సెన్సెక్స్ ప్లస్.. నిఫ్టీ మైనస్
♦ రికార్డుస్థాయి సమీపం నుంచి వెనుతిరిగిన సూచీలు
♦ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ప్రభావం
ముంబై: ఆగస్టు తొలివారంలో సృష్టించిన రికార్డు గరిష్టస్థాయికి బుధవారం చేరువగా వెళ్లిన సూచీలు..అమ్మకాల ఒత్తిడికి తలొగ్గి వెనక్కు తగ్గాయి. ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినట్లు, జూలై నెలలో పారిశ్రామికోత్పత్తి 1.2 శాతం పెరిగినట్లు క్రితం రోజు మార్కెట్ ముగిసిన తర్వాత వచ్చిన నిరుత్సాహకర డేటాను లెక్కచేయకుండా...ట్రేడింగ్ తొలిదశలో ర్యాలీ జరిగింది. అయితే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం, యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావడంతో ట్రేడింగ్ ముగింపులో మార్కెట్ చాలావరకూ లాభాల్ని కోల్పోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ స్వల్పలాభంతోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ స్వల్పనష్టంతోనూ ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10.131 పాయింట్ల గరిష్టస్థాయికి వరకూ పెరిగిన తర్వాత..10,100 పాయింట్లస్థాయిని కోల్పోయి 10,063 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 14 పాయింట్ల నష్టంతో 10,079 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచీ ఆగస్టు 2న 10,138 పాయింట్ల రికార్డుస్థాయిని నమోదుచేసింది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ 32,348 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 32,127 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు 28 పాయింట్ల లాభంతో 32,186 పాయింట్ల వద్ద ముగిసింది. గత నెలలో సెన్సెక్స్ సృష్టించిన కొత్త రికార్డుస్థాయి 32,686 పాయింట్లు. కొత్త రికార్డుస్థాయి సమీపానికి చేరగానే మార్కెట్ ఒడుదుడుకులకు లోనయ్యిందని, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
పెట్రో కంపెనీలు డౌన్...:ప్రపంచ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల భారాన్ని ఇకనుంచి వినియోగదారులకు మళ్లించకుండా, కంపెనీలే భరించాలంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు కొన్ని ఫైనాన్షియల్ చానళ్లలో వార్తలు వెలువడటంతో పెట్రో మార్కెటింగ్ కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. షేర్లు 4–6 శాతం మధ్య పతనమయ్యాయి.
మాట్రిమోనీ ఐపీఓకు 4.4 రెట్లు సబ్‌స్క్రిప్షన్
ఆన్‌లైన్ వివాహవేదికను నిర్వహిస్తున్న మాట్రిమోనీ డాట్ కామ్ జారీచేసిన తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) 4.41 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఆఫర్ ముగింపురోజైన బుధవారం రాత్రి 7.15 సమయానికి ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన సమాచారం ప్రకారం 1.24 కోట్ల షేర్లకు బిడ్స్ అందాయి. రూ. 983–985 ప్రైస్‌బ్యాండ్‌తో 28 లక్షల షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తున్నది. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లకు 17.99 రెట్లు బిడ్స్ వచ్చాయి.