ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఒకవైపు చైనా–అమెరికా మధ్య చర్చలు తిరిగి ప్రారంభం అవుతాయన్న ఆశాభావం ఉన్నప్పటికీ.. మరోవైపు అమెరికాలో రాజకీయ అనిశ్చితి ప్రభావం శుక్రవారం నష్టాలకు దారితీసింది. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాటలోనే ప్రయాణించాయి. సెన్సెక్స్ 167 పాయింట్లు నష్టపోయి (0.43 శాతం) 38,822 వద్ద క్లోజయింది. నిఫ్టీ 58.80 పాయింట్లు క్షీణించి (0.51శాతం) 11,512 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 325 పాయింట్ల శ్రేణిలో ట్రేడ్ అయింది. వేదాంత, ఇండస్‌ఇండ్ బ్యాంకు, యస్ బ్యాంకు, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎంఅండ్‌ఎం, టీసీఎస్, హీరో మోటోకార్ప్ సూచీల నష్టాలకు కారణమయ్యాయి. బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, ఆర్‌ఐఎల్, కోటక్ బ్యాంకు, ఎన్‌టీపీసీ అత్యధికంగా లాభపడ్డాయి. అయితే, సూచీలు ఈ వారం మొత్తం మీద లాభపడడం గమనార్హం. సెన్సెక్స్ 808 పాయింట్లు, నిఫ్టీ 238 పాయింట్ల వరకు అంటే సుమారు 2 శాతం మేర ఈ వారం పెరిగాయి. ట్రంప్ అభిశంసనకు సంబంధించిన ఆందోళనల ప్రభావం మార్కెట్లపై చూపించినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు. సెన్సెక్స్ ఈ వారంలో 2 శాతం లాభపడింది.
Comments
Please login to add a commentAdd a comment