Sensex loss
-
సెన్సెక్స్ మైనస్.. నిఫ్టీ ప్లస్!
ముంబై: స్టాక్ మార్కెట్ దూకుడుకు బుధవారం అడ్డుకట్ట పడింది. ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే చివరకు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 29 పాయింట్ల నష్టంతో 54,526 వద్ద స్థిరపడింది. నిఫ్టీ రెండు పాయింట్లు స్వల్ప లాభంతో 16,282 వద్ద నిలిచింది. మార్కెట్ ప్రథమార్థంలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలను పరిమితం చేసుకోగలిగాయి. ప్రైవేట్ బ్యాంక్స్, ఆర్థిక, ఫార్మా షేర్లలో భారీ పతనాన్ని చవిచూశాయి. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్స్, రియల్టీ షేర్లు రాణించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 592 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 306 పాయింట్లు శ్రేణిలో ట్రేడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.238 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.206 కోట్ల షేర్లను కొన్నారు. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభ, నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో రికవరీ... అకారణంగా ర్యాలీ చేసే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లపై అదనపు నిఘా చర్యలను తీసుకుంటామని బీఎస్ఈ ఎక్సే్చంజీ ఆగస్ట్ 9న ఒక సర్క్యులేషన్ జారీ చేసింది. ఎక్సే్చంజీ తీసుకున్న కొత్త నిర్ణయంతో గత రెండురోజులుగా చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్రంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ఈ నిఘా చర్యలు రూ.1000 కోట్ల మార్కెట్ విలువ (లేదా) షేరు ధర రూ.20లోపు ఉన్న కంపెనీలకే పరిమితమని బీఎస్ఈ ఎక్సే్చంజీ బుధవారం వివరణ ఇచ్చింది. ఎక్సే్చంజీ తాజా నిర్ణయంతో స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు చాలా వరకు రికవరీ అయ్యాయి. ఉదయం సెషన్లో రెండున్నర శాతం క్షీణించిన బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు చివరికి ఒకశాతం నష్టంతో సరిపెట్టుకున్నాయి. పతనాన్ని అడ్డుకున్న మెటల్ షేర్లు మెటల్ షేర్లు రాణించి ర్యాలీ సూచీల భారీ పతనాన్ని అడ్డుకున్నాయి. అమెరికా సెనెట్ ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన మౌలిక సదుపాయాల బిల్లుకు ఆమోదం తెలిపింది. మరోవైపు ఇతర దేశాలకు కమోడిటీలను ఎగుమతి చేసే కంపెనీలకు ఇచ్చే రాయితీలను తగ్గిస్తూ ఈ మధ్యనే చైనా నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలు భారత కమోడిటీ కంపెనీలకు కలిసొస్తాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు మెటల్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. ఇంట్రాడేలో మెటల్ షేర్లు ర్యాలీతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా మూడుశాతానికి పైగా లాభపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► జూన్ త్రైమాసికంలో నష్టాలను ప్రకటించినా జొమాటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 11% ర్యాలీ చేశాయి. చివరికి 9% లాభంతో రూ.136 వద్ద ముగిశాయి. ► మెటల్ షేర్ల ర్యాలీలో వేదాంత 6.5% లాభంతో రూ.324 వద్ద స్థిరపడింది. ► జూన్ క్వార్టర్లో మెరుగైన ఫలితాలతో కిమ్స్ హాస్పిటల్స్ షేరు ఎనిమిది శాతం లాభపడి రూ. 1275 వద్ద ముగిసింది. -
భారీ నష్టాల నుంచి రికవరీ
ఆర్థిక ప్యాకేజీ ద్రవ్యలోటుపై భారం మోపుతుందనే ఆందోళనతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో స్టాక్ సూచీలు స్వల్పంగా క్షీణించాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, ముడి చమురు ధరలు 2% మేర పెరగడం, అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 350 పాయింట్ల మేర నష్టపోయినప్పటికీ, సెన్సెక్స్ చివరకు 25 పాయింట్ల నష్టంతో 31,098 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 9,137 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 545 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. 526 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనా, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం తర్వాత లాభ,నష్టాల మధ్య దోబూచులాడి చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఒక దశలో 173 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ మరో దశలో 353 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 526 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో నష్టాలు తగ్గాయి. రియల్టీ, బ్యాంక్, వాహన,ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ జరగ్గా, ఇంధన,లోహ,టెలికం షేర్లలో వేల్యూ బయింగ్ జరిగింది. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 5 శాతం మేర నష్టంతో రూ.381 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 40కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఇండియా సిమెంట్స్, అజంతా ఫార్మా, అలెంబిక్ ఫార్మా, ఆర్తి డ్రగ్స్, రుచి సోయా తదితర షేర్లు వీటిలో ఉన్నాయి. ► చైనాలో గత నెలలో పారిశ్రామిక వృద్ధి పుంజుకుందన్న వార్తలతో లోహ షేర్లు లాభపడ్డాయి. -
మార్కెట్లకు స్వల్ప నష్టాలు
ముంబై: వరుసగా మూడు రోజుల పాటు లాభాలను నమోదుచేసిన దేశీ ప్రధాన స్టాక్ సూచీలు వారాంతాన నీరసించిపోయాయి. శుక్రవారం ఉదయం ఏకంగా 4 శాతం వరకు ర్యాలీ చేసిన సెన్సెక్స్ చివరకు 131 పాయింట్లు (0.44 శాతం) నష్టంతో 29,815 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 31,126 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన సెన్సెక్స్.. ఈ స్థాయి నుంచి చూస్తే 1,310 పాయింట్లను కోల్పోయింది. భారత జీడీపీ 2020లో కేవలం 2.5 శాతానికే పరిమితం అవుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ తన అంచనాను సవరించడం, అంతర్జాతీయంగా కోవిడ్–19 (కరోనా) వైరస్ మరణాలు పెరగడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో ఒక దశలో 29,347 పాయింట్లకు పడిపోయింది. ఇంట్రాడేలో 8,522 పాయింట్లకు పడిపోయిన నిఫ్టీ ముగింపు సమయానికి కోలుకుని 19 పాయింట్ల లాభంతో 8,660 వద్ద క్లోజయింది. ఉదయం సెషన్లో ఈ సూచీ 8,949 గరిష్ట స్థాయికి చేరింది. వైరస్ వ్యాప్తి కారణంగా కుంగిపోయిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెచ్చేందుకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు కీలక నిర్ణయాలను ప్రకటించినప్పటికీ.. ఇవేవీ మార్కెట్‌ను నిలబెట్టలేకపోయాయి. రెపో రేటు 4.4 శాతానికి దిగిరావడం బుల్స్‌కు శక్తిని ఇవ్వకపోగా, బేర్స్‌కు పట్టు పెంచింది. దీంతో వరుసగా 6వ వారంలోనూ సూచీలు నష్టాలనే నమోదు చేశాయి. 20,000 పాయింట్ల దిగువన బ్యాంక్ నిఫ్టీ టర్మ్లోన్ల ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం ప్రకటన వెలువడిన అనంతం బ్యాంక్ నిఫ్టీ 19,580 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. ఉదయం సెషన్లో 21,462 పాయింట్లకు చేరిన ఈ సూచీ చివరకు 1.81 శాతం లాభపడి 19,969 వద్ద ముగిసింది. బంధన్ బ్యాంక్ అత్యధికంగా 17% వరకు లాభపడగా.. ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు 6.5% శాతం లాభపడ్డాయి. వాటాల విక్రయంతో కేంద్రానికి 13,883 కోట్లు టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్ఈఈపీసీ) కంపెనీల్లో వాటాలను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 11,500 కోట్లను సమకూర్చుకుంది. టీహెచ్‌డీసీలో 74.49 శాతం వాటాను (విలువ రూ. 7,500 కోట్లు), ఎన్‌ఈఈపీసీలో 100 శాతం వాటాను (రూ. 4,000 కోట్లు) మరో ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీకి విక్రయించింది. మరోవైపు, కామరాజర్ పోర్ట్‌లో 66.67 శాతం వాటాను కూడా కేంద్రం చెన్నై పోర్ట్ ట్రస్టుకు విక్రయించింది. ఈ వాటా అమ్మకం విలువ రూ. 2,383 కోట్లు. -
కకావికలం
కరోనా ముసలం... కోవిడ్–19(కరోనా) వైరస్ ప్రపంచమంతా పాకుతుండటంతో అంతర్జాతీయ వృద్ధిపై భయాందోళనలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతమున్న ఆర్థిక మందగమనం కోవిడ్ వైరస్ కారణంగా మాంద్యంగా పరిణమిస్తుందనే భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. మన మార్కెట్ శుక్రవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు కీలక మద్దతులన్నింటినీ కోల్పోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,448 పాయింట్లు పతనమై 38,297 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయి 11,202 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 3.64 శాతం, నిఫ్టీ 3.71 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ చరిత్రలోనే ఇది రెండో అత్యంత భారీ పతనం. 2015, ఆగస్టు 24 వ తేదీన సెన్సెక్స్ అత్యధికంగా 1,625 పాయింట్లు నష్టపోయింది. ఆరో రోజూ నష్టాలే...: సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా ఆరో రోజూ క్షీణించాయి. ఈ రెండు సూచీలు నాలుగున్నర నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఇక ఈ వారంలో సెన్సెక్స్ 2,873 పాయింట్లు, నిఫ్టీ 879 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 6.9%, నిఫ్టీ 7.2% పడ్డాయి ఎదురీదిన ఐటీసీ ►మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో ఐటీసీ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. టెక్ మహీంద్రా 8 శాతం, టాటా స్టీల్ 7.5 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 7.5 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 7 శాతం, బజాజ్ ఫైనాన్స్ 6 శాతం, ఇన్ఫోసిస్ 6 శాతం చొప్పున పతనమయ్యాయి. ►400కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఏసీసీ, ఏబీబీ ఇండియా, అపోలో టైర్స్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటొ, గెయిల్, కోల్ ఇండియా, విప్రో, మహీంద్రా, వేదాంత, ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, లుపిన్, టాటా పవర్, హెచ్‌పీసీఎల్, పీఎన్బీ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. ►మిధాని, డీఐసీ ఇండియా తదితర 30 పైగా షేర్లు ఏడాది గరిష్టాలకు ఎగిశాయి. ►300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, ఇండియాబుల్స్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, శంకర బిల్డింగ్స్ ప్రొడక్టŠస్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా డీహెచ్ఎఫ్ఎల్, రుచి సోయా, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తదితర షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. పతనానికి ప్రధాన కారణాలు... ►వైరస్ విలయం... మొన్నమొన్నటిదాకా 30 దేశాలకే పరిమితమైన కోవిడ్–19 వైరస్ ఇప్పుడు మొత్తం ఆరు ఖండాల్లోని 57 దేశాలకు పాకింది. చైనాలో కొత్త కేసులు, కోవిడ్ వైరస్ బాధితుల మరణాలు తగ్గినప్పటికీ, న్యూజిలాండ్, నైజీరియా, అజర్బైజాన్, నెదర్లాండ్స్ దేశాల్లో కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వైరస్ సోకిన వారి సంఖ్య 80,000కు, మరణాల సంఖ్య 2,900కు చేరింది. ►ప్రపంచ మార్కెట్ల పతనం కోవిడ్–19 వైరస్ భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 2008 నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో ఒక వారం పాటు ప్రపంచ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. మళ్లీ ఈ ఏడాది ఈ వారంలో అదే స్థాయి నష్టాలు వాటిల్లాయి. శుక్రవారం షాంఘై, హాంగ్‌సెంగ్, సియోల్, టోక్యో సూచీలు 2–4 శాతం వరకూ నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు ఆరంభంలోనే 4% క్షీణించాయి. గురువారం అమెరికా స్టాక్ సూచీ, డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1,191 పాయింట్లు పతనమైంది. డోజోన్స్ చరిత్రలో ఇదే అత్యంత భారీ పతనం. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో డోజోన్స్ మొత్తం 3,581 పాయింట్లు (12%) మేర క్షీణించింది. ►విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ఈ వారంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రమారమి రూ.10,000 కోట్ల మేర నికర అమ్మకాలు జరిపారు. కోవిడ్–19 వైరస్ ప్రభావం మన దేశంపై లేనప్పటికీ, ప్రపంచ మార్కెట్ల పతనం కొనసాగితే, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ మరింతగా జరుగుతుందని నిపుణులంటున్నారు. ►ముడి చమురు ధరల పతనం కోవిడ్–19 వైరస్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించి చమురుకు డిమాండ్ తగ్గుతుందనే అంచనాలతో ముడి చమురు ధరలు 3.3 శాతం మేర నష్టపోయాయి. సాధారణంగా ముడి చమురు ధరలు పతనమైతే, మన మార్కెట్ లాభపడాలి. కానీ మాంద్యం భయాలతో ముడి చమురు ధరలు పడిపోవడం మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావమే చూపించింది. ►రూపాయి డౌన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 55 పైసలు క్షీణించి 72.16కు చేరడం కూడా స్టాక్ మార్కెట్లో అమ్మకాల జోరుకు ఒక కారణమైంది. పతనం ఇక్కడితో ఆగుతుందా ? స్టాక్ మార్కెట్ తదుపరి గమనంపై విశ్లేషకులు విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మన మార్కెట్ అంతర్జాతీయ సంకేతాలపై అధికంగా ఆధారపడుతోందని, ప్రపంచ మార్కెట్లు పతనమవుతుండటంతో ప్రస్తుతానికి మార్కెట్‌కు దూరంగానే ఉంటే మంచిందని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే ప్రతి పతనం కొనుగోలుకు మంచి అవకాశమని మరికొందరంటున్నారు. వచ్చే వారం పుల్‌బ్యాక్ ర్యాలీ...! మార్కెట్ ఇక్కడ స్థిరపడటానికి ఇది మంచి అవకాశమని ట్రేడింగ్‌బుల్స్ సీనియర్ ఎనలిస్ట్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వచ్చే వారం పుల్‌బ్యాక్ ర్యాలీకి అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. 200 రోజుల చలన సగటు(డీఎమ్ఏ)–11,687 పాయింట్లకు నిఫ్టీ చేరవచ్చని తెలిపారు. మద్దతు స్థాయిలు 11,200–11,100 పాయింట్లని, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించినప్పుడు నిఫ్టీ ఇక్కడినుంచే ర్యాలీ జరిపిందన్నారు. ఒకవేళ నిఫ్టీ 11,100 పాయింట్ల దిగువకు పడిపోతే నిఫ్టీ తదుపరి మద్దతు 10,700 పాయింట్లని పేర్కొన్నారు. పెట్టుబడులకు ఇదే మంచి తరుణమా..? కాగా కరోనా విలయం ప్రపంచ మార్కెట్లపై మరింతగానే ప్రభావం చూపుతుందని నిపుణులంటున్నారు. మన దేశంలో కోవిడ్–19 వైరస్ కేసులు ఏమీ నమోదు కాలేదని, ఈ విషయంలో ఇతర దేశాలతో పోల్చితే మన దేశం ఒకింత ఉత్తమ స్థాయిలోనే ఉందని మేబ్యాంక్ కిమ్ యంగ్ సెక్యూరిటీస్ సీఈఓ జిగర్ షా వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం దృష్ట్యా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న షేర్లలో మదుపు చేయడానికి ఇదే మంచి తరుణమని సూచించారు. ఎగుమతులపై భారత్ అధికంగా చైనాపై అధారపడి ఉందని, అందుకని కోవిడ్–19 వైరస్ ప్రభావం భారత్‌పై కూడా ఉంటుందని విదేశీ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని డాల్టన్ క్యాపిటల్ ఎనలిస్ట్ యూ.ఆర్. భట్ చెప్పారు. మరో రూ.5.5 లక్షల కోట్లు హుష్ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.5.45 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5.45,453 కోట్లు క్షీణించి రూ.1.46,94,572 కోట్లకు పడిపోయింది. గత ఆరు రోజుల్లో మొత్తం రూ.11,76,986 కోట్ల సంపద హరించుకుపోయింది. భారీగా తగ్గిన పసిడి ధర అంతర్జాతీయంగా ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర శుక్రవారం భారీగా దిగివచ్చింది. కేవలం రెండు రోజుల క్రితం 1,686.6 డాలర్లకు చేరి ఏడేళ్ల గరిష్టాన్ని చూసిన పసిడి, ఈ వార్త రాసే 10.30 గంటల సమయానికి 50 డాలర్ల నష్టంతో (గురువారం ముగింపుతో పోల్చి)1,594 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో 1,575 డాలర్లకు పడిపోవడం గమనార్హం. ఇక క్రూడ్ విషయానికి వస్తే, ఒక దశలో 6 శాతం పైగా పడిపోయి 43.86 డాలర్లను చూసిన నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర కొంచెం బలపడి 45 డాలర్ల స్థాయికి చేరడం గమనార్హం. అయితే ఇది కోవిడ్ వైరస్ భయాలు త్వరలో ఉపశమిస్తున్నాయనడానికి సంకేతమా? అన్నది కొన్ని వర్గాల విశ్లేషణ. కోవిడ్–19 వైరస్ కొత్త దేశాలకు విస్తరిస్తుండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయి. అంతర్జాతీయంగా ఎక్స్పోజర్ ఉన్న లోహ, ఐటీ షేర్లు అధికంగా పతనమయ్యాయి. ఈ వైరస్ ఆర్థికంగా ఏ మేరకు ప్రభావం చూపగలదో అనే విషయమై స్పష్టత లేనప్పటికీ, వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి ప్రభావం తీవ్రంగానే ఉండగలదు. –వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ -
స్వల్ప నష్టాలతో ముగింపు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఒకవైపు చైనా–అమెరికా మధ్య చర్చలు తిరిగి ప్రారంభం అవుతాయన్న ఆశాభావం ఉన్నప్పటికీ.. మరోవైపు అమెరికాలో రాజకీయ అనిశ్చితి ప్రభావం శుక్రవారం నష్టాలకు దారితీసింది. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాటలోనే ప్రయాణించాయి. సెన్సెక్స్ 167 పాయింట్లు నష్టపోయి (0.43 శాతం) 38,822 వద్ద క్లోజయింది. నిఫ్టీ 58.80 పాయింట్లు క్షీణించి (0.51శాతం) 11,512 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 325 పాయింట్ల శ్రేణిలో ట్రేడ్ అయింది. వేదాంత, ఇండస్ఇండ్ బ్యాంకు, యస్ బ్యాంకు, టాటా స్టీల్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, టీసీఎస్, హీరో మోటోకార్ప్ సూచీల నష్టాలకు కారణమయ్యాయి. బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, ఆర్ఐఎల్, కోటక్ బ్యాంకు, ఎన్టీపీసీ అత్యధికంగా లాభపడ్డాయి. అయితే, సూచీలు ఈ వారం మొత్తం మీద లాభపడడం గమనార్హం. సెన్సెక్స్ 808 పాయింట్లు, నిఫ్టీ 238 పాయింట్ల వరకు అంటే సుమారు 2 శాతం మేర ఈ వారం పెరిగాయి. ట్రంప్ అభిశంసనకు సంబంధించిన ఆందోళనల ప్రభావం మార్కెట్లపై చూపించినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు. సెన్సెక్స్ ఈ వారంలో 2 శాతం లాభపడింది. -
బేర 'విశ్య'రూపం!
• ప్రపంచ మార్కెట్లకు ‘బ్లాక్ మండే’... • దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల సునామీ.. • సెన్సెక్స్ నష్టం 1,625 పాయింట్లు • ఇంట్రాడేలో 1,741 పాయింట్లు డౌన్... 25,742 వద్ద ముగింపు • నిఫ్టీ 491 పాయింట్లు క్రాష్; 7,809 వద్ద క్లోజ్ • భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద పతనం ఇది... వృద్ధి ఆగినందుకే ఈ పతనం! చైనా డౌన్ట్రెండ్తో అన్ని దేశాలూ కుదేలు ♦ దశాబ్దాల కనిష్ట స్థాయి 7 శాతానికి చైనా వృద్ధిరేటు ♦ ఫలితంగా లోహాలు, ఇతర వస్తువుల దిగుమతి కుదింపు ♦ వాటి ఎగుమతిపైనే ఆధారపడిన దేశాల అయోమయం ♦ ఈ సంక్షోభం అన్నిదేశాలకూ వ్యాపిస్తుందని భయాలు ♦ ఫెడ్ వడ్డీరేట్లను పెంచే ఛాన్స్ లేదనే అంచనాతో అమెరికా షేర్లూ డౌన్ సాక్షి, బిజినెస్ విభాగం అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు అనుకున్న స్థాయిలో పురోగతి సాధించటం లేదన్న గణాంకాలతో కొన్నాళ్లుగా స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనటం నిజమే. కరెక్షన్ రావచ్చన్న అంచనాలూ వాస్తవమే. కానీ ఈ స్థాయి పతనాన్ని ఎవ్వరూ ఊహించలేదు. విచిత్రమేంటంటే అమెరికా ప్రభుత్వం బాండ్ల చెల్లింపులో డిఫాల్ట్ అవుతుందనే భయాలు ఏర్పడినపుడు గానీ... ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీని నిలుపుచేసినపుడు గానీ... అంతెందుకు! గ్రీసు దివాలా తీస్తుందన్న ఆందోళనలు వ్యాపించినపుడు కూడా స్టాక్‌మార్కెట్లు ఈ స్థాయిలో పతనమవలేదు. మరిప్పుడు ఇలా పడిపోయాయంటే సమాధానం ఒక్కటే. పై భయాలన్నిటినీ మించిన వాస్తవాన్ని ఇన్వెస్టర్లు ఇటీవల గమనించారు. అదేమిటంటే... ఏ ఫైనాన్షియల్ మార్కెట్‌కైనా ఊతం వృద్ధే. ఎన్ని ఆందోళనలున్నా, భవిష్యత్తులో వృద్ధి జరుగుతుందంటే పెట్టుబడులు తరలివస్తాయి. అదే లేదనిపిస్తే...! ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్ముతారు. ఇప్పుడు జరుగుతున్నదదే. చైనాతో మొదలయ్యింది... ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా వృద్ధి రేటు 7 శాతానికి పడిపోయింది. మిగతా ప్రపంచానికి ఈ వృద్ధి రేటు తక్కువేమీ కాకపోవచ్చు. కానీ ప్రపంచానికే తయారీ హబ్‌గా ఉన్న చైనాకు ఇది దశాబ్దాల కనిష్ఠ స్థాయి. వివిధ ఉత్పత్తుల తయారీ కోసం లోహాల్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం ఇదే. చైనా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోవడంతో దాని వృద్ధి డేంజర్లో పడింది. తయారీ కోసం అది కూడా లోహాల్ని దిగుమతి చేసుకోవటం తగ్గించటం, లేదా నిలిపేయటం చేస్తుంది కనక ప్రపంచ దేశాల్లోనూ వస్తూత్పత్తులకు డిమాండ్ పడిపోయినట్లే లెక్క. స్థూలంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థికాభివృద్ధే ప్రమాదంలో పడినట్లు లెక్క. అందుకే లోహాలు, ముడి చమురు 8-15 ఏళ్ల కనిష్ట స్థాయికి కుప్పకూలాయి. వీటి ఎగుమతులపైనే మనుగడ సాగించే బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తదితర దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నాయి. ఇలా వృద్ధి లోపించిన వ్యవస్థలో షేర్ల పతనం కొన్నాళ్ల క్రితమే జరగాల్సి ఉంది. కానీ అమెరికా, యూరప్, జపాన్, చైనా కేంద్ర బ్యాంకులు మార్కెట్లోకి పంపిస్తున్న డబ్బుతో అవి చాలాకాలం నిలదొక్కుకున్నాయి. ఈ డబ్బు దన్నుతో ఆయా దేశాల వృద్ధిని, కార్పొరేట్ల లాభాల్లో వృద్ధిని షేర్లు, కమోడిటీ ధరలు మించిపోయాయి. ఇప్పుడవి వాస్తవ విలువలకు దిగిరావడమే ఈ పతనం. అడకత్తెరలో అమెరికా... 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ఎనిమిదేళ్లుగా ఆ దేశం జీరో వడ్డీ రేటు విధానాన్ని కొనసాగిస్తూ..మరోవంక ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ముద్రించి బ్యాంకింగ్ వ్యవస్థలోకి, తద్వారా మార్కెట్లలోకి కుమ్మరిస్తున్న ఫెడరల్ రిజర్వ్‌కి తాజా సంక్షోభం పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎన్ని నిధులు కుమ్మరించినా, అమెరికా ఆర్థిక వృద్ధి అంతంతమాత్రమే. జాబ్ మార్కెట్ కాస్త కుదుటపడింది. దాంతో ఈ సెప్టెంబర్‌లో 8 ఏళ్ల తర్వాత తొలిసారిగా వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ఫెడ్ సంకేతాలిచ్చింది. కానీ కమోడిటీ ధరలు కుప్పకూలడంతో ద్రవ్యోల్బణం ఆశించినంత పెరగక, రేట్ల పెంపునకు వెనుకాడుతున్నట్లు ఇటీవలి ఫెడ్ కమిటీ మీటింగ్ మినిట్స్‌లో వెల్లడయింది. ఈ లోపు చైనా పేరిట ఫైనాన్షియల్ మార్కెట్లను సంక్షోభం చుట్టుముట్టేయడంతో ఫెడ్ రేట్ల పెంపు వాయిదా పడినట్లేననే అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచితే, ప్రమాదం ఏర్పడినపుడు తగ్గించే వీలుంటుంది. ఈ వెసులుబాటును తాజా సంక్షోభంతో ఫెడ్ కోల్పోయిందన్న భయాలు అక్కడి మార్కెట్లను పడదోస్తున్నాయి. కార్పొరేట్ల వృద్ధి అంతంతే... అమెరికాలో గానీ, భారత్‌లో గానీ (ఈ రెండు మార్కెట్లే గతవారం వరకూ గరిష్ట స్థాయిలో స్థిరంగా ట్రేడయ్యాయి) కార్పొరేట్ల లాభాల వృద్ధి అంతంత మాత్రమే. అమెరికా కార్పొరేట్ లాభాల్లో వృద్ధి 2 శాతం లోపే ఉంది. మన దేశంలో కార్పొరేట్ల సగటు లాభాల వృద్ధి గత మూడేళ్ల నుంచి జీరో. కానీ ఈ రెండుచోట్లా ప్రధాన కంపెనీల షేర్ల ధరలు వాటి వార్షిక లాభాలతో పోలిస్తే 21 రెట్లు (పీఈ) వద్ద ట్రేడవుతున్నాయి. అంటే వచ్చే కొద్ది సంవత్సరాల్లో 21 శాతం చొప్పున వీటి లాభాలు వృద్ధి చెందుతాయన్న అంచనాలు వీటి ధరల్లో కలిసిపోయాయి. కానీ ఎన్ని త్రైమాసికాలు చూసినా కంపెనీలు ఆ స్థాయి లాభాల్ని చూపించలేకపోతున్నాయి. ఇక ఇప్పుడు ప్రపంచ ఆర్థికాభివృద్ధికే ప్రమాదం ఏర్పడినపుడు కార్పొరేట్ లాభాల్లో వృద్ధి అంచనాలు కూడా ఇన్వెస్టర్లలో సహజంగానే నశిస్తాయి. వారి అసహనానికి ప్రతిరూపమే ప్రస్తుత పతనం. కరెన్సీ వార్... కరెన్సీ విలువల్ని తగ్గించుకోవడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో తమ ఉత్పత్తులను చౌకగా అమ్ముకోవాలన్న పోటీ ఇటీవల తీవ్రమయ్యింది. కొన్నేళ్లుగా యూరో, యెన్ విలువల్ని తగ్గించుకోవడం ద్వారా జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వాటి ఆటోమొబైల్స్‌ను చైనా సహా ఇతర దేశాల్లో పోటాపోటీగా విక్రయించుకుంటున్నాయి. ఇప్పుడు చైనా తన యువాన్ విలువను తగ్గించడంతో ఆసియా దేశాల మధ్య కరెన్సీ యుద్ధం తీవ్రమయింది. దాంతో డాలర్ల రూపేణా పెట్టే పెట్టుబడుల విలువ క్షీణించడంతో ఆందోళనకు గురవుతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు శ్రీకారం చుట్టారు. క్రూడ్ క్షీణత కూడా... ఆర్థికాభివృద్ధికి తొలి సంకేతం ఇంధన డిమాండ్ పెరగడమే. దీని డిమాండ్ క్షీణిస్తే వృద్ధి ఆగినట్టే. అమెరికాలో ఉత్పత్తి పెరగడం క్రూడ్ ధర పతనానికి ఒక కారణమైనా... యూరప్, ఆసియా దేశాల్లో డిమాండ్ కొరవడటంతో ముడి చమురు ధర ఏడాదిలో 65 శాతం వరకూ పడిపోయింది. దీంతో చమురును ఉత్పత్తి చేసే కంపెనీలు అతలాకుతలమైపోతున్నాయి. మన దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, కెయిర్న్లతో సహా అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్ సూచీల్లోని ప్రధాన భాగమైన చమురు ఉత్పాదక షేర్ల పతనం సైతం మార్కెట్ తీవ్ర క్షీణతకు దారితీస్తోంది. మళ్లీ పాతాళానికి రూపాయి ముంబై: మార్కెట్ల పతనానికి తగ్గట్లే రూపాయి సైతం జారుడు బల్లపై జారిపోయింది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ మారకం విలువ కీలకమైన 66 స్థాయి కన్నా కిందికి పడిపోయింది. సోమవారం 82 పైసలు (దాదాపు 1.25%) క్షీణించి 66.65 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే రూపాయి మారకం విలువ ఇంతగా పడిపోవడం.. ఈ ఏడాది ఇదే తొలిసారి. అలాగే ఇది రెండేళ్ల కనిష్టం కూడా. చైనా తమ కరెన్సీ యువాన్‌ను డీవేల్యూ చేసిన నేపథ్యంలో గత 2 వారాల్లో రూపాయి విలువ ఏకంగా 202 పైసలు(3.17%) పడిపోయింది. 2013 ఆగస్టులో రూపాయి 68.80 చరిత్రాక కనిష్టానికి క్షీణించింది. నిపుణుల మాట.. చైనా ప్రభావం ఎంతో తెలియాల్సి ఉంది చైనా కరెన్సీ విలువను తగ్గించడంతో ప్రారంభమైన పతనం అమెరికా ఫెడరల్ బ్యాంక్ మినిట్స్ వెలువడడంతో వేగం పుంజుకుంది. అంతర్జాతీయ వృద్ధిరేటుపై అమెరికా ఫెడ్ భయాలను వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన మార్కెట్లు విలువ పరంగా అధిక స్థాయిలో ఉండటం ఈ భారీ పతనానికి ఒక కారణంగా చెప్పొచ్చు. చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు నెగిటివ్‌గా స్పందిస్తున్నాయి. కానీ ఇది మన ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతుంది అనేది వేచి చూడాలి. స్టాక్ మార్కెట్లో నెలకొన్న ఈ బలహీనత మరింత కొనసాగే అవకాశం ఉంది. ఈ స్థాయి నుంచి మరో 10 శాతం పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా భారీ పతనాల సమయాల్లో వచ్చే రిలీఫ్ ర్యాలీలను నగదు నిల్వలను పెంచుకోవడానికి ఉపయోగించండి. మార్కెట్లు ఒడిదుడుకులు తగ్గిన తర్వాత ఈ మొత్తాన్ని కొనుగోళ్ళకు ఉపయోగించండి. - సతీష్ కంతేటి, జేఎండీ, జెన్‌మనీ ఆందోళన వద్దు... అంతర్జాతీయంగా అన్ని సంఘటనలు ఒకేసారి వచ్చేసరికి మార్కెట్లు భారీగా పతనం చెందాయి. చైనా కరెన్సీ విలువ తగ్గించడంతో మన రూపాయి విలువ క్షీణించడం, ఇదే సమయంలో అమెరికా ఫెడ్ భయాలు, కొరియా దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొనడం వంటి సంఘటనలు తీవ్ర ఒడిదుడుకులకు కారణం. కానీ 2007తో పోలిస్తే దేశీయ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్‌గా ఇతర దేశాల కంటే చాలా పటిష్టంగా ఉంది. ఈ పతనం ఎంత వరకు కొనసాగుతుందో చెప్పలేము కానీ.. దీర్ఘకాలిక ఇండియన్ స్టోరీ ఇంకా పటిష్టంగానే ఉంది. ఈ పతనం గురించి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు రుణాలు అధికంగా ఉన్న కంపెనీలు, ప్రమోటర్ల వాటా అధికంగా ఉన్న కంపెనీలకు దూరంగా ఉండమని సూచిస్తాను. - జగన్నాధం తూనుగుంట్ల, ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్, కార్వీ స్టాక్ బ్రోకింగ్ అవకాశాన్ని వినియోగించుకోండి అంతర్జాతీయ మార్కెట్ల పతనానికి అనుగుణంగా మన మార్కెట్లు స్పందిస్తున్నాయి. చైనా మార్కెట్ల వల్ల వస్తున్న ఈ పతనం మధ్య, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు చాలా ఇన్వెస్టర్లకు చాలా చక్కటి అవకాశాలన్ని కల్పిస్తున్నాయి. ఇప్పుడు మేము కూడా ఇదే చేస్తున్నాం. ఈ పతనంలో వచ్చే చక్కటి ఇన్వెస్ట్మెంట్ అవకాశాల కోసం పోర్ట్‌ఫోలియోల్లో తగినంత నగదు నిల్వలతో సిద్ధంగా ఉన్నాం. - హర్ష ఉపాధ్యాయ, సీఐవో (ఈక్విటీ), కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ స్థిరపడిన తర్వాత కొనండి.. కరెన్సీ వార్, చైనా ఆర్థిక వృద్థిరేటు తగ్గుతోందన్న భయాలతో మార్కెట్లు పతనమవుతున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్న ప్రతికూల వార్తలు, ఎఫ్‌అండ్‌వో ముగింపు వారం కావడంతో ఈ ఒడిదుడుకులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ మన ఆర్థిక మూలాలు పటిష్టమే. అమెరికా ఆర్థిక వృద్ధిరేటు కూడా బాగుంది కాబట్టి ఈ ఒడిదుడుకులు తగ్గిన తర్వాత దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు చక్కటి అవకాశాలు లభిస్తాయి. ఐటీ, ఫార్మా రంగాలతో పాటు ఆటో, ఇన్ఫ్రా, ప్రైవేటు బ్యాంకుల్లో కొన్ని మంచి స్టాక్స్‌ను కొనుగోలు చేయొచ్చని సూచిస్తున్నా. - దినేష్ టక్కర్, సీఎండీ, ఏంజెల్ బ్రోకింగ్ -
ఏడు రోజుల లాభాలకు బ్రేక్
- బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ - సెన్సెక్స్ నష్టం 231 పాయింట్లు - 62 పాయింట్ల నష్టంతో 8,834కు నిఫ్టీ - మార్కెట్ అప్డేట్ బ్లూచిప్ షేర్లలో అమ్మకాలతో ఏడు రోజుల స్టాక్ మార్కెట్ల లాభాలకు శుక్రవారం కళ్లెం పడింది. దీనికి తోడు వచ్చే వారం రానున్న బడ్జెట్ కారణంగా ట్రేడర్ల ముందు జాగ్రత్త కూడా ప్రభావం చూపింది. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ, కొన్ని ఆయిల్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఆర్ఐఎల్ 3 శాతం డౌన్ సెన్సెక్స్ గురువారం నాటి ముగింపుతో పోల్చితే శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైంది. 29,446 పాయింట్ల వద్ద ఆరంభమైన సెన్సెక్స్ 29,462, 29,178 పాయింట్ల గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. చివరకు 231 పాయింట్లు నష్టపోయి 29,231 పాయంట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 8,834 పాయింట్ల వద్ద ముగిసింది. చమురు శాఖలో కీలక పత్రాలను చోరీ చేశారంటూ ఢిల్లీ పోలీసులు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగిని అదపులోకి తీసుకున్న కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3 శాతం పతనమైంది. హెచ్‌డీఐఎల్ జోరు.... హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్‌డీఐఎల్) షేర్ ధర శుక్రవారం 7% పెరిగి 123 వద్ద ముగిసింది. 2013 జనవరి తర్వాత ఇదే అధిక స్థాయి. ఒక నెల కాలంలో ఈ షేర్ 58% పెరిగింది. ఈ కాలానికి సెన్సెక్స్ 1.3 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. విదేశీ ఇన్వెస్టర్లు బాగా ఆసక్తి చూపడం, క్యూ3లో కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా ఉండడం హెచ్‌డీఐఎల్ జోరుకు కారణాలని నిపుణులంటున్నారు. స్పైస్‌జెట్ జూమ్.. స్పైస్‌జెట్‌లో కళానిధి మారన్ వాటాను మాజీ ప్రమోటర్ అజయ్ సింగ్ కొనుగోలు చేయడాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదించడంతో స్పైస్‌జెట్ షేర్ 20 శాతం వృద్ధి చెంది రూ.23.9 వద్ద ముగిసింది.