+ 287 నుంచి –95 కు | Sensex surrenders early gains, sheds 95 points on global cues | Sakshi
Sakshi News home page

+ 287 నుంచి –95 కు

Published Wed, Apr 19 2017 1:34 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

+ 287 నుంచి –95 కు

+ 287 నుంచి –95 కు

లాభాల స్వీకరణతో క్షీణించిన మార్కెట్‌
వరుసగా నాలుగో రోజూ నష్టాలే
95 పాయింట్ల పతనంతో 29,319కు సెన్సెక్స్‌
34 పాయింట్ల నష్టంతో 9,105కు నిఫ్టీ


ట్రేడింగ్‌ చివరి గంటలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో మంగళవారం ఇంట్రాడేలో మంచి లాభాలు చూసిన  స్టాక్‌ మార్కెట్‌ చివరకు నష్టాల్లో ముగిసింది. భౌగోళిక– రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో  నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ స్టాక్‌ సూచీలకు నష్టాలు తప్పలేదు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 95 పాయింట్ల నష్టంతో 29,319 పాయింట్ల వద్ద  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 9,105 పాయింట్ల వద్ద ముగిశాయి.

బ్రిటిష్‌ ప్రధాని ధెరిస్సా మే ముందుగానే ఎన్నికలకు వెళ్లనున్నామంటూ అకస్మాత్తుగా ప్రకటించడం... కొరియా ద్వీపకల్పంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు... ఈస్టర్‌ సెలవుల అనంతరం ప్రారంభమైన యూరప్‌ మార్కెట్లు భారీగా నష్టపోవడం... రూపాయి కుదేలవడం ప్రతికూల ప్రభావం చూపాయి.

లాభాల్లోంచి.... నష్టాల్లోకి
సెన్సెక్స్‌ లాభాల్లోనే ప్రారంభమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 7.2 శాతంగా ఉండొచ్చన్న ప్రపంచ బ్యాంక్‌ నివేదిక కూడా తోడవటంతో ట్రేడింగ్‌ ముగిసే గంట ముందు వరకూ అదే జోరు కొనసాగింది. ఇంట్రాడేలో 287 పాయింట్ల లాభపడింది. ఎన్నికలకు వెళ్లనున్నామంటూ బ్రిటిష్‌ ప్రధాని హఠాత్తుగా ప్రకటించడంతో యూరప్‌ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి.

 దీంతో  మన మార్కెట్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.  29,701– 29,286 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 95 పాయింట్ల నష్టంతో 29,319 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే సెన్సెక్స్‌ మొత్తం 382 పాయింట్లు నష్టపోయింది. మొత్తం 415 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 469 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ 9,218–9,095 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య మొత్తం 123 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఒక దశలో 77 పాయింట్ల వరకూ లాభపడిన  నిఫ్టీ చివరకు 34 పాయింట్ల నష్టంతో 9,105 పాయింట్ల వద్ద ముగిసింది.

బ్యాంక్‌ నిఫ్టీ.. కొత్త రికార్డ్‌..
మార్చి క్వార్టర్లో ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు లాభపడడంతో  ఇంట్రాడేలో ఎన్‌ఎస్‌ఈ బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డ్‌ స్థాయి, 21,947 పాయింట్లను తాకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement