OSGC
-
అత్యంత లాభదాయక పీఎస్‌యూగా ఐఓసీ
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత లాభదాయక ప్రభుత్వ రంగ కంపెనీగా (పీఎస్‌యూ) పెట్రో మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఆవిర్భవించింది. టర్నోవర్‌కు సంబంధించి అతిపెద్ద కంపెనీగా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఐఓసీ నికరలాభం 2017 మార్చితో ముగిసిన ఏడాదిలో 70 శాతం వృద్ధితో రూ. 19,106 కోట్లకు చేరింది. దీంతో లాభాల విషయంలో చమురు ఉత్పాదక దిగ్గజం ఓఎన్జీసీని ఐఓసీ అధిగమించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఓఎన్జీసీ రూ. 17,900 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఓఎన్జీసీ నికరలాభం రూ. 16,140 కోట్లుకాగా, ఐఓసీ నికరలాభం రూ. 11,242 కోట్లు మాత్రమే. అధిక రిఫైనింగ్ మార్జిన్లు, నిల్వల ద్వారా వచ్చిన లాభాలు, ఉత్పాదక సామర్థ్యంలో మెరుగుదల వంటి అంశాల కారణంగా అధిక వృద్ధి సాధ్యపడిందని ఐఓసీ సీఎండీ బి అశోక్ తెలిపారు. సహజవాయువుపై ప్రభుత్వ ధరల విధానంతో రూ. 3,000 కోట్ల నికరలాభాన్ని కోల్పోయామని ఓఎన్జీసీ దినేష్ కె సార్రాఫ్ పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలో రిలయన్స్ టాప్... ప్రైవేటు రంగ కంపెనీల్లో అత్యధిక లాభదాయక కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా మూడో ఏడాది నిలబడింది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 29,901 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. తదుపరి స్థానంలో రూ. 26,357 కోట్ల లాభంతో టీసీఎస్ వుంది. -
రికార్డ్ స్థాయిలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్
501 బావుల డ్రిల్లింగ్ న్యూఢిల్లీ: ఓఎన్జీసీ... బావుల డ్రిల్లింగ్‌లో గత ఆర్థిక సంవత్సరం కొత్త రికార్డ్‌ను సృష్టించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.15,747 కోట్ల ఖర్చుతో 501 చమురు బావులను డ్రిల్లింగ్ చేసినట్లు ఓఎన్జీసీ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో 386 బావులను డ్రిల్లింగ్ చేశామని ఓఎన్జీసీ సీఎండీ దినేశ్ కె సరాఫ్ చెప్పారు. 500కు మించిన బావులను డ్రిల్ చేయడం 23 ఏళ్లలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 490 బావులను డ్రిల్లింగ్ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని, ఈ లక్ష్యాన్ని దాటేశామని వివరించారు. డ్రిల్లింగ్ చేసిన 501 బావుల్లో 334 ఆన్‌షోర్, 167 ఆన్‌షోర్ బావులని పేర్కొన్నారు. ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పలు ఆయిల్ కంపెనీలు తమ అన్వేషణ కార్యకలాపాలను తగ్గించాయని, కానీ తాము అన్వేషణ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించామని సరాఫ్ తెలియజేశారు. నిర్వహణ సామర్థ్యం పెంచుకోవడానికి, వ్యయాల నియంత్రణ కోసం గత ఆర్థిక సంవత్సరంలో చాలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. బావులను డ్రిల్లింగ్ చేయడం ద్వారా చమురు నిక్షేపాలను అన్వేషించడం జరగుతుంది. -
నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్ల లాభాలకు సోమవారం బ్రేక్ పడింది. ఆర్థిక సర్వే, బడ్జెట్ల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్33 పాయింట్లు నష్టపోయి 27,850 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 8,633 పాయింట్ల వద్ద ముగిశాయి. హెచ్చుతగ్గుల ట్రేడింగ్.. నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ మొత్తంలో తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనైంది. లాభ, నష్టాల మధ్య దోబూచులాడి చివరకు 33 పాయింట్లు క్షీణించింది. విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడం, క్యూ3 ఫలితాలు అంచనాలను మించడంతో దేశీయ ఇన్వెస్టర్ల ఉత్సాహం కారణంగా గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 848 పాయింట్లు పెరిగింది. దీంతో పలు షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. అమెరికా క్యూ4 జీడీపీ గణాంకాలు బలహీనంగా ఉండటంతో అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారని పేర్కొన్నారు. నేడు(మంగళవారం) ఆర్థిక సర్వే వెలువడనుండగా, రేపు(బుధవారం) కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఐటీ షేర్లకు నష్టాలు... 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు నష్టాల్లో, 11 షేర్లు లాభాల్లో ముగిశాయి. పునర్వ్యస్థీకరణలో భాగంగా ఉన్నత స్థాయిలో అధికారుల మార్పులు, చేర్పులు ఉంటాయన్న వార్తల కారణంగా టాటా మోటార్స్ 2 శాతం పడిపోయింది. సెన్సెక్స్ షేర్లలో బాగా నష్టపోయిన షేర్ ఇదే. వలస నిబంధనలు కఠికతరం చేయనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ట్రంప్ వ్యాఖ్యలతో ఐటీ షేర్లు కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ షేర్లు ఇంట్రాడేలో 2 శాతం వరకూ నష్టపోయాయి. టాటాస్టీల్ 1.5 శాతం కుదేలైంది. ఓఎన్జీసీ, ఎస్బీఐ, హీరో మోటొకార్ప్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, టీసీఎస్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, హిందుస్తాన్ యునిలివర్, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి.