
నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్ల లాభాలకు సోమవారం బ్రేక్ పడింది. ఆర్థిక సర్వే, బడ్జెట్‌ల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్33 పాయింట్లు నష్టపోయి 27,850 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 8,633 పాయింట్ల వద్ద ముగిశాయి.
హెచ్చుతగ్గుల ట్రేడింగ్..
నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ మొత్తంలో తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనైంది. లాభ, నష్టాల మధ్య దోబూచులాడి చివరకు 33 పాయింట్లు క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడం, క్యూ3 ఫలితాలు అంచనాలను మించడంతో దేశీయ ఇన్వెస్టర్ల ఉత్సాహం కారణంగా గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 848 పాయింట్లు పెరిగింది. దీంతో పలు షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. అమెరికా క్యూ4 జీడీపీ గణాంకాలు బలహీనంగా ఉండటంతో అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారని పేర్కొన్నారు. నేడు(మంగళవారం) ఆర్థిక సర్వే వెలువడనుండగా, రేపు(బుధవారం) కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.
ఐటీ షేర్లకు నష్టాలు...
30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు నష్టాల్లో, 11 షేర్లు లాభాల్లో ముగిశాయి. పునర్వ్యస్థీకరణలో భాగంగా ఉన్నత స్థాయిలో అధికారుల మార్పులు, చేర్పులు ఉంటాయన్న వార్తల కారణంగా టాటా మోటార్స్ 2 శాతం పడిపోయింది. సెన్సెక్స్ షేర్లలో బాగా నష్టపోయిన షేర్ ఇదే. వలస నిబంధనలు కఠికతరం చేయనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ట్రంప్ వ్యాఖ్యలతో ఐటీ షేర్లు కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ షేర్లు ఇంట్రాడేలో 2 శాతం వరకూ నష్టపోయాయి. టాటాస్టీల్ 1.5 శాతం కుదేలైంది. ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, హీరో మోటొకార్ప్, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, టీసీఎస్, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, హిందుస్తాన్ యునిలివర్, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి.