వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. ముందురోజు 1,000 పాయింట్లు జమ చేసుకున్న సెన్సెక్స్ తాజాగా మరో 595 పాయింట్లు బలపడింది. వెరసి 32,000 పాయింట్ల మార్క్‌ను సులభంగా దాటేసింది. 32,200 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 175 పాయింట్లు ఎగసి 9,500కు చేరువలో 9,490 వద్ద నిలిచింది. మే నెల డెరివేటివ్ సిరీస్ చివరి రోజు సైతం ట్రేడర్లు షార్ట్ కవరింగ్ చేపట్టడంతో ఇండెక్సులు బేర్ ర్యాలీ చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. పలు దేశాలలో లాక్‌డవున్ ఎత్తివేస్తుండటం, ఈ ఏడాది ద్వితీయార్థం నుంచీ ఆర్థిక వ్యవస్థలు రికవరీ సాధిస్తాయన్న అంచనాలు ప్రపంచస్థాయిలో ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 32,267 వద్ద గరిష్టాన్ని తాకగా.. 31,642 సమీపంలో కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ ఒక దశలో 9,511 పాయింట్ల వద్ద గరిష్టాన్ని అందుకోగా.. 9,337 దిగువకూ చేరింది.
మీడియా సైతం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, మీడియా, రియల్టీ, బ్యాంకింగ్ మెటల్ రంగాలు 4-2.5 శాతం మధ్య ఎగశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్ మాత్రమే అదికూడా 0.4 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఐషర్, ఎల్‌అండ్‌టీ, హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, ఇన్‌ఫ్రాటెల్, హిందాల్కో 10-4 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే విప్రో, ఐటీసీ, సిప్లా, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1-0.5 శాతం మధ్య నీరసించాయి.
ఎన్‌సీసీ స్పీడ్
డెరివేటివ్స్‌లో ఎన్‌సీసీ, ఉజ్జీవన్, భెల్, మదర్‌సన్, హావెల్స్, భారత్ ఫోర్జ్, నౌకరీ, గోద్రెజ్ సీపీ 9.5-6 శాతం మధ్య దూసుకెళ్లగా.. పీఎన్‌బీ, యస్ బ్యాంక్, మెక్‌డోవెల్, అదానీ పవర్, టాటా కెమ్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, టొరంట్ ఫార్మా, ఎల్‌ఐసీ హౌసింగ్, బాటా, ఆర్‌బీఎల్ బ్యాంక్ 2.6-1.6 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1529 లాభపడగా.. 807 నష్టపోయాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 335 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 2409 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4716 కోట్లు, డీఐఐలు రూ. 2841 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment