స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
ముంబై: అంతర్జాతీయ ట్రెండ్ బలహీనత కారణంగా ట్రేడింగ్ సమయంలో చాలాభాగం ఒడుదుడుకులకు లోనైన భారత్ మార్కెట్ ముగింపులో కోలుకుంది. దాంతో స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజు స్వల్పలాభాలతో ముగిసాయి. ఒకదశలో 28,311 పాయింట్ల వరకూ క్షీణించిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 41 పాయింట్ల లాభంతో 28,413 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 8,705 పాయింట్ల స్థాయి నుంచి రికవరీ అయ్యి 16 పాయింట్ల లాభంతో 8,743 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వచ్చే వారం అటు అమెరికా, ఇటు జపాన్ కేంద్ర బ్యాంకుల పాలసీ మీటింగ్‌లు జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారని, దాంతో మార్కెట్ స్వల్ప శ్రేణిలో కదలాడిందని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
రిలయన్స్ నేతృత్వం: మార్కెట్ రికవరీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేరు నేతృత్వం వహించింది. సూచీల్లో గణనీయమైన వెయిటేజి కలిగిన ఈ షేరు బీఎస్‌ఈలో 1.63 శాతం పెరిగి రెండు వారాల గరిష్టస్థాయి రూ. 1,063 వద్ద ముగిసింది. కానీ సెన్సెక్స్-30 షేర్లలో 13 మాత్రమే పెరిగాయి. సిప్లా, మారుతి సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీలు 1-2 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, ఎన్‌టీపీసీ, మహింద్రా, గెయిల్‌లు క్షీణించాయి.