Short covering
-
యుద్ధ భయాల నుంచి కోలుకున్న మార్కెట్
ముంబై: ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ భయాల నుంచి దలాల్ స్ట్రీట్ తేరుకుంది. షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో మంగళవారం సూచీలు దాదాపు ఒకశాతం లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న రికవరీ ర్యాలీ కలిసొచ్చింది. క్రూడాయిల్ ధరలు గరిష్ట స్థాయిల నుంచి దిగివచ్చాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) తాజాగా 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.3 శాతానికి పెంచింది. ఫలితంగా ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లలో నెలకొన్న కొనుగోళ్లతో సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 66,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు బలపడి 19,690 వద్ద నిలిచింది. ఒకదశలో సెన్సెక్స్ 668 పాయింట్లు బలపడి 66,180 వద్ద, నిఫ్టీ 206 పాయింట్లు దూసుకెళ్లి 19,718 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఇటీవల అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆస్తకి చూపారు. ఫెడ్ రిజర్వ్ అధికారుల సరళతర ద్రవ్య విధాన అమలు వ్యాఖ్యలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల భద్రతకు తగిన చర్యలు తీసుకున్నామని, ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని అదానీ పోర్ట్స్, సెజ్ వివరణ ఇవ్వడంతో ఈ కంపెనీ షేరు 4% లాభపడి చేసి రూ.819 వద్ద స్థిరపడింది. పండుగ డిమాండ్‌తో సెప్టెంబర్ రిటైల్ అమ్మకాల్లో 20% వృద్ధి నమోదైనట్లు డీలర్ల సమాఖ్య ఫెడా ప్రకటనతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. టాటా మోటార్స్ 2%, ఎంఅండ్ఎం 1.50%, మారుతీ 1.32% లాభపడ్డాయి. అశోక్ లేలాండ్ 1.22%, హీరో మోటో 0.66%, బజాబ్ ఆటో 0.64%, ఐషర్ 0.42%, టీవీఎస్ 0.36% పెరిగాయి. -
షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు
ముంబై: స్టాక్ సూచీలు నవంబర్ సిరీస్‌కు లాభాలతో వీడ్కోలు పలికాయి. డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల జరగడంతో గురువారం సెన్సెక్స్ 454 పాయింట్లు పెరిగి 58,795 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 17,536 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు ఆరుశాతం రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. మూడీస్‌తో సహా పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్ రేటింగ్‌కు సవరించడంతో సెంటిమెంట్ మరింత బలపడింది. ఇంధన, ఫార్మా, ఐటీ, మీడియా, మెటల్, రియల్టీ, షేర్లు లాభపడ్డాయి. నవంబర్ ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ట్రేడర్లు తమ పొజిషన్లను మార్చుకోనే (స్క్యేయర్ ఆఫ్, రోలోవర్) క్రమంలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2300 కోట్ల షేర్లను విక్రయించారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1368 కోట్ల షేర్లను కొన్నారు. బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో షేర్లు నష్టపోయాయి. వీలైనంత తొందర్లో ఉద్దీపన ఉపసంహరణ చర్యలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫెడ్ రిజర్వ్ తన మినిట్స్‌లో తెలపడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 12 పైసలు బలపడి 74.52 వద్ద స్థిరపడింది. తడబడినా.., నిలబడ్డాయ్..! ఒకరోజు నష్టం తర్వాత స్టాక్ మార్కెట్ ఉదయం స్వల్ప లాభంతో మొదలైంది. సెన్సెక్స్ ఉదయం 23 పాయింట్ల లాభంతో 58,364 వద్ద, నిఫ్టీ రెండు పాయింట్ల పెరిగి 17,417 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లోని బలహీనతలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో తొలి అరగంటలోనే సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 198 పాయింట్లును కోల్పోయి 58,143 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు పతనమైన 17,352 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదుచేశాయి. మిడ్‌సెషన్ నుంచి రిలయన్స్ షేరు జోరు కనబరచడంతో పాటు ట్రేడర్లు షార్ట్ కవరింగ్ చేపట్టడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. మార్కెట్ ముగిసే వరకు ట్రేడర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సూచీలు లాభాల్లో ముగించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు... సౌదీ ఆరాంకో ఒప్పంద రద్దుతో ఈ వారం ఆరంభం నుంచి నష్టాలను చవిచూస్తున్న రిలయన్స్ షేరు గురువారం భారీగా పెరిగింది. షార్ట్ కవరింగ్ జరగడంతో షేరు ఇంట్రాడేలో ఆరున్నర శాతం ర్యాలీ చేసి రూ.2503 స్థాయిని అందుకుంది. చివరికి 6% లాభపడి రూ.2,494 వద్ద ముగిసింది. గ్యాసిఫికేషన్ అండర్‌టేకింగ్‌ను పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థకి బదిలీ చేసేందుకు బోర్డు నిర్ణయించుకోవడం కూడా షేరు ర్యాలీకి కలిసొచ్చినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► యాంకర్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పేటీఎం షేరు మూడోరోజూ ర్యాలీ చేసింది. బీఎస్ఈలో రెండుశాతం ర్యాలీ చేసి రూ.1797 వద్ద ముగిసింది. ► బైబ్యాక్ ప్రణాళికకు బోర్డు ఓకే చెప్పొచ్చనే అంచనాలతో వేదాంత షేరు ఆరుశాతం లాభపడి రూ.368 వద్ద స్థిరపడింది. ► సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు నిరాశపరచడంతో సీమైన్స్ షేరు ఐదున్నర శాతం నష్టంతో రూ.2152 వద్ద నిలిచింది. -
బుల్ బౌన్స్‌బ్యాక్
ముంబై: మూడు రోజులుగా అమ్మకాల ఒత్తిడితో తడబడిన బుల్ శుక్రవారం లాభాల బాటలో దూసుకెళ్లింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలను ఆసరాగా చేసుకొని ఇన్వెస్టర్లు ద్రవ్యోల్బణ భయాలను విస్మరించి కొనుగోళ్లు చేపట్టారు. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సుల్లో షార్ట్ కవరింగ్ చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల రికవరీ అంశాలు కలిసొచ్చాయి. ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ షేర్లైన ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్‌లు మూడు శాతం మేర రాణించి సూచీల రికవరీకి తోడ్పడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలు అంతుకు ముందు కోల్పోయిన కీలకమైన 60వేలు, 18వేల స్థాయిని తిరిగి అందుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మీడియా షేర్లు మాత్రమే స్వల్ప నష్టాలను చవిచూశాయి. మిగతా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్ 767 పాయింట్లు పెరిగి 60,687 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 229 పాయింట్లు లాభపడి 18,103 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు సూచీలకు రెండు వారాల గరిష్టం కావడం విశేషం. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.511 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.851 కోట్ల షేర్లను కొన్నారు. సూచీల భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.2.77 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 619 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు లాభపడ్డాయి. నిరాశపరిచిన ఫినో పేమెంట్స్ బ్యాంక్... లాభాల మార్కెట్లోనూ ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.577 కాగా.., రూ.548 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11 శాతం వరకూ పతనమై రూ.534 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి ఐదున్నర శాతం నష్టంతో రూ.545 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజ్‌లో 6.24 లక్షల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ విలువ రూ.4,537 కోట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► విదేశీ పెట్టుబడులకు ప్రామాణికంగా భావించే ఎంఎస్సీఐ ఇండెక్స్‌లో చోటు దక్కించుకోవడంతో జొమాటో షేరు ఇంట్రాడేలో పది శాతం పెరిగి రూ.155 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి రూ.153 వద్ద ముగిసింది. ► విమాన ప్రయాణికుల రద్దీ అక్టోబర్‌లో పెరగడం ఇండిగో షేరుకు కలిసొచ్చింది. బీఎస్ఈ లో ఏడు శాతం లాభంతో రూ.2305 వద్ద స్థిరపడింది. ఏకంగా 929.57 కోట్ల షేర్లు చేతులు మారినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి. ► నైకా షేరుకు డిమాండ్ తగ్గడం లేదు. ఇంట్రాడేలో తొమ్మిది శాతం పెరిగి రూ.2410 వద్ద ఆల్ టైం హైని నమోదుచేసింది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.2359 వద్ద స్థిరపడింది. -
షార్ట్ కవరింగ్‌తో నష్టాలకు చెక్..
