బేర 'విశ్య'రూపం! | Sensex crashes 1624 points | Sakshi
Sakshi News home page

బేర 'విశ్య'రూపం!

Published Tue, Aug 25 2015 2:14 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

బేర 'విశ్య'రూపం! - Sakshi

బేర 'విశ్య'రూపం!

ప్రపంచ మార్కెట్లకు ‘బ్లాక్ మండే’...
దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల సునామీ..
సెన్సెక్స్ నష్టం 1,625 పాయింట్లు
ఇంట్రాడేలో 1,741 పాయింట్లు డౌన్... 25,742 వద్ద ముగింపు
నిఫ్టీ 491 పాయింట్లు క్రాష్; 7,809 వద్ద క్లోజ్
భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద పతనం ఇది...
 
వృద్ధి ఆగినందుకే ఈ పతనం!
 
చైనా డౌన్‌ట్రెండ్‌తో అన్ని దేశాలూ కుదేలు
దశాబ్దాల కనిష్ట స్థాయి 7 శాతానికి చైనా వృద్ధిరేటు
ఫలితంగా లోహాలు, ఇతర వస్తువుల దిగుమతి కుదింపు
వాటి ఎగుమతిపైనే ఆధారపడిన దేశాల అయోమయం
ఈ సంక్షోభం అన్నిదేశాలకూ వ్యాపిస్తుందని భయాలు
ఫెడ్ వడ్డీరేట్లను పెంచే ఛాన్స్ లేదనే అంచనాతో అమెరికా షేర్లూ డౌన్
సాక్షి, బిజినెస్ విభాగం

అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు అనుకున్న స్థాయిలో పురోగతి సాధించటం లేదన్న గణాంకాలతో కొన్నాళ్లుగా స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనటం నిజమే. కరెక్షన్ రావచ్చన్న అంచనాలూ వాస్తవమే. కానీ ఈ స్థాయి పతనాన్ని ఎవ్వరూ ఊహించలేదు. విచిత్రమేంటంటే అమెరికా ప్రభుత్వం బాండ్ల చెల్లింపులో డిఫాల్ట్ అవుతుందనే భయాలు ఏర్పడినపుడు గానీ... ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీని నిలుపుచేసినపుడు గానీ... అంతెందుకు! గ్రీసు దివాలా తీస్తుందన్న ఆందోళనలు వ్యాపించినపుడు కూడా స్టాక్‌మార్కెట్లు ఈ స్థాయిలో పతనమవలేదు. మరిప్పుడు ఇలా పడిపోయాయంటే సమాధానం ఒక్కటే. పై భయాలన్నిటినీ మించిన వాస్తవాన్ని ఇన్వెస్టర్లు ఇటీవల గమనించారు. అదేమిటంటే... ఏ ఫైనాన్షియల్ మార్కెట్‌కైనా ఊతం వృద్ధే. ఎన్ని ఆందోళనలున్నా, భవిష్యత్తులో వృద్ధి జరుగుతుందంటే పెట్టుబడులు తరలివస్తాయి. అదే లేదనిపిస్తే...! ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్ముతారు. ఇప్పుడు జరుగుతున్నదదే.
 
చైనాతో మొదలయ్యింది...
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా వృద్ధి రేటు 7 శాతానికి పడిపోయింది. మిగతా ప్రపంచానికి ఈ వృద్ధి రేటు తక్కువేమీ కాకపోవచ్చు. కానీ ప్రపంచానికే తయారీ హబ్‌గా ఉన్న చైనాకు ఇది దశాబ్దాల కనిష్ఠ స్థాయి. వివిధ ఉత్పత్తుల తయారీ కోసం లోహాల్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం ఇదే. చైనా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోవడంతో దాని వృద్ధి డేంజర్‌లో పడింది. తయారీ కోసం అది కూడా లోహాల్ని దిగుమతి చేసుకోవటం తగ్గించటం, లేదా నిలిపేయటం చేస్తుంది కనక ప్రపంచ దేశాల్లోనూ వస్తూత్పత్తులకు డిమాండ్ పడిపోయినట్లే లెక్క. స్థూలంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థికాభివృద్ధే ప్రమాదంలో పడినట్లు లెక్క.

అందుకే లోహాలు, ముడి చమురు 8-15 ఏళ్ల కనిష్ట స్థాయికి కుప్పకూలాయి. వీటి ఎగుమతులపైనే మనుగడ సాగించే బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తదితర దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నాయి. ఇలా వృద్ధి లోపించిన వ్యవస్థలో షేర్ల పతనం కొన్నాళ్ల క్రితమే జరగాల్సి ఉంది. కానీ అమెరికా, యూరప్, జపాన్, చైనా కేంద్ర బ్యాంకులు మార్కెట్లోకి పంపిస్తున్న డబ్బుతో అవి చాలాకాలం నిలదొక్కుకున్నాయి. ఈ డబ్బు దన్నుతో ఆయా దేశాల వృద్ధిని, కార్పొరేట్ల లాభాల్లో వృద్ధిని షేర్లు, కమోడిటీ ధరలు మించిపోయాయి. ఇప్పుడవి వాస్తవ విలువలకు దిగిరావడమే ఈ పతనం.
 
అడకత్తెరలో అమెరికా...
2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ఎనిమిదేళ్లుగా ఆ దేశం జీరో వడ్డీ రేటు విధానాన్ని కొనసాగిస్తూ..మరోవంక ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ముద్రించి బ్యాంకింగ్ వ్యవస్థలోకి, తద్వారా మార్కెట్లలోకి కుమ్మరిస్తున్న ఫెడరల్ రిజర్వ్‌కి తాజా సంక్షోభం పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎన్ని నిధులు కుమ్మరించినా, అమెరికా ఆర్థిక వృద్ధి అంతంతమాత్రమే. జాబ్ మార్కెట్ కాస్త కుదుటపడింది. దాంతో ఈ సెప్టెంబర్లో 8 ఏళ్ల తర్వాత తొలిసారిగా వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ఫెడ్ సంకేతాలిచ్చింది.

కానీ కమోడిటీ ధరలు కుప్పకూలడంతో ద్రవ్యోల్బణం ఆశించినంత పెరగక, రేట్ల పెంపునకు వెనుకాడుతున్నట్లు ఇటీవలి ఫెడ్ కమిటీ మీటింగ్ మినిట్స్‌లో వెల్లడయింది. ఈ లోపు చైనా పేరిట ఫైనాన్షియల్ మార్కెట్లను సంక్షోభం చుట్టుముట్టేయడంతో ఫెడ్ రేట్ల పెంపు వాయిదా పడినట్లేననే అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచితే, ప్రమాదం ఏర్పడినపుడు తగ్గించే వీలుంటుంది. ఈ వెసులుబాటును తాజా సంక్షోభంతో ఫెడ్ కోల్పోయిందన్న భయాలు అక్కడి మార్కెట్లను పడదోస్తున్నాయి.  
 
కార్పొరేట్ల వృద్ధి అంతంతే...
అమెరికాలో గానీ, భారత్‌లో గానీ (ఈ రెండు మార్కెట్లే గతవారం వరకూ గరిష్ట స్థాయిలో స్థిరంగా ట్రేడయ్యాయి) కార్పొరేట్ల లాభాల వృద్ధి అంతంత మాత్రమే. అమెరికా కార్పొరేట్ లాభాల్లో వృద్ధి 2 శాతం లోపే ఉంది. మన దేశంలో కార్పొరేట్ల సగటు లాభాల వృద్ధి గత మూడేళ్ల నుంచి జీరో. కానీ ఈ రెండుచోట్లా ప్రధాన కంపెనీల షేర్ల ధరలు వాటి వార్షిక లాభాలతో పోలిస్తే 21 రెట్లు (పీఈ) వద్ద ట్రేడవుతున్నాయి. అంటే వచ్చే కొద్ది సంవత్సరాల్లో 21 శాతం చొప్పున వీటి లాభాలు వృద్ధి చెందుతాయన్న అంచనాలు వీటి ధరల్లో కలిసిపోయాయి.

కానీ ఎన్ని త్రైమాసికాలు చూసినా కంపెనీలు ఆ స్థాయి లాభాల్ని చూపించలేకపోతున్నాయి. ఇక ఇప్పుడు ప్రపంచ ఆర్థికాభివృద్ధికే ప్రమాదం ఏర్పడినపుడు కార్పొరేట్ లాభాల్లో వృద్ధి అంచనాలు కూడా ఇన్వెస్టర్లలో సహజంగానే నశిస్తాయి. వారి అసహనానికి ప్రతిరూపమే ప్రస్తుత పతనం.
 
కరెన్సీ వార్...
కరెన్సీ విలువల్ని తగ్గించుకోవడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో తమ ఉత్పత్తులను చౌకగా అమ్ముకోవాలన్న పోటీ ఇటీవల తీవ్రమయ్యింది. కొన్నేళ్లుగా యూరో, యెన్ విలువల్ని తగ్గించుకోవడం ద్వారా జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వాటి ఆటోమొబైల్స్‌ను చైనా సహా ఇతర దేశాల్లో పోటాపోటీగా విక్రయించుకుంటున్నాయి. ఇప్పుడు చైనా తన యువాన్ విలువను తగ్గించడంతో ఆసియా దేశాల మధ్య కరెన్సీ యుద్ధం తీవ్రమయింది. దాంతో డాలర్ల రూపేణా పెట్టే పెట్టుబడుల విలువ క్షీణించడంతో ఆందోళనకు గురవుతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు శ్రీకారం చుట్టారు.
 
క్రూడ్ క్షీణత కూడా...

ఆర్థికాభివృద్ధికి తొలి సంకేతం ఇంధన డిమాండ్ పెరగడమే. దీని డిమాండ్ క్షీణిస్తే వృద్ధి ఆగినట్టే. అమెరికాలో ఉత్పత్తి పెరగడం క్రూడ్ ధర పతనానికి ఒక కారణమైనా... యూరప్, ఆసియా దేశాల్లో డిమాండ్ కొరవడటంతో ముడి చమురు ధర ఏడాదిలో 65 శాతం వరకూ పడిపోయింది. దీంతో చమురును ఉత్పత్తి చేసే కంపెనీలు అతలాకుతలమైపోతున్నాయి. మన దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, కెయిర్న్‌లతో సహా అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్ సూచీల్లోని ప్రధాన భాగమైన చమురు ఉత్పాదక షేర్ల పతనం సైతం మార్కెట్ తీవ్ర క్షీణతకు దారితీస్తోంది.
 
మళ్లీ పాతాళానికి రూపాయి

ముంబై: మార్కెట్ల పతనానికి తగ్గట్లే రూపాయి సైతం జారుడు బల్లపై జారిపోయింది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ మారకం విలువ కీలకమైన 66 స్థాయి కన్నా కిందికి పడిపోయింది. సోమవారం 82 పైసలు (దాదాపు 1.25%) క్షీణించి 66.65 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే రూపాయి మారకం విలువ ఇంతగా పడిపోవడం.. ఈ ఏడాది ఇదే తొలిసారి. అలాగే ఇది రెండేళ్ల కనిష్టం కూడా. చైనా తమ కరెన్సీ యువాన్‌ను డీవేల్యూ చేసిన నేపథ్యంలో గత 2 వారాల్లో రూపాయి విలువ ఏకంగా 202 పైసలు(3.17%) పడిపోయింది. 2013 ఆగస్టులో రూపాయి 68.80 చరిత్రాక కనిష్టానికి క్షీణించింది.
 
నిపుణుల మాట..
చైనా ప్రభావం ఎంతో తెలియాల్సి ఉంది
చైనా కరెన్సీ విలువను తగ్గించడంతో ప్రారంభమైన పతనం అమెరికా ఫెడరల్ బ్యాంక్ మినిట్స్ వెలువడడంతో వేగం పుంజుకుంది. అంతర్జాతీయ వృద్ధిరేటుపై అమెరికా ఫెడ్ భయాలను వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన మార్కెట్లు విలువ పరంగా అధిక స్థాయిలో ఉండటం ఈ భారీ పతనానికి ఒక కారణంగా చెప్పొచ్చు. చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు నెగిటివ్‌గా స్పందిస్తున్నాయి.

కానీ ఇది మన ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతుంది అనేది వేచి చూడాలి. స్టాక్ మార్కెట్లో నెలకొన్న ఈ బలహీనత మరింత కొనసాగే అవకాశం ఉంది. ఈ స్థాయి నుంచి మరో 10 శాతం పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా భారీ పతనాల సమయాల్లో వచ్చే రిలీఫ్ ర్యాలీలను నగదు నిల్వలను పెంచుకోవడానికి ఉపయోగించండి. మార్కెట్లు ఒడిదుడుకులు తగ్గిన తర్వాత ఈ మొత్తాన్ని కొనుగోళ్ళకు ఉపయోగించండి.
- సతీష్ కంతేటి, జేఎండీ, జెన్‌మనీ
 
ఆందోళన వద్దు...
అంతర్జాతీయంగా అన్ని సంఘటనలు ఒకేసారి వచ్చేసరికి మార్కెట్లు భారీగా పతనం చెందాయి. చైనా కరెన్సీ విలువ తగ్గించడంతో మన రూపాయి విలువ క్షీణించడం, ఇదే సమయంలో అమెరికా ఫెడ్ భయాలు, కొరియా దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొనడం వంటి సంఘటనలు తీవ్ర ఒడిదుడుకులకు కారణం. కానీ 2007తో పోలిస్తే దేశీయ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్‌గా ఇతర దేశాల కంటే చాలా పటిష్టంగా ఉంది. ఈ పతనం ఎంత వరకు కొనసాగుతుందో చెప్పలేము కానీ.. దీర్ఘకాలిక ఇండియన్ స్టోరీ ఇంకా పటిష్టంగానే ఉంది. ఈ పతనం గురించి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు రుణాలు అధికంగా ఉన్న కంపెనీలు, ప్రమోటర్ల వాటా అధికంగా ఉన్న కంపెనీలకు దూరంగా ఉండమని సూచిస్తాను.
- జగన్నాధం తూనుగుంట్ల, ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్, కార్వీ స్టాక్ బ్రోకింగ్    
 
అవకాశాన్ని వినియోగించుకోండి
అంతర్జాతీయ మార్కెట్ల పతనానికి అనుగుణంగా మన మార్కెట్లు స్పందిస్తున్నాయి. చైనా మార్కెట్ల వల్ల వస్తున్న ఈ పతనం మధ్య, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు చాలా ఇన్వెస్టర్లకు చాలా చక్కటి అవకాశాలన్ని కల్పిస్తున్నాయి. ఇప్పుడు మేము కూడా ఇదే చేస్తున్నాం. ఈ పతనంలో వచ్చే చక్కటి ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాల కోసం పోర్ట్‌ఫోలియోల్లో తగినంత నగదు నిల్వలతో సిద్ధంగా ఉన్నాం.
- హర్ష ఉపాధ్యాయ, సీఐవో (ఈక్విటీ), కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్
 
స్థిరపడిన తర్వాత కొనండి..
కరెన్సీ వార్, చైనా ఆర్థిక వృద్థిరేటు తగ్గుతోందన్న భయాలతో మార్కెట్లు పతనమవుతున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్న ప్రతికూల వార్తలు, ఎఫ్‌అండ్‌వో ముగింపు వారం కావడంతో ఈ ఒడిదుడుకులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ మన ఆర్థిక మూలాలు పటిష్టమే. అమెరికా ఆర్థిక వృద్ధిరేటు కూడా బాగుంది కాబట్టి ఈ ఒడిదుడుకులు తగ్గిన తర్వాత దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు చక్కటి అవకాశాలు లభిస్తాయి. ఐటీ, ఫార్మా రంగాలతో పాటు ఆటో, ఇన్‌ఫ్రా, ప్రైవేటు బ్యాంకుల్లో కొన్ని మంచి స్టాక్స్‌ను కొనుగోలు చేయొచ్చని సూచిస్తున్నా.
- దినేష్ టక్కర్, సీఎండీ, ఏంజెల్ బ్రోకింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement