
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఆరంభంనుంచి బలహీనంగా ఉన్న కీలక సూచీలు మిడ్ సెషన్ తరువాత మరింత కుదేలయ్యాయి. ముఖ్యంగా ఆఖరి అర్థగంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు సెన్సెక్స్ 690 పాయింట్ల భారీ పతనంతో 35,742వద్ద నిఫ్టీ 197 పాయింట్లు నష్టంతో 10,754వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంకు కూడా 0.7శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.7శాతం కుప్ప కూలింది. ఈ వారమంతా లాభాలతో మురిపించిన మార్కెట్లు వారాంతంలో శుక్రవారం భారీగా నష్టపోయాయి. దీంతో 2లక్షల కోట్ల రూపాయల ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద తుడిచి పెట్టుకుపోయింది.
జీ, ఇన్ఫోసీస్, టీసీఎస్, యూపిల్, భారతి ఎయిర్టెల్ ఐవోసీ, రిలయన్స్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల పతనం మార్కెట్లను పతనం దిశగా లాక్కెళ్లింది. అటు అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాలు, ఇటు దేశీయంగా ఇన్వెస్టర్ల ఆందోళనతో చేసిన అమ్మకాలు దలాల్‌స్ట్రీట్‌ను వణించింది. అలాగే ఆయిల్ ధరలు, ఇటీవల మార్కెట్లలో వరుసగా ఏడు సెషన్లుగా లాభాల కొనసాగడం, లాంగ్ వీకెండ్ కావడంతో ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్‌కు తెర లేచిందని నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment