నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Published Thu, Jul 20 2017 4:01 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM
ముంబై : కన్సాలిడేషన్ నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలో కొనసాగాయి. సెన్సెక్స్ 50.95 పాయింట్ల నష్టంలో 31,904 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 26.30 పాయింట్లు కిందకి పడిపోయి 9,873 వద్ద సెటిలైంది. నేటి ట్రేడింగ్‌లో టాటాస్టీల్, కొటక్ మహింద్రా బ్యాంకు, వీఏ టెక్ వాబ్యాక్, కెనరా బ్యాంకులు టాప్ టూజర్లుగా ఎక్కువగా నష్టాలు గడించాయి. యాక్సిస్ బ్యాంకు, ఓఎన్‌జీసీలు రెండు సూచీల్లోనూ లాభాలు పండించాయి. కొటక్ మహింద్రా బ్యాంకు, ఐటీ కంపెనీ మైండ్‌ట్రి కంపెనీలు అంచనాలను మిస్ చేయడంతో వీటి షేర్లు నష్టాల్లో కొనసాగగా... వీటితో పాటు ఐటీసీ, ఇన్ఫోసిస్‌లు కూడా ఒత్తిడిలో కొనసాగాయి.
మైండ్‌ట్రి, ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు ఒత్తిడిలో కొనసాగడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.88 శాతం మేర పడిపోయింది. మరిన్ని కార్పొరేట్ ఫలితాలపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. నేడు మార్కెట్ అవర్స్ తర్వాత రానున్న ఫలితాల ప్రకటన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కూడా 0.26శాతం నష్టాల్లో ముగిసింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు పడిపోయింది. డాలర్ బలపడుతుండటంతో రూపాయి నష్టాలు పాలై 64.45గా ట్రేడైంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 70 రూపాయల నష్టంలో 28,180 రూపాయలుగా ఉన్నాయి.
Advertisement