమై 60,683 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 17,856 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 17,781 వద్ద కనిష్టాన్ని, 17,877 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. రియల్టీ, వినిమయ, మౌలిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,458 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.291 కోట్లను విక్రయించారు. ఎంఎస్‌సీఐ వెయిటేజ్ తగ్గింపుతో అదానీ గ్రూప్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపింది. డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలపడి 82.51 స్థాయి వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment