
165 పాయింట్లు మైనస్
వివిధ అంశాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నీరసించాయి. గత కొన్ని రోజులుగా మార్కెట్లలో వచ్చిన భారీ ర్యాలీలో భాగంగా ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు అమ్మకాలు చేపడుతుండటం ప్రభావం చూపుతోంది. వీటికితోడు ఎల్‌నినో కారణంగా సాధారణంక ంటే తక్కువ వర్షపాతం నమోదుకావచ్చన్న ముందస్తు అంచనాలు కూడా సెంటిమెంట్‌ను దెబ్బకొట్టడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. వెరసి సెన్సెక్స్ 165 పాయింట్లు క్షీణించి 22,466 వద్ద ముగిసింది. దీంతో మూడు రోజుల్లో 410 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ కూడా 46 పాయింట్ల నష్టంతో 6,715 వద్ద నిలిచింది.
మంగళవారం నుంచీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజులపాటు పాలసీ సమీక్షను నిర్వహించనుంది. జనవరి నుంచి నెలకు 10 బిలియన్ డాలర్ల చొప్పున కోత పెట్టడం ద్వారా గత కొన్ని నెలలుగా అమలు చేస్తున్న 85 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీని ఫెడ్ పూర్తి స్థాయిలో ఉపసంహరించనున్న సంగతి తెలిసిందే. ఇదయ్యాక వడ్డీ రేట్ల పెంపుపై దృష్టిపెట్టేందుకు అవకాశముండటంతో ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు చోటుచేసుకున్నాయని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావమూ ఉన్నదని వ్యాఖ్యానించారు.
మెటల్స్ డీలా...
బీఎస్‌ఈలో వినియోగ వస్తువులు మినహా అన్ని రంగాలూ నష్టపోగా, మెటల్స్ అత్యధికంగా 3% పతనమైంది. నిరుత్సాహకర ఫలితాల ప్రకటనతో జిందాల్ స్టీల్ 7.5% దిగజారగా, జేఎస్‌డబ్ల్యూ, టాటా స్టీల్, సెయిల్, హిందాల్కో 5-3% మధ్య పతనమయ్యాయి. మిగిలిన దిగ్గజాలలో హెచ్‌యూఎల్, టాటా పవర్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, మారుతీ, టాటా మోటార్స్, సెసాస్టెరిలైట్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3-1% మధ్య నష్టపోయాయి. సెన్సెక్స్‌లో మూడు షేర్లు మాత్రమే నామమాత్రంగా లాభపడ్డాయి.
ఎఫ్‌ఐఐల పెట్టుబడులు
ఎఫ్‌ఐఐలు రూ. 288 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ రూ. 551 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,506 నష్టపోగా, 1,281 లాభపడ్డాయి. ఫలితాలు నిరుత్సాహపరచడంతో హెక్సావేర్ 11% పడిపోగా, ఫ్యూచర్ రిటైల్, హెచ్‌సీఎల్ ఇన్ఫో, డెల్టా కార్ప్, మహీంద్రా సీఐఈ, అడ్వాంటా, వోల్టాస్ 7-4% మధ్య పతనమయ్యాయి. అయితే మరోవైపు సన్‌ఫార్మా అడ్వాన్స్‌డ్, వోకార్డ్, సోలార్ ఇండస్ట్రీస్, ఫినొలెక్స్ కేబుల్స్, ఆప్టో సర్క్యూట్స్, జేబీఎఫ్, ప్రిజం సిమెంట్, టీవీఎస్ మోటార్, స్టెరిలైట్ టెక్, ఫస్ట్‌సోర్స్ 14-5% మధ్య దూసుకెళ్లాయి.