స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులు
నష్టంతో ముగిసిన మార్కెట్
ముంబై: నిరుత్సాహకర జీడీపీ డేటాకు స్పందనగా ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో గురువారం స్టాక్ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై, చివరకు కొద్దిపాటి నష్టాలతో ముగిసాయి. 31,213–31,062 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 8.21 పాయింట్ల నష్టంతో 31,138 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఇదేబాటలో 9,634–9,589 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనై చివరకు 5 పాయింట్ల నష్టంతో 9,616 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
క్రితం రోజు మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన గణాంకాల ప్రకారం మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ డేటా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపర్చిందని, దాంతో రోజంతా సూచీలు స్వల్పశ్రేణిలో కదిలాయని, అయితే వచ్చేనెలలో జరిగే ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలతో మార్కెట్ నష్టాలు తక్కువగా వున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ డౌన్...
వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా బీఎస్‌ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.58 శాతం నష్టపోయింది. కాగా ప్రధాన సూచీలు నీరసంగా ముగిసినప్పటికీ, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు జోరుగా పెరగడంతో ఈ సూచీలు మంచి లాభంతో ముగిసాయి.