ముంబై : స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ప్రీ-బడ్జెట్‌కు ముందు మార్కెట్లు రోజురోజు సరికొత్త మైలురాయిలను తాకుతున్నాయి. నేడు తొలిసారి సెన్సెక్స్ కీలకమైన 36వేల మార్కును, నిఫ్టీ 11వేల మార్కును అధిగమించేశాయి. సరికొత్త మైలురాయిలను చేధించిన మార్కెట్లు, చివరికి కూడా గరిష్ట స్థాయిల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 342 పాయింట్లు పెరిగి 36వేల మార్కు పైన 36,139.98 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు ఎగిసి 11వేల మార్కు పైన 11,084 వద్ద క్లోజయ్యాయి. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, వేదంత, హిందాల్కో నేటి మార్కెట్‌లో టాప్ గెయినర్లుగా ఉండగా.. విప్రో, టాటా మోటార్స్, అంబుజా సిమెంట్స్, ఐషర్ మోటార్స్ ఎక్కువగా నష్టపోయాయి.
కాగ, కేవలం 6 నెలల్లో నిఫ్టీ 11వేల మార్కును బీట్ చేసింది. సెన్సెక్స్ 5 ట్రేడింగ్ సెషన్స్‌లోనే 1000 పాయింట్ జర్నీని పూర్తిచేసి, 36వేల మార్కును అధిగమించింది. నిఫ్టీ తొలిసారి 10వేల మార్కును గతేడాది జూలై 15న తాకగా... అప్పటి నుంచి వన్-వే జర్నీనే నిఫ్టీ కొనసాగిస్తూ వచ్చింది. బ్యాంకులు, మెటల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల మద్దతుతో నిఫ్టీ దూసుకుపోతోంది. అటు నుంచి విదేశీ పెట్టుబడిదారులు కూడా స్టాక్ మార్కెట్లు పెట్టుబడుల వెల్లువ కొనసాగిస్తున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసల లాభంలో 63.82గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 37 రూపాయల లాభంలో 29,871 రూపాయలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment