ముంబై: దేశీయ సూచీలు ఈ వారం కార్పొరేట్ క్యూ2 ఫలితాలు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధి మందగమన భయాల నేపథ్యంలో త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ట్రేడర్లు తమ పొజిషన్లను సమతూకం చేసుకోవాలి. పతనాన్ని కొనుగోలుకు అవకాశంగా మలుచుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. అర్థిక మాంద్య భయాలు, మిశ్రమ కార్పొరేట్ ఫలితాలు, బలహీన స్థూల ఆర్థిక గణాంకాలు నేపథ్యంలో గతవారంలో సెన్సెక్స్ 271 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయాయి.
‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొని ఉన్న అనిశ్చితుల ప్రభావంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవచ్చు. అయితే దేశీయ పండుగ సీజన్ డిమాండ్, క్యూ2 ఆర్థిక ఫలితాల ఫలితాల జోష్ అస్థిరతలను పరిమితం చేయోచ్చు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, స్పెషాలిటీ కెమికల్స్, మౌలిక రంగ షేర్లు రాణించే వీలుంది. గడిచిన మూడు వారాలుగా నిఫ్టీ 16,800–17,350 స్థాయిల పరిధిలో ట్రేడవుతోంది. కొనుగోళ్లు కొనసాగితే 17,100 వద్ద తక్షణ నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అటు పిదప 17,700 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు నెలకొంటే నిఫ్టీకి 16,800 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ రిలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
300 కంపెనీలు రెడీ
ముందుగా నేడు మార్కెట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్‌మార్ట్ త్రైమాసిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో సుమారు 300కి పైగా కంపెనీలు తమ క్యూ2తో గణాంకాలను ప్రకటించనున్నాయి. ఏసీసీ, ఏషియన్ పేయింట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, టాటా కన్జూమర్ ప్రాడెక్ట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్, హావెల్స్ ఇండియా, పీవీఆర్, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్ సర్వీసెస్ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది.
మాంద్యం భయాలు
ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు, మాంద్య భయాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో అస్థిరతలు కొనసాగుతున్నాయి. మరోవైపు డాలర్ క్రమంగా పుంజుకుంటోంది. ఈ అక్టోబర్ ప్రథమార్థంలో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ ఒకశాతానికి పైగా బలపడింది. ఫలితంగా దేశీయ కరెన్సీ రూపాయి శుక్రవారం జీవితకాల కనిష్టం(82.350) వద్ద స్థిరపడింది. ఇటీవల భారత మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్లు సైతం ‘‘బేరీష్’’ వైఖరి ప్రదర్శిస్తున్నారు. రేపు అమెరికా సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి, చైనా క్యూ3 జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ పరిణామాల ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ఉండొచ్చు.
ప్రథమార్థంలో రూ.7500 కోట్ల ఉపసంహరణ
దేశీయ ఈక్విటీల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ‘‘బేరీష్’’ వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ అక్టోబర్ ప్రథమార్థంలో(1–14 తేదీ ల మధ్య) రూ.7,500 కోట్లను భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. యూఎస్ ఫెడ్ రిజర్వ్‌తో సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠి న ద్రవ్య విధాన అమలుతో ఆర్థిక మాంద్యం మొ దలవుతుందనే భయాలు ఎఫ్‌పీఐల్లో నెలకొన్నట్లు నిపుణులు తెలిపారు. ఆగస్టులో రూ.51,200 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఈ ఏడాది పది నెలల్లో రూ.1.76 లక్షల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
చదవండి: అమెజాన్ మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లు.. రూ.2,500 లోపు అదిరిపోయే గాడ్జెట్స్!
Comments
Please login to add a commentAdd a comment