కొరియా భయం : సెన్సెక్స్ భారీ పతనం
కొరియా భయం : సెన్సెక్స్ భారీ పతనం
Published Fri, Aug 11 2017 9:55 AM | Last Updated on Sun, Sep 17 2017 5:25 PM
సాక్షి, ముంబై : ఉత్తరకొరియా క్షిపణి దాడి హెచ్చరికలు దలాల్ స్ట్రీట్‌లో బాంబు పేల్చాయి. సెన్సెక్స్ భారీగా 300 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ సైతం 9750 మార్కు కిందకి పడిపోయింది. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరం గ్వామ్ ద్వీపం సమీపంలో క్షిపణి దాడి చేస్తామంటూ ఉత్తరకొరియా హెచ్చరించింది. ఇందుకు ధీటుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బదులు ఇచ్చారు. దీంతో అమెరికా-ఉత్తరకొరియాల మధ్య భౌగోళిక రాజకీయ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ టెన్షన్ వాతావరణం అమెరికా మార్కెట్లకు వణుకు పుట్టించాయి. ఆసియన్, యూరోపియన్ మార్కెట్లకు కొరియా భయం పట్టుకుంది. దీంతో మన మార్కెట్లు భారీగా పడిపోతున్నాయి. ఈ రెండు దేశాల వైఖరితో ప్రపంచమంతటా యుద్ధమేఘాల భయం అలముకుందన్న భయాందోళనలో ఇన్వెస్టర్లు జంకుతున్నారని దలాల్ స్ట్రీట్ వర్గాలు పేర్కొన్నాయి.
సెన్సెక్స్ ప్రస్తుతం 274 పాయింట్ల నష్టంలో 31,257 వద్ద, నిఫ్టీ 93.55 పాయింట్ల నష్టంలో 9,726 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ స్టాక్స్‌లో కేవలం పవర్ గ్రిడ్, టెక్ మహింద్రా, విప్రోలు మాత్రమే లాభపడుతున్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2 శాతం మేర నష్టాలు గడిస్తున్నాయి. మరోవైపు రూపాయి కూడా భారీగా పతనమవుతోంది. నేటి ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసలు పతనమై 64.18 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు బ్రేక్ లేకుండా భారీగా 344 రూపాయల మేర పైకి ఎగిసి, 29,188 రూపాయలుగా ఉన్నాయి.
Advertisement