మరో 181 పాయింట్ల ర్యాలీ
♦ 27,808 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్
♦ 8,500 శిఖరంపైన నిఫ్టీ
ముంబై: మార్కెట్లోకి ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడంతో ఈక్విటీలు వరుసగా రెండో రోజు జోరుగా పెరిగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ మంగళవారం మరో 181 పాయింట్లు పెరిగి 11 నెలల గరిష్టస్థాయి 27,808 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,500 పాయింట్ల స్థాయిని దాటేసింది. ఈ సూచి 53 పాయింట్ల పెరుగుదలతో 8,521 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కీలకమైన పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ ర్యాలీ జరగడం విశేషం. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి. మే నెలలో పారిశ్రామికోత్పత్తి పుంజుకోగా, జూన్ నెల ద్రవ్యోల్బణం 5.77 శాతానికి చేరింది. జపాన్, బ్రిటన్ కేంద్ర బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీల్ని ప్రకటించవచ్చన్న అంచనాలతో గ్లోబల్ ర్యాలీ జరుగుతున్నదని, అందులో భారత్ మార్కెట్ కూడా పాలుపంచుకుంటున్నదని విశ్లేషకులు చెప్పారు.
ప్రైవేటు బ్యాంకులు, మెటల్స్ జోరు...
ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లు, మెటల్ షేర్లు జోరుగా పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 4.6 శాతం ర్యాలీ జరపగా, యాక్సిస్ బ్యాంక్ 3 శాతం పెరిగింది. టాటా స్టీల్ 4.6 శాతం ఎగిసింది. వేదాంత, హిందాల్కోలు 5-6 శాతం మధ్య పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్ల జోష్...
ప్రపంచ మార్కెట్లలో కూడా ర్యాలీ కొనసాగడంతో ఇక్కడ సెంటిమెంట్ మరింత బలపడింది. సోమవారం అమెరికా ఎస్ అండ్ పీ ఇండెక్స్ ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలో ముగిసిన ప్రభావంతో మంగళవారం ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ ఎగిసాయి. జపాన్, హాంకాంగ్, చైనా, దక్షిణ కొరియా సూచీలు 1.5-2 శాతం మధ్య పెరిగాయి. యూరప్‌లో బ్రిటన్ ఎఫ్‌టీఎస్‌ఈ మినహా మిగిలిన దేశాల ఇండెక్స్‌లు 1 శాతంపైగా ర్యాలీ జరిపాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా సూచీలు 0.5 శాతం పెరుగుదలతో ట్రేడవుతున్నాయి.