షార్ట్ కవరింగ్తో స్వల్ప లాభాలు
79 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల చివరిరోజు గురువారం ఇన్వెస్టర్లు తమ షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకుని నవంబర్ సిరీస్‌కు రోలోవర్ కావడం మార్కెట్లు నష్టపోకుండా కాపాడింది. మారుతి సుజుకి, హీరోమోటో కార్ప్ కంపెనీల ఫలితాలు అంచనాలకు మించి ఉండడం సానుకూల ప్రభావాన్ని చూపాయి. దీంతో సెన్సెక్స్ ప్రారంభంలో నష్టాల్లో ట్రేడ్ కాగా, మధ్యాహ్నం నుంచి లాభాల్లోకి ప్రవేశించింది. చివరికి 79 పాయింట్ల లాభంతో 27,915.90 వద్ద ముగిసింది. వరుసగా గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 342 పాయింట్ల మేర నష్టపోయిన విషయం తెలిసిందే. నిఫ్టీ ఎలాంటి మార్పు లేకుండా క్రితం ముగింపు అయిన 8,615.25 వద్దే ఫ్లాట్‌గా ముగిసింది. అంతకుముందు ఇంట్రాడేలో 8,550 నుంచి 8,624 మధ్య చలించింది.
డెరివేటివ్‌ల ఎక్స్‌పయిరీ రోజున షార్ట్ కవరింగ్ రావడం, గురువారం వెలువడిన కంపెనీల త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండడం మార్కెట్లను తక్కువ స్థాయిల నుంచి కోలుకునేలా చేశాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా రీసెర్చ్ హెడ్ వినోద్‌నాయర్ చెప్పారు. అదే సమయంలో బ్యాంకు ఎన్‌పీఏల అంశంపై ఆందోళనలు కొనసాగడం, మొత్తం మీద కంపెనీల త్రైమాసిక ఆదాయాలు బలహీనంగా ఉండడం మార్కెట్ల డెరైక్షన్ విషయంలో ఉత్సాహానికి బ్రేక్ వేసిందన్నారు. ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరగ్గా, మిడ్ క్యాప్ 1 శాతం, స్మాల్ క్యాప్ 0.77 శాతం నష్టపోయాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బుధవారం నికరంగా రూ.1,450 కోట్ల మేర విక్రయాలు జరిపారు.
టాటా షేర్లకు మరింత నష్టాలు
మారుతి సుజుకి లాభం 60 శాతం వృద్ధి చెందినా కంపెనీ షేరు 0.21 శాతం నష్టపోయింది. మెరుగైన ఫలితాలను ప్రకటించిన హీరో మోటోకార్ప్ షేరు కూడా 3.12 శాతం నష్టాన్ని ఎదుర్కొంది. టాటా గ్రూపు స్టాక్స్ గురువారం కూడా నష్టాల బాటలో కొనసాగాయి. టాటా పవర్, టాటా మోటార్స్ ఒకటిన్నర శాతం తగ్గాయి. టాటా స్టీల్ అర శాతం, టాటాపవర్ 2 శాతం నష్టపోగా, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా మెటాలిక్స్ 5 శాతం, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ 5.43 శాతం వరకూ తగ్గాయి. ఇండియన్ హోటల్స్ 6 శాతం, టాటా టెలీ సర్వీసెస్ షేర్ల ధరలు 10 శాతం వరకూ పడిపోయాయి. టిన్‌ప్లేట్ 4 శాతం, టాటా కాఫీ, టోయోరోల్స్ 3 శాతం వరకు నష్టాలను ఎదుర్కొన్నాయి. టీసీఎస్ మాత్రం 0.68 శాతం లాభంలో ముగిసింది. ఆసియా మార్కెట్లలో జపాన్ నికాయ్ 0.32 శాతం, షాంఘై కాంపోజిట్ 0.13 శాతం, హాంగ్‌కాంగ్ హ్యాంగ్‌సెంగ్ 0.83 శాతం నష్టపోయాయి. యూరోపియన్ మార్కెట్లు కూడా ప్రారంభంలో నష్టాల్లోనే కొనసాగాయి.