ముంబై : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ప్రపంచ ట్రెండ్ అనుకూలించడంతో వరుసగా రెండు రోజులు లాభాల్లో నడిచిన స్టాక్ మార్కెట్లు, ఫెడ్ రేట్ల పెంపు భయంతో బుధవారం ట్రేడింగ్ లో నష్టాలను నమోదుచేస్తున్నాయి. సెన్సెక్స్ 235.59పాయింట్ల నష్టంతో 25,538 వద్ద, నిఫ్టీ 68.7 పాయింట్ల నష్టంతో 7,822 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా వినియోగదారుల ధరలు ఈ మూడేళ్లలో ఏప్రిల్ లో గణనీయంగా పెరిగాయని గణాంకాలు విడుదలయ్యాయి. ఆయిల్ ధరలు, గృహ అద్దె ధరలు పెరగడం వల్లే ఈ ద్రవ్యోల్బణం పెరిగినట్టు గణాంకాలు తెలిపాయి. దీంతో ఫెడ్ రిజర్వు తొందర్లోనే వడ్డీరేట్లు పెంచుతాదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఫెడ్ రేట్ పెంపు సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లలో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ రెండునెలల కనిష్టానికి నమోదవుతుండటం కూడా స్టాక్ మార్కెట్లపై ప్రతికూల అంశాన్ని చూపుతోంది.
కోల్ ఇండియా, హెచ్ యూఎల్, ఎమ్ అండ్ ఎమ్, సెన్సెక్స్ లో లాభాలను పండిస్తుండగా... ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, గెయిల్, బీహెచ్ఈఎల్ లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రభుత్వ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, తన ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకును తనలో విలీనం చేసుకోవాలనే ప్రతిపాదనను ఉద్యోగులు వ్యతిరేకిస్తుండటంతో ఎస్ బీఐ షేర్లు 1శాతం పడిపోయాయి. మార్కెట్లో ఈ ప్రతికూల ప్రభావంతో పసిడి స్వల్ప లాభాలను ఆర్జిస్తుండగా.. వెండి ధరలు పడిపోతున్నాయి. పసిడి రూ. 5 లాభంతో రూ.30,054గా వెండి రూ.117 నష్టంతో రూ.41,063గా కొనసాగుతోంది.
ఫెడ్ ఫీవర్ తో మార్కెట్లు ఢమాల్
Published Wed, May 18 2016 10:41 AM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM
Advertisement
Advertisement