ముంబై: స్టాక్ మార్కెట్ దూకుడుకు బుధవారం అడ్డుకట్ట పడింది. ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే చివరకు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 29 పాయింట్ల నష్టంతో 54,526 వద్ద స్థిరపడింది. నిఫ్టీ రెండు పాయింట్లు స్వల్ప లాభంతో 16,282 వద్ద నిలిచింది. మార్కెట్ ప్రథమార్థంలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అయితే మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలను పరిమితం చేసుకోగలిగాయి. ప్రైవేట్ బ్యాంక్స్, ఆర్థిక, ఫార్మా షేర్లలో భారీ పతనాన్ని చవిచూశాయి. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్స్, రియల్టీ షేర్లు రాణించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 592 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 306 పాయింట్లు శ్రేణిలో ట్రేడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.238 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.206 కోట్ల షేర్లను కొన్నారు. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభ, నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి.
చిన్న, మధ్య తరహా షేర్లలో రికవరీ...
అకారణంగా ర్యాలీ చేసే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లపై అదనపు నిఘా చర్యలను తీసుకుంటామని బీఎస్‌ఈ ఎక్సే్చంజీ ఆగస్ట్ 9న ఒక సర్క్యులేషన్ జారీ చేసింది. ఎక్సే్చంజీ తీసుకున్న కొత్త నిర్ణయంతో గత రెండురోజులుగా చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్రంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ఈ నిఘా చర్యలు రూ.1000 కోట్ల మార్కెట్ విలువ (లేదా) షేరు ధర రూ.20లోపు ఉన్న కంపెనీలకే పరిమితమని బీఎస్‌ఈ ఎక్సే్చంజీ బుధవారం వివరణ ఇచ్చింది. ఎక్సే్చంజీ తాజా నిర్ణయంతో స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు చాలా వరకు రికవరీ అయ్యాయి. ఉదయం సెషన్‌లో రెండున్నర శాతం క్షీణించిన బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు చివరికి ఒకశాతం నష్టంతో సరిపెట్టుకున్నాయి.
పతనాన్ని అడ్డుకున్న మెటల్ షేర్లు
మెటల్ షేర్లు రాణించి ర్యాలీ సూచీల భారీ పతనాన్ని అడ్డుకున్నాయి. అమెరికా సెనెట్ ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన మౌలిక సదుపాయాల బిల్లుకు ఆమోదం తెలిపింది. మరోవైపు ఇతర దేశాలకు కమోడిటీలను ఎగుమతి చేసే కంపెనీలకు ఇచ్చే రాయితీలను తగ్గిస్తూ ఈ మధ్యనే చైనా నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలు భారత కమోడిటీ కంపెనీలకు కలిసొస్తాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు మెటల్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. ఇంట్రాడేలో మెటల్ షేర్లు ర్యాలీతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా మూడుశాతానికి పైగా లాభపడింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
► జూన్ త్రైమాసికంలో నష్టాలను ప్రకటించినా జొమాటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 11% ర్యాలీ చేశాయి. చివరికి 9% లాభంతో రూ.136 వద్ద ముగిశాయి.
► మెటల్ షేర్ల ర్యాలీలో వేదాంత 6.5% లాభంతో రూ.324 వద్ద స్థిరపడింది.
► జూన్ క్వార్టర్‌లో మెరుగైన ఫలితాలతో కిమ్స్ హాస్పిటల్స్ షేరు ఎనిమిది శాతం లాభపడి రూ. 1275 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ మైనస్.. నిఫ్టీ ప్లస్!
Published Thu, Aug 12 2021 4:30 AM | Last Updated on Thu, Aug 12 2021 4:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment