ఇన్ఫోసిస్ ర్యాలీతో వరుసగా నాలుగో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
సాక్షి, ముంబై : ఇన్ఫోసిస్ ర్యాలీతో వరుసగా నాలుగో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 9900 మార్కుకు పైకి ఎగిసి, 55.75 పాయింట్ల లాభంలో 9912 వద్ద ముగిసింది. సైన్సెక్స్ సైతం 154.76 పాయింట్ల లాభంలో 31,750 వద్ద క్లోజైంది. బోర్డు వార్‌తో సతమతమైన ఇన్ఫోసిస్‌ను చక్కబెట్టడానికి కంపెనీ కొత్త చైర్మన్‌గా నందన్ నిలేకని పునరాగమనం చేయడంతో, ఇన్ఫీ షేర్లు భారీగా జోరందుకున్నాయి. దీంతో ఇన్ఫీ షేర్లు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. విశాల్ సిక్కా రాజీనామాతో భారీగా కుదేలైన ఇన్పీ షేర్లకు, నందన్ నిలేకని నియామకం భరోసా ఇచ్చింది.
ఇన్ఫీతో పాటు ఐటీ స్టాక్స్ లాభపడటంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.3 శాతానికిపైగా లాభపడింది. ఇన్ఫీసిస్‌తో పాటు, ఎన్‌టీపీసీ, ఐఓఎస్‌లు ఎక్కువగా లాభాలు పండించాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్ కంపెనీల షేర్లు రెండు సూచీల్లోనూ నష్టాలు పాలయ్యాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసలు బలపడి 63.87గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు కూడా 80 రూపాయల లాభంలో 29,247 రూపాయలుగా ఉన్నాయి.