ఆర్‌ఐఎల్ ర్యాలీ–కోలుకున్న మార్కెట్
స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు
ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల కారణంగా తగ్గిన మార్కెట్...చివరకు కోలుకుని ముగిసింది. క్రితం రోజు రికార్డుస్థాయిలో ముగిసిన సెన్సెక్స్ శుక్రవారం బలహీనంగా ప్రారంభమై 31,287 పాయింట్లస్థాయికి పడిపోయింది. మధ్యాహ్న సెషన్‌లో ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) భారీ ర్యాలీ జరపడంతో సెన్సెక్స్ చివరకు 8 పాయింట్ల స్వల్ప తగ్గుదలతో 31,361 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 9,684–9,643 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 8.75 పాయింట్ల నష్టంతో 9,666 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ నెలలో వెలువడే ఆర్‌ఐఎల్ ఫలితాలు బావుంటాయన్న అంచనాలు, ఆ కంపెనీ టెలికం సబ్సిడరీ రిలయన్స్ జియో త్వరలో చౌక 4జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నదనే వార్తలతో ఆర్‌ఐఎల్ షేరు 3.43 శాతం ర్యాలీ జరిపి 9 సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 1,491 వద్ద ముగిసింది. ఇది ఇంతిలా పెరగడంతో సూచీలు కుదుటపడ్డాయి. అమెరికాలో జాబ్స్ డేటా వెలువడనుండటం, యూరప్‌లో ద్రవ్య విధానం కఠినతరం కానున్నదనే ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు క్షీణించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
సెన్సెక్స్‌లో 20 షేర్లు డౌన్..
సెన్సెక్స్–30 షేర్లలో 20 షేర్లు తగ్గుదలతో ముగిసాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌బ్యాంక్, ఇన్ఫోసిస్, ఆసియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ షేర్లు 1 శాతంపైగా తగ్గాయి.
వెలుగులో ఫార్మా షేర్లు...
కొద్దివారాలపాటు భారీ క్షీణతల్ని నమోదుచేసిన ఫార్మా షేర్లు కనిష్టస్థాయిల వద్ద లభ్యమవుతుండటంతో తాజాగా వాటికి కొనుగోలు మద్దతు లభించిందని వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్ కోలుకోవడానికి ఆర్‌ఐఎల్‌తో పాటు ఫార్మా షేర్లు కూడా తోడ్పాటునందించినట్లు ఆయన తెలిపారు. బీఎస్‌ఈ ఫార్మా ఇండెక్స్ 1 శాతంపైగా పెరిగింది.