ఆరంభంలో వచ్చిన భారీ నష్టాలను రికవరీ చేసుకొని బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. దీంతో వరుస మూడు ట్రేడింగ్ సెషన్ల నష్టాలకు బ్రేక్ పడింది. క్రిస్మస్ సెలవు కారణంగా మంగళవారం మార్కెట్ పనిచేయలేదు. ఒక రోజు విరామం తర్వాత ఆరంభమైన స్టాక్ సూచీలు ప్రారంభంలో భారీగా నష్టపోయాయి. అయితే ఆర్థిక రంగ షేర్లు కోలుకోవడం, అమెరికా ఫ్యూచర్స్ లాభపడటం, డిసెంబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో కొన్ని షేర్లలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటుచేసుకోవడం, రూపాయి లాభపడటం కలసివచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ షేర్లలో వేల్యూ బయింగ్ చోటు చేసుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 10,700 పాయింట్లపైకి ఎగబాకింది. 66 పాయింట్లు పెరిగి 10,730 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 35,650 పాయింట్ల వద్దకు చేరింది.ఆర్థిక, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా, ఐటీ షేర్లు తగ్గాయి.
నష్టాలతో మొదలై..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 27 పాయింట్లు, నిఫ్టీ 29 పాయింట్ల నష్టాలతో బుధవారం ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో అమెరికాలో పాక్షిక షట్‌డౌన్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్‌కు వ్యతిరేకంగా ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ శతృ వైఖరి అవలంభించడం వంటి కారణాల వల్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. ఒక దశలో కీలకమైన స్థాయిలనూ కోల్పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 459 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిప్టీ 129 పాయింట్ల వరకూ పతనమయ్యాయి. రూపాయితో డాలర్ మారకం పెరగడం సానుకూల ప్రభావం చూపించింది. అమెరికా ఎస్ అండ్ పీ, డోజోన్స్ 30 ఫ్యూచర్స్ రికవరీ కావడం, దీనికి షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జత కావడంతో మన మార్కెట్ కూడా రికవరీ బాట పట్టింది.
ఒక దశలో సెన్సెక్స్ 241 పాయింట్లు, నిఫ్టీ 84 పాయింట్ల వరకూ ఎగిశాయి. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 213 పాయింట్ల రేంజ్‌లో కదలాడాయి. ఇంట్రాడే కనిష్ట స్థాయిల నుంచి చూస్తే, సెన్సెక్స్ 639 పాయింట్లు, నిఫ్టీ 295 పాయింట్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనం కావడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్, విమానయాన షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు చెరో 1.7 శాతం లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్ 4.2 శాతం లాభపడి రూ.322 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సన్ ఫార్మా 2% నష్టంతో రూ. 414 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయింది ఇదే.మోతిలాల్ ఓస్వాల్ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ షేర్‌కు కొనచ్చు రేటింగ్‌ను ఇచ్చింది. దీంతో బ్రిగేడ్ షేర్ 14 శాతం దూసుకుపోయి రూ.235 వద్ద ముగిసింది.
‘ఆంటోని వేస్ట్’ ఐపీఓ పత్రాలు
ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ కంపెనీ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసులను అందించే ఈ కంపెనీ తాజాగా ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.43.5 కోట్ల విలువైన తాజా షేర్లను ఈ కంపెనీ జారీ చేస్తుంది. అంతే కాకుండా కంపెనీ ప్రస్తుత వాటాదారులు 94.42 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయిస్తారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగి ంచుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది.
ఆనంద్ రాఠి ఐపీఓ వెనక్కి
షేర్ బ్రోకింగ్, ఆర్థిక సేవల సంస్థ ఆనంద్ రాఠి వెల్త్ సర్వీసెస్ తన ఐపీఓను (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వెనక్కి తీసుకుంది. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.425 కోట్లు సమీకరించాలని భావించింది. మార్కెట్ మంచి జోరుగా ఉన్న సెప్టెంబర్‌లో ఐపీఓ పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఆ తర్వాత మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురి కావడంతో ఐపీఓ యోచనను విరమించుకోవాలని నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment