స్టాక్ మార్కెట్ మూడురోజుల వరుస లాభాల ప్రారంభానికి శుక్రవారం బ్రేక్ పడింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దేశీయ ఈక్విటీ మార్కెట్లు ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకోవడంతో నేడు మార్కెట్ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో 31896 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లను కోల్పోయి 9414 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అత్యధికంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 1.25శాతం నష్టపోయి 19వేల దిగువన 18,927.20 వద్ద ట్రేడ్ అవుతోంది.
మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్చి క్వార్టర్ జీడీపీ గణాంకాలు నేడు మార్కెట్ ముగింపు తర్వాత విడుదల కానున్నాయి. లాక్‌డౌన్ విధింపు నేపథ్యంలో జీడీపీ వృద్ధి భారీగా క్షీణించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నాయి. వోల్టాస్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, మెట్రోపోలీస్ హెల్త్‌కేర్ కంపెనీలతో పాటు సుమారు 31కంపెనీలు నేడు మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. వీటికి తోడు నేడు మార్కెట్‌కు వారంతపు రోజు కావడంతో అటు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజూకు పెరుగుతుండటం, ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి.
బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు
హాంకాంగ్ హక్కులను హరించివేసే ‘జాతీయ భద్రతా చట్టాన్ని’ చైనా పార్లమెంటు గురువారం ఆమోదించింది. అమెరికాతో సహా పలు అగ్రదేశాలు మొదటి నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. అన్ని దేశాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం అమలుకు చైనా ఆమోదం తెలిపింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ మైక్ పాంపియో స్పందించారు. చైనా ఆధీనంలో హాంకాంగ్ స్వతంత్రంగా ఉన్నట్లు ఇక అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోదని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై తమ వైఖరి తెలిపేందుకు శుక్రవారం సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైనాపై మరోసారి టారీఫ్‌లు విధించే అవకాశం ఉంటుందనే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఫలితంగా నిన్నరాత్రి తొలుత అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడైనా, ట్రంప్ ప్రకటన తర్వాత తిరిగి నష్టాల్లో మళ్లాయి. డోజోన్స్, నాస్‌డాక్ ఇండెక్స్‌లు అరశాతం నష్టంతో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ ఇండెక్స్ 0.2శాతం నష్టపోయింది. నేడు ఆసియాలో మార్కెట్లో ఒక్క చైనా మార్కెట్(అరశాతం లాభాల్లో)తప్ప మిగిలినఅన్ని దేశాలకు చెందిన స్టాక్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
బజాజ్ ఫైనాన్స్, జీ లిమిటెడ్, ఇండస్‌ఇండ్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం నష్టపోయాయి. యూపీఎల్, సన్‌ఫార్మా, సిప్లా, గ్రాసీం, ఇన్ఫ్రాటెల్ షేర్లు 1శాతం నుంచి 4శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment