వారం రోజుల లాభాలకు బ్రేకు
మార్కెట్ అప్‌డేట్
సెన్సెక్స్ 46 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్లు నష్టం
బ్లూచిప్ స్టాక్స్‌లో లాభాల స్వీకరణతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆరు సెషన్ల ర్యాలీకి బ్రేకు పడింది. దాదాపు నెల రోజుల గరిష్టానికి ఎగిసిన సెన్సెక్స్ 46 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయాయి. దేశీ సూచీలు కీలక నిరోధక స్థాయులను అధిగమించడంతో సోమవారం ట్రేడింగ్ సానుకూలంగా ప్రారంభమైంది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 28,064 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,446 పాయింట్ల స్థాయిని తాకాయి. అయితే, ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ముగియడం, యూరప్ మార్కెట్లు అంత బలంగా లేకపోవటం వంటిపరిణామాలతో బ్లూచిప్ స్టాక్స్‌లో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో చివర్లో సెన్సెక్స్ 27,842 పాయింట్లు, నిఫ్టీ 8,378 పాయింట్ల వద్ద ముగిశాయి.
ఐటీ, టెలికం, మెటల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తగా.. ఆటోమొబైల్, వినియోగ వస్తువులు, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్‌బీఐ తదిత షేర్లు నష్టపోవడంతో మార్కెట్లపై గణనీయంగా ప్రభావం పడినట్లు ట్రేడర్లు తెలిపారు.మార్కె ట్లు సానుకూలంగా మొదలైనప్పటికీ అంతర్జాతీయ పరిణామాలతో నష్టాల్లో ముగిసినట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ తెలియజేశారు. మొత్తం 1,545 స్టాక్స్ లాభాల్లోనూ, 1,420 షేర్లు నష్టాల్లోను ముగిశాయి.