ముంబై: షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల అండతో సూచీలు శుక్రవారం భారీ లాభాలు అందుకున్నాయి. దీంతో అయిదురోజుల వరుస నష్టాలకు ముగింపు పడినట్లైంది. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు మూడున్నర శాతం రాణించడం కూడా సూచీల ర్యాలీకి కలిసొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ 642 పాయింట్లు లాభపడి 49,858 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 186 పాయింట్లు పెరిగి 14,744 వద్ద నిలిచింది. ఇటీవల మార్కెట్ పతనంతో భారీగా కుదేలైన ఎఫ్ఎంసీజీ, మెటల్, బ్యాంకింగ్, ఫార్మా రంగాల షేర్లలో విరివిగా కొనుగోళ్లు జరిగాయి. కేంద్రం ప్రకటించిన కొత్త స్క్రాపేజ్ విధానంతో ఆటో రంగ షేర్లు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనైప్పటికీ.., చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఒక్క రియల్టీ రంగ షేర్లు మాత్రం నష్టాలను చవిచూశాయి. బాండ్ ఈల్డ్స్ పెరుగుదలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కదలాడటం, దేశీయంగా కరోనా కేసుల విజృంభణ లాంటి ప్రతికూలాంశాలతో సూచీలు రోజంతా తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1416 పాయిం ట్ల రేంజ్లో కదలాడగా, నిఫ్టీ 438 పాయింట్ల పరిధిలో ట్రేడైంది. ఇవే బాండ్ ఈల్డ్స్, కరోనా కేసుల పెరుగుదల కారణాలతోనే ఈ వారంలో సెన్సెక్స్ 934 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 287 పాయింట్లు నష్టపోయింది. మిడ్‌సెషన్ నుంచి షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు.... ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో ప్రారం భమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 629 పాయిం ట్లు నష్టపోయి 49,216 వద్ద, నిఫ్టీ 208 పాయింట్లను కోల్పోయి 14,350 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. భారీ నష్టాలను చవిచూస్తున్న సూచీలను మిడ్‌సెషన్ నుంచి జరిగిన షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు ఆదుకున్నాయి. చివర్లో కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్టం నుంచి 1416 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 438 పాయింట్లు లాభపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► ఐటీసీ వ్యాపార విభజనపై చర్చించేందుకు బోర్డు ఏప్రిల్‌లో సమావేశం అయ్యే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలపడంతో కంపెనీ షేరు 2.5 శాతం లాభపడి రూ.223 వద్ద ముగిసింది. ► రిలయన్స్ రిటైల్ కుదుర్చుకున్న ఒప్పందంపై ముందుకెళ్లందంటూ సింగపూర్ ఆర్బిట్రేటర్ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సమర్థించడంతో ఫ్యూచర్ రిటైల్ షేరు 10 శాతం నష్టంతో రూ.56 వద్ద స్థిరపడింది. ► రిలయన్స్ షేరు మూడున్నర శాతం లాభంతో రూ.2078 వద్ద నిలిచింది. ► అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు ఎయిర్‌టెల్‌కు పాజిటివ్ అవుట్‌లుక్‌ను కేటాయించడంతో కంపెనీ షేరు ఒకశాతం లాభంతో రూ.532 వద్ద ముగిసింది. -
మార్కెట్లకు సెంటిమెంట్ బూస్ట్
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు దేశీయ ఈక్విటీ మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. డెరివేటివ్స్‌లో మే నెల కాంట్రాక్టుల ఎక్స్పైరీ చివరి రోజున ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్, రోలోవర్‌కు మొగ్గు చూపడంతో దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థలు తెరిపిన పడుతున్న సంకేతాలు దేశీయ ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్‌కు మద్దతిచ్చాయి. దాదాపు అన్ని సూచీలు లాభాలు గడించాయి. షార్ట్ కవరింగ్ కారణంగా మార్కెట్ వ్యాప్త ర్యాలీ చోటు చేసుకున్నట్టు అనలిస్టులు పేర్కొన్నారు. సెన్సెక్స్ 595 పాయింట్లు లాభపడి (1.88 శాతం) 32,201 వద్ద, నిఫ్టీ 175 పాయింట్లు (1.88 శాతం) పెరిగి 9,490 వద్ద ముగిశాయి. ‘‘ఈయూ నుంచి భారీ ఉద్దీపనల ప్యాకేజీ యూరోపియన్ షేర్ల ర్యాలీకి కారణమైంది. అయితే చైనా–అమెరికా మధ్య దౌత్యపరమైన అంశాలు ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఇక దేశీయంగా వైరస్ కేసులు అధిక స్థాయిల్లోనే ఉన్నప్పటికీ ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభంతో మార్కెట్లు ర్యాలీ చేశాయి. ప్రభుత్వం నుంచి తదుపరి ఉద్దీపనల చర్యలు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంచేందుకు తోడ్పడతాయని, ప్రభావిత రంగాలకు సాయంగా నిలుస్తాయన్న అంచనాలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో పెద్దగా మార్పుల్లేకపోయినప్పటికీ ఈ అంచనాల మద్దతుతోనే మార్కెట్లు లాభపడ్డాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. లాభపడినవి ఇవే.. అన్ని రంగాల సూచీలు లాభపడగా.. అత్యధికంగా బీఎస్ఈ క్యాపిటల్ గూడ్స్ 5.11% ర్యాలీ చేసింది. ఆ తర్వాత ఆటో, ఇండస్ట్రియల్స్, ఫైనాన్స్, రియల్టీ, బ్యాంకెక్స్, మెటల్ సూచీలు ఎక్కువగా లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కూడా ఒకటిన్నర శాతం వరకు పెరిగాయి. సెన్సెక్స్‌లో ఎల్అండ్టీ అత్యధికంగా 6% పెరిగింది. హీరో మోటోకార్ప్, ఇండస్ఇండ్ , హెచ్డీఎఫ్సీ బ్యాంకు, మారుతి, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు ఎక్కువగా లాభపడిన వాటిల్లో ఉన్నాయి. -
బ్యాంక్.. బాజా!
బ్యాంక్, ఆర్థిక రంగ షేర్ల జోరుతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. ప్రపంచ మార్కెట్లు లాభపడటం, మే నెల డెరివేటివ్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడం సానుకూల ప్రభావం చూపించాయి. మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 31,000 పాయింట్లపైకి, నిఫ్టీ 9,300 పాయింట్లపైకి ఎగిశాయి. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో వేల్యూ బయింగ్ చోటు చేసుకోవడంతో మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 996 పాయింట్ల లాభంతో 31,605 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 286 పాయింట్లు పెరిగి 9,315 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 3 శాతం మేర పెరిగాయి. స్టాక్ సూచీలకు ఈ నెలలో ఇదే అత్యధిక లాభం. 1,135 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే మొదలయ్యాయి. అరగంటకే నష్టాల్లోకి జారిపోయాయి. మళ్లీ అరగంటలోనే లాభాల్లోకి వచ్చాయి. ఆ తర్వాత అంతకంతకూ లాభాలు పెరుగుతూనే పోయాయి. ఒక దశలో 83 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 1,052 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 1,135 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ బ్యాంక్‌సూచీ 1,270 పాయింట్లు (7 శాతం)ఎగసి 18,711 పాయింట్లకు చేరింది. వాహన, ఐటీ, లోహ షేర్లు లాభపడ్డాయి. లాక్డౌన్ ఆంక్షల సడలింపు, వ్యాపార కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడంతో రికవరీపై ఆశలతో మార్కెట్ దూసుకుపోయిందని నిపుణులంటున్నారు. మరిన్ని విశేషాలు... ► యాక్సిస్ బ్యాంక్ 13 శాతం లాభంతో రూ.387 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఈ బ్యాంక్‌లో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, కార్లైల్ 8 శాతం మేర వాటా కోసం వంద కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదన్న వార్తలతో ఈ షేర్ జోరుగా పెరిగింది. ► పలు బ్యాంక్ షేర్లు మంచి లాభాలు సాధించాయి. ఈ షేర్లు ఒక్క రోజులో ఈ రేంజ్లో లాభపడటం గత రెండు నెలల్లో ఇదే మొదటిసారి. ► దాదాపు వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు ఎగిశాయి. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఏబీబీ ఇండియా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పీఎఫ్సీ, కర్నాటక బ్యాంక్ షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► క్యూఐపీ ద్వారా రూ.7,500 కోట్లు సమీకరించనుండటంతో కోటక్ బ్యాంక్ షేర్ 5% లాభంతో రూ.1,216 వద్ద ముగిసింది. లక్షల కోట్లు పెరిగిన సంపద సెన్సెక్స్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 2.01 లక్షల కోట్ల మేర పెరిగి రూ.124 లక్షల కోట్లకు ఎగసింది. లాభాలు ఎందుకంటే... ► లాక్డౌన్ సడలింపులు! వివిధ దేశాల్లో లాక్డౌన్ సడలింపులు, వ్యాపార కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థాయికి వస్తుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. త్వరలోనే ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతుందనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఈ ఏడాది జూన్ తర్వాత భారత్ పటిష్టమైన రికవరీని సాధించగలదన్న జేపీ మోర్గాన్ సంస్థ వ్యాఖ్యానం సానుకూల ప్రభావం చూపించింది. ► వేల్యూ బయింగ్... మొండి బకాయిలు పెరుగుతాయనే భయాలతో ఇటీవల పలు బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు బాగా నష్టపోయాయి. ఇవి ఆకర్షణీయ ధరల్లో ఉండటంతో సంస్థాగత ఇన్వెస్టర్లు బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లను జోరుగా కొనుగోలు చేశారు. ► షార్ట్ కవరింగ్.... మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో ట్రేడర్లు జోరుగా షార్ట్‌కవరింగ్ కొనుగోళ్లు జరిపారు. బ్యాంక్, ఎన్బీఎఫ్సీల్లో ఈ కొనుగోళ్లు అధికంగా కనిపించాయి. ► లాభాల్లో ప్రపంచ మార్కెట్లు... వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ను సడలించడం, పలు దేశాల్లో మెల్లమెల్లగా సాధారణ స్థితి నెలకొనడం, యూరప్ కేంద్ర బ్యాంక్ ఉద్దీపన చర్యలను ప్రకటించనుండటంతో ప్రపంచ మార్కెట్లు మంచి లాభాలు సాధించాయి. షాంఘై, హాంగ్‌కాంగ్ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభపడగా, యూరప్ మార్కెట్లు 1–2 శాతం మేర లాభపడ్డాయి. ► విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు.. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో మన మార్కెట్లో ఇప్పటివరకూ అయినకాడికి అమ్మకాలు సాగిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం రూ.4,716 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరిపారు. -
షార్ట్ కవరింగ్ : 9400 ఎగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అమెరికా , ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ ఆరంభంలోనే 500పాయింట్లు జంప్ చేసింది. ప్రస్తుతం 421 పాయింట్ల లాభంతో 32128 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు ఎగిసి 9418 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ 32 వేల ఎగువన, నిఫ్టీ 9400 స్థాయికి ఎగువన కొనసాగుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం లాభపడుతోంది. బ్యాంకింగ్ , ఆటో రంగ షేర్లలో షార్ట్ కవరింగ్ బాగా కనిపిస్తోంది. ఐషర్ మోటర్స్, యూపీఎల్, వేదాంత, జీ లిమిటెడ్, ఓఎన్జీసీ లాభపడుతుండగా, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటాన్, ఏషియన్ పేయింట్స్ షేర్లు నష్టపోతున్నాయి. (రూ.5.8 లక్షల కోట్లు ఆవిరి) -
‘ప్యాకేజీ’ పరుగు!
కేంద్ర ప్రభుత్వం రెండో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తుందన్న ఆశలతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. సెన్సెక్స్ 31,150 పాయింట్లపైకి, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,100 పాయింట్లపైకి ఎగబాకాయి. ఇతర దేశాల్లో కరోనా కేసులు చివరి దశకు చేరాయని, ఆయా దేశాలు ప్యాకేజీని ఇవ్వగలవన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు కూడా లాభపడ్డాయి. దీంతో మన మార్కెట్లో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజు అయినప్పటికీ, స్టాక్ సూచీలు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఇంట్రాడేలో నష్టపోయినప్పటికీ, డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం కూడా సానుకూల ప్రభావం చూపించింది. ఏడు వారాల నష్టాలకు బ్రేక్... గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 1,266 పాయింట్లు ఎగసి 31,160 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 363 పాయింట్లు పెరిగి 9,112 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 4.23 శాతం, నిఫ్టీ 4.15 శాతం చొప్పున ఎగిశాయి. రెండు రోజుల సెలవుల కారణంగా ఈ వారంలో ట్రేడింగ్ మూడు రోజుల పాటే జరిగినా, సెన్సెక్స్,నిఫ్టీలు భారీగానే లాభపడ్డాయి. సెన్సెక్స్ 3,569 పాయింట్లు, నిఫ్టీ 1,028 పాయింట్ల చొప్పున పెరిగాయి. ఈ రెండు సూచీలు చెరో 13 శాతం మేర లాభపడ్డాయి. ఏడు వారాల వరుస నష్టాలకు ఈ వారం బ్రేక్ పడింది. త్వరలోనే రెండో ప్యాకేజీ కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పడేయటానికి ఇప్పటికే కేంద్ర ప్రభు త్వం రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా రూ. లక్ష కోట్ల రెండో ప్యాకేజీని కేంద్రం సిద్ధం చేస్తోందన్న వార్తలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు ఊరటనిచ్చేలా వడ్డీ రాయితీ పథకాలు, రియల్టీ రంగానికి తాయిలాలు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మూల ధన నిధుల కేటాయింపులు ఈ రెండో ప్యాకేజీలో ఉంటాయని అంచనా. కాగా జపాన్ నికాయ్ సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు 1% మేర లాభపడగా, యూరప్ మార్కెట్లు 2–3 శాతం మేర పెరిగాయి. మరిన్ని విశేషాలు.... ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 17% లాభంతో రూ.381 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు– నెస్లే ఇండియా, ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► దాదాపు 30కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. వీటిల్లో ఫార్మా షేర్లే అధికంగా ఉండటం విశేషం. అజంతా ఫార్మా, అబాట్ ఇండియా, క్యాడిలా హెల్త్‌కేర్, అల్కెమ్ ల్యాబొరేటరీస్, సిప్లా, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టొరంటొ ఫార్మా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 500కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రేమండ్, జుబిలంట్ లైఫ్ సైన్సెస్, శోభ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.లక్ష కోట్లతో మరో ప్యాకేజీ! వ్యాపార సంస్థలు, రియల్టీ, పీఎస్‌బీలపై దృష్టి ముంబై: కేంద్ర ప్రభుత్వం మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించొచ్చని, గత నెలలో ప్రకటించిన రూ.1.75 లక్షల కోట్ల ఉద్దీపనల తరహాలోనే ఇది కూడా ఉంటుందని బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్లించ్ సంస్థ పేర్కొంది. చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు రుణాలపై వడ్డీ రాయితీలు, సమస్యలను ఎదుర్కొంటున్న రియల్టీ రంగానికి ప్రోత్సాహకాలు, ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయం అందించడంపై నూతన ప్యాకేజీలో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్లించ్ సూచించింది. పేద, బలహీన వర్గాలు, అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక ప్రోత్సాహకాలతో కేంద్రం గత నెలలో ప్రకటించిన రూ.1.75 లక్షల కోట్ల ప్యాకేజీలో దృష్టి పెట్టిన విషయం విదితమే. కేంద్ర ఆర్థిక శాఖ జీడీపీలో కనీసం 0.3 శాతం మేర ఆర్థిక ఉద్దీపనలు ప్రకటిస్తుందని అంచనా వేస్తున్నట్టు బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్లించ్ సెక్యూరిటీస్ ఆర్థికవేత్తలు తమ నివేదికలో తెలిపారు. జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతానికి పడిపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లూ!! తొందర వద్దు... ఇటీవలి స్టాక్ మార్కెట్ ఉత్థానాలు బేర్ మార్కెట్ ర్యాలీలని కొందరు విశ్లేషకులంటున్నారు. రికవరీ మొదలయిందనే అంచనాలతో కొనుగోళ్లకు తొందర పడవద్దని వారు ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. ప్రస్తుత పెరుగుదల స్వల్పకాలిక బేర్ మార్కెట్ ర్యాలీ అని, ఇది కొనసాగే అవకాశాలు లేవని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నా, 21 రోజుల లాక్డౌన్ మంచి ఫలితాలనే ఇవ్వగలదన్న విషయం రానున్న రోజుల్లో వెల్లడి కానున్నదని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ సంజీవ్ జర్భాడే వ్యాఖ్యానించారు. ఎఫ్ఎమ్సీజీ రంగ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్ల వేల్యూయేషన్లు ఇప్పుడు సమంజసంగానే ఉన్నాయని పేర్కొన్నారు. బ్యాలె న్స్ షీట్ పటిష్టంగా, నిర్వహణ సామర్థ్యం బాగా ఉండి, మార్కెట్ లీడర్లుగా ఉన్న షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేయవచ్చని ఆయన సూచించారు. ఆర్థిక పరిస్థితులు కుదుటపడిన తర్వాత ఈ షేర్లు మంచి రాబడులనిస్తాయని పేర్కొన్నారు. మార్కెట్లు పడుతున్నా.. చెదరని విశ్వాసం ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం మార్చి మాసంలో రూ.11,485 కోట్ల రాక సిప్ రూపంలో రూ.8,641 కోట్లు న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరణ కారణంగా ఆర్థిక మాంద్యం తప్పదన్న భయాలతో ఈక్విటీ మార్కెట్లు గత నెలలో భారీ పతనాలను చవిచూశాయి. స్టాక్స్ 30–90 శాతం మధ్య వాటి గరిష్టాల నుంచి పడిపోయాయి. కానీ, ఇవేవీ మన దేశీయ ఇన్వెస్టర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయలేదు. ఇంత మంచి అవకాశం మళ్లీ మళ్లీ రాదనుకున్నారు. ఫలితమే మార్చి నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి నికరంగా 11,485 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏడాది కాలంలో ఒక నెలలో ఈక్విటీల్లోకి అధిక పెట్టుబడులు రావడం మళ్లీ ఇదే. మార్చి నెలలో మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి రూ.2.13 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ముఖ్యంగా మనీ మార్కెట్, లిక్విడ్ ఫండ్స్ నుంచి అధిక స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగినట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) తెలిపింది. సిప్ ఆపేది లేదు..! ► ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి మార్చి నెలలో రూ.11,723 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే సమయంలో క్లోజ్ ఎండెడ్ ఈక్విటీ పథకాల నుంచి రూ.238 కోట్ల ఉపసంహరణ జరిగింది. దీంతో నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.11,485 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం నెల ఫిబ్రవరిలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన రూ.10,760 కోట్లతో పోల్చి చూస్తే పెరిగాయి. ► మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.2,268 కోట్లు, లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,060 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి రూ.1,551 కోట్లు, మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,223 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పట్ల ఇన్వెస్టర్ల నిబద్ధతను తెలియజేస్తూ ఈ మార్గంలో వచ్చిన పెట్టుబడులు మార్చి నెలలో రూ.8,641 కోట్లకు చేరాయి. ఇలా సిప్ రూపంలో రూ.8,000 కోట్లకు పైగా ప్రతీ నెలా రావడం గత 16 నెలలుగా కొనసాగుతూ వస్తోంది. ఇన్వెస్టర్ల సంపద 4 లక్షల కోట్లు అప్ స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ.4 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ.120.82 లక్షల కోట్లకు చేరింది. నేడు గుడ్‌ఫ్రైడే సెలవు గుడ్‌ఫ్రైడే సందర్భంగా నేడు సెలవు. ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో ట్రేడింగ్ జరగదు. -
భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్
మంబై : గ్లోబల్ మార్కెట్ల ఊతంతో పాటు కరోనా మహమ్మారి కట్టడికి ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించవచ్చనే అంచనాలతో స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. ఓ దశలో 1286 పాయింట్లు ఎగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ ఆర్థిక ప్యాకేజ్‌ను తర్వాత ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించడంతో ఆరంభ లాభాలు కొంతమేర ఆవిరయ్యాయి. ఇక బ్లాక్ మండే విషాదాన్ని మరిపించేలా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దేశీయంగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో విమానయాన రంగ షేర్లు నష్టపోయాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 692 పాయింట్ల లాభంతో 26,674 పాయింట్ల వద్ద ముగియగా, 190 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 7801 పాయింట్ల వద్ద క్లోజయింది. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా షేర్లు లాభాలతో ముగిశాయి. షార్ట్ కవరింగ్ కారణంగా మార్కెట్ రీబౌండ్ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ ఈ స్ధాయిలో నిలదొక్కుకోవడం ముఖ్యమని, ట్రేడర్లు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ చమురు ధరలు పుంజుకోవడంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని మదుపరుల్లో ఆశలు నెలకొన్నాయి. చదవండి : సెన్సెక్స్ 3,935 పాయింట్లు డౌన్ -
షార్ట్ కవరింగ్ : లాభాల్లో సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. షార్ట్ కవరింగ్ కారణంగా వరుస నష్టాలు చెక్ పడింది. సెన్సెక్స్ 114 పాయింట్లు ఎగిసి 39075 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 11704 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 11700కిపైన కొనసాగుతోంది. జీ ఎస్ బ్యాంకు, ఎస్బీఐ ఇండియా బుల్స్, హెచ్‌యూఎల్, డాబర్ , రిలయన్స్ ఇన్ఫ్రా,నష్టపోతున్నాయి. జెట్ ఎయిర్వేస్ ఫ్యూచర్స్‌లో 10 పది శాతం పడిపోయింది. మరోవవైపు పవర్‌గ్రిడ్, ఇండస్ ఇండ్ లాభపడుతున్నాయి. అటు డాలరు మారకంలో రుపీ పాజిటివ్‌గా ప్రారంభమైంది. 69.83 వద్ద ట్రేడింగ్నుప్రారంభించింది. పోమవారం 69. 90 వద్ద ముగిసింది. -
షార్ట్ కవరింగ్‌తో స్వల్ప లాభాలు
79 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ముంబై: అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల చివరిరోజు గురువారం ఇన్వెస్టర్లు తమ షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకుని నవంబర్ సిరీస్‌కు రోలోవర్ కావడం మార్కెట్లు నష్టపోకుండా కాపాడింది. మారుతి సుజుకి, హీరోమోటో కార్ప్ కంపెనీల ఫలితాలు అంచనాలకు మించి ఉండడం సానుకూల ప్రభావాన్ని చూపాయి. దీంతో సెన్సెక్స్ ప్రారంభంలో నష్టాల్లో ట్రేడ్ కాగా, మధ్యాహ్నం నుంచి లాభాల్లోకి ప్రవేశించింది. చివరికి 79 పాయింట్ల లాభంతో 27,915.90 వద్ద ముగిసింది. వరుసగా గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 342 పాయింట్ల మేర నష్టపోయిన విషయం తెలిసిందే. నిఫ్టీ ఎలాంటి మార్పు లేకుండా క్రితం ముగింపు అయిన 8,615.25 వద్దే ఫ్లాట్‌గా ముగిసింది. అంతకుముందు ఇంట్రాడేలో 8,550 నుంచి 8,624 మధ్య చలించింది. డెరివేటివ్‌ల ఎక్స్‌పయిరీ రోజున షార్ట్ కవరింగ్ రావడం, గురువారం వెలువడిన కంపెనీల త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండడం మార్కెట్లను తక్కువ స్థాయిల నుంచి కోలుకునేలా చేశాయని జియోజిత్ బీఎన్పీ పారిబా రీసెర్చ్ హెడ్ వినోద్‌నాయర్ చెప్పారు. అదే సమయంలో బ్యాంకు ఎన్పీఏల అంశంపై ఆందోళనలు కొనసాగడం, మొత్తం మీద కంపెనీల త్రైమాసిక ఆదాయాలు బలహీనంగా ఉండడం మార్కెట్ల డెరైక్షన్ విషయంలో ఉత్సాహానికి బ్రేక్ వేసిందన్నారు. ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరగ్గా, మిడ్ క్యాప్ 1 శాతం, స్మాల్ క్యాప్ 0.77 శాతం నష్టపోయాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బుధవారం నికరంగా రూ.1,450 కోట్ల మేర విక్రయాలు జరిపారు. టాటా షేర్లకు మరింత నష్టాలు మారుతి సుజుకి లాభం 60 శాతం వృద్ధి చెందినా కంపెనీ షేరు 0.21 శాతం నష్టపోయింది. మెరుగైన ఫలితాలను ప్రకటించిన హీరో మోటోకార్ప్ షేరు కూడా 3.12 శాతం నష్టాన్ని ఎదుర్కొంది. టాటా గ్రూపు స్టాక్స్ గురువారం కూడా నష్టాల బాటలో కొనసాగాయి. టాటా పవర్, టాటా మోటార్స్ ఒకటిన్నర శాతం తగ్గాయి. టాటా స్టీల్ అర శాతం, టాటాపవర్ 2 శాతం నష్టపోగా, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా మెటాలిక్స్ 5 శాతం, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 5.43 శాతం వరకూ తగ్గాయి. ఇండియన్ హోటల్స్ 6 శాతం, టాటా టెలీ సర్వీసెస్ షేర్ల ధరలు 10 శాతం వరకూ పడిపోయాయి. టిన్‌ప్లేట్ 4 శాతం, టాటా కాఫీ, టోయోరోల్స్ 3 శాతం వరకు నష్టాలను ఎదుర్కొన్నాయి. టీసీఎస్ మాత్రం 0.68 శాతం లాభంలో ముగిసింది. ఆసియా మార్కెట్లలో జపాన్ నికాయ్ 0.32 శాతం, షాంఘై కాంపోజిట్ 0.13 శాతం, హాంగ్‌కాంగ్ హ్యాంగ్‌సెంగ్ 0.83 శాతం నష్టపోయాయి. యూరోపియన్ మార్కెట్లు కూడా ప్రారంభంలో నష్టాల్లోనే కొనసాగాయి. -
ఊగిసలాటలో మార్కెట్
సెన్సెక్స్‌కు 54 పాయింట్లు, నిఫ్టీకి 18 పాయింట్లు లాభం స్టాక్ మార్కెట్ శుక్రవారం షార్ట్ కవరింగ్ కారణంగా స్వల్పలాభాలతో గట్టెక్కింది. ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి, మే వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి(మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెల్లడయ్యాయి) నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్రమైన ఊగిసలాటకు గురయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 26,425 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 7,983 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, విద్యుత్, రిఫైనరీ, వాహన షేర్లలో కొనుగోళ్లు జరగగా, ఐటీ, టెక్నాలజీ, మెటల్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు, కీలక గణాంకాల వెల్లడి కారణంగా ఇన్వెస్టర్లు జాగరూకతగా వ్యవహరించడం మార్కెట్ లాభాలకు కళ్లెం వేశాయని నిపుణులంటున్నారు. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,205 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.12,623 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,96,271 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టరు లరూ.671 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.706 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.