వెలుగులో మెటల్, ఐటీ షేర్లు
స్వల్పంగా పెరిగిన సూచీలు
వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో నష్టాలు చవిచూసిన భారత్ స్టాక్ సూచీలు సోమవారం స్వల్పంగా కోలుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 21 పాయింట్ల పెరుగుదలతో 28,082 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్లు ఎగిసి 8,708 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సానుకూల ఆసియా మార్కెట్ల కారణంగా ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు పెరిగినప్పటికీ, వరుసగా రెండు రోజులపాటు మార్కెట్‌కు సెలవుకావడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణ జరిపారు. దాంతో సూచీలు కొద్దిపాటి పెరుగుదలతో ముగిసాయి. ఆసియా మార్కెట్లలో చైనా షాంఘై ఇండెక్స్ 1.45 శాతం ర్యాలీ జరిపింది. దాదాపు 10 రోజుల సెలవు తర్వాత ప్రారంభమైన చైనా మార్కెట్ ఒకే రోజు పెద్ద ర్యాలీ జరపడం విశేషం.
టాటా స్టీల్ టాప్...
ప్రపంచ ట్రెండ్‌కు అనుగుణంగా మెటల్ షేర్లకు భారీ కొనుగోలు మద్దతు లభించింది. టాటా స్టీల్ 2.7 శాతం ర్యాలీ జరిపి, రెండేళ్ల గరిష్టస్థాయి రూ. 419 వద్ద ముగిసింది. వేదాంత 2.36 శాతం, హిందాల్కో 1.65 శాతం చొప్పున పెరిగాయి. మరో రెండు రోజుల్లో ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు 1 శాతంపైగా ఎగిసాయి. పెరిగిన షేర్లలో ఆసియన్ పెయింట్స్, సిప్లా, ఇన్ఫోసిస్, లుపిన్, గెయిల్, డాక్టర్ రెడ్డీస్, మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, ఐటీసీ, టీసీఎస్, మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హీరో మోటో కార్ప్‌లు వున్నాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతంపైగా క్షీణించి రూ. 1,096 వద్ద క్లోజయ్యింది. భారతి ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, అదాని పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, బజాజ్ ఆటోలు సైతం తగ్గాయి.
నేడు, రేపు మార్కెట్లకు సెలవు
దసరా పండుగ సందర్బంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. అలాగే మొహర్రం కారణంగా బుధవారం సైతం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. తిరిగి గురువారం మార్కెట్లు ప్రారంభమవుతాయి